Friday, May 3, 2024

మంగళగిరిలో ఎన్నికల ఫీవర్ …. నియోజకవర్గంపై అయోధ్య రామిరెడ్డి ప్రత్యేక దృష్టి

మంగళగిరి ఏప్రిల్ 22 ప్రభ న్యూస్- ముందస్తు ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ఏపీలో ఒకేసారి ఎన్నికలు ఉంటాయని ఓ ప్రక్క ప్రచారం వినిపిస్తుంటే కాదు కాదు. 2024 లోనే యధావిధిగా ఎన్నికలు జరుగుతాయని మరో ప్రక్క టాక్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ వేడిని ఆసక్తిని రగిలించే మంగళగిరిలో ఎన్నికల ఫీవర్ మొదలైనట్లుగా కనిపిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైసిపిలు రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇరు పార్టీలు పోటాపోటీగా ప్రజలకు చేరువయ్యేందుకు సేవా కార్యక్రమాల్లో తలమునకులవుతున్నాయి. తద్వారా తమ పార్టీకి ఓటు బ్యాంకు ను సమకూర్చుకునే పనిలో పడ్డాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి నుంచి పోటీ చేయరు అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన సోదరుడు అయోధ్యరామిరెడ్డి మంగళగిరి పై ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటూ వస్తున్నారు. దీని వెనుక రాజకీయ వ్యూహం లేకపోలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇదే లక్ష్యంగా ఆయన గత ఇదేళ్లుగా ప్రణాళికా బద్దంగా ముందుకెళ్తున్నారు. వినూత్న సేవా కార్యక్రమాల ద్వారా ఓడిన చోటనే విజయం సాధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

బిసిల జపం!
మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 2,70,000 మంది పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం బిసి ఓటర్లు అందులోనూ పద్మశాలీ సామాజిక వర్గం వారు ఎక్కువగా వున్నారు. వీరు ఎటువైపు మొగ్గుచూపితే ఆ పార్టీకి విజయం వరిస్తుందనే బలమైన టాక్ ఉంది. రాష్ట్రంలో పద్మశాలి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న మూడు నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. అందుకే రాజకీయ పార్టీలు ఆ సామాజిక వర్గ ఓటర్లను తమకు సెంటిమెంట్ అస్త్రంగా భావిస్తారు.నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల కేటాయింపులలోనూ ఆ సామాజిక వర్గానికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. అధికార వైసిపి మంగళగిరి స్థానాన్ని పద్మశాలి సామాజిక వర్గానికి కేటాయిస్తుందని ఆ సామాజిక వర్గ నేతలు ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న తమకు కనీసం మంగళగిరి వంటి ఒక నియోజకవర్గంలోనైనా అవకాశం కల్పిస్తారనే భావనలో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో గురువారం ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తిరిగి ఆర్కే నే పోటీ చేస్తారని అన్నారు. అయోధ్యరామిరెడ్డి అధికారికంగా ప్రకటించలేదు కదా… కచ్చితంగా బీసీ నేతకే జగన్ టికెట్ ఇస్తారు అంటూ ఆ వర్గ నేతలు దీమాను వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రక్క ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మంగళగిరి పై ప్రత్యేక దృష్టి సారించి తరచూ పర్యటిస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళుతున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా సేవా కార్యక్రమాలకు సైతం వెనుకాడటం లేదు.ఈ తరుణంలో అధికార వైసీపీలోని చేనేత వర్గ నేతల ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

వై సి పిలో రాజీనామాల పర్వం
మంగళగిరిలో అధికార పార్టీ వైసీపీలో నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామా చేయటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఈపూరి రమేష్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. తాజాగా శివాలయం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో కొందరు ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ఓ కీలక నేత పార్టీని వీడనున్నట్లు సమాచారం.ఇందుకు స్థానిక నాయకత్వం పై ఉన్న అసంతృప్తి కారణమని చెబుతున్నారు.
ప్రత్యర్థి పార్టీ ఏ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినప్పటికీ టిడిపి తరఫున మాత్రం లోకేష్ బరిలోకి దిగటం ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో బీసీలకు మంగళగిరి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి అన్న పుకార్లు షికార
ర్లు చేస్తున్నాయి. దీనిని స్థానిక కార్యకర్తల కొట్టి పారేస్తున్నారు. మంగళగిరి స్థానం గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానని లోకేష్ గతంలో ఓ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికలు లోకేష్ కు ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఏది ఏమైనా రాజకీయ చైతన్యం కలిగిన మంగళగిరిలో ఎన్నికల ఫీవర్ మొదలైందని ప్రస్తుత పరిస్థితులను బట్టి స్పష్టంగా చెప్పవచ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement