Saturday, May 4, 2024

ఎనిమిదేళ్ల విద్యార్థిని​ అదృశ్యం.. స్కూలుకు వెళ్లి అటునుంచి అటే..

ఏపీలోని గుంటూరు జిల్లాలో స్కూల్​కు వెళ్లిన ఓ స్టూడెంట్​ కనిపించకుండా పోయిన ఘటన జరిగింది. ఆ పాప అదృశ్యమైన విషయం తెలుసుకుని స్కూల్​ యాజమాన్యం, విద్యార్థిని తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు.  రెండు గంటల ఉత్కంఠ తర్వాత అదే గ్రామంలో మరో వీధిలో ఆచూకీ దొరికడంతో ఊపిరి పీల్చుకున్నారు..

మంగళగిరి రూరల్, (ప్రభ న్యూస్) : గుంటూరు జిల్లా మంగళగిరి -తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధి యర్రబాలెంలో ఈరోజు (గురువారం) ఈ ఘటన చోటు చేసుకుంది. యర్రబాలెం గ్రామంలోని స్పెన్సర్ సెంటర్ కు చెందిన ఎనిమిదేళ్ల లాస్య  అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. రోజు మాదిరి గానే పాఠశాలకు వచ్చిన  బాలిక లాస్య కు మధ్యాహ్నం 12 గంటల సమయంలో  తల్లి భోజనం పెట్టి ఇంటికి  వెళ్లిపోయింది. తల్లి వెళ్లిన కొద్ది సేపటికే బాలిక కూడా బ్యాగు తీసుకుని పాఠశాల నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికి  ఈ విషయాన్ని గమనించిన టీచర్లు విద్యార్థిని తల్లికి ఫోన్ చేశారు. అయితే తమ కూతురు ఇంటికి రాలేదని ఆమె చెప్పి హుటాహుటీన పాఠశాల వద్దకు వచ్చి స్థానికులతో కలసి పరిసర ప్రాంతాల్లో వెతికింది. అయినా ఆచూకీ లేకపోవడంతో ఇక అందరిలోనూ టెన్షన్​ మొదలైంది.

దీంతో పారిశ్రామికవాడలోని ఓ కంపెనీ ఆవరణలో బిగించిన సీసీ కెమెరా పుటేజిని పరిశీలించగా విద్యార్థిని లాస్య వాల్మీకీ దేవాలయం వీధి వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపించింది. ఆ బాలిక తల్లి, పాఠశాల ఉపాధ్యాయునులు, స్థానికుల సహాయంతో  ఆ దారిలో వెతికినా ఫలితం లేదు. దీంతో సమీపంలోని కంపెనీలో సీసీ కెమెరా ఉన్నా అది పని చేయడం లేదని కార్మికులు తెలిపారు. ఒక మంగళగిరి రూరల్ పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు ఇచ్చేందుకు బయలుదేరింది.

ఇంతలో గ్రామంలోని 60 లింకుల రోడ్డు భావనారుషి ఆలయం వద్ద ఓ పాప ఏడుస్తూ కూర్చుని ఉండటాన్ని స్థానికులు గమనించారు. వివరాలు అడిగితే తన పేరు లాస్య అని, ఓ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నానని చెప్పింది. అయితే తల్లిదండ్రుల పేర్లు మాత్రం అడిగినా  చెప్పలేదు.  ఆ పాఠశాలకు చెందిన టీచర్​ ఒకరు స్థానిక మహిళకు పరిచయం ఉండటంతో వెంటనే ఫోన్ చేసి సమాచారం అందించింది. దీంతో స్కూల్​ టీచర్లు.. బాలిక తల్లిని తీసుకుని 60 లింకుల రోడ్డు భావనారుషి ఆలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఏడుస్తూ కూర్చొన్న బాలిక తన తల్లిని  చూసి పరుగున వచ్చి  కౌగిలించుకుని కన్నీళ్ల పర్యంతమైంది. రెండు గంటల ఉత్కంఠ తర్వాత బాలిక ఆచూకీ లభించడంతో  తల్లితో పాటు పాఠశాల టీచర్లు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement