Wednesday, May 1, 2024

నిధులివ్వండి, అభివృద్థికి సహకరించండి.. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 2828 కోట్ల నిధుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌తో విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎంపీలు బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన 11 సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ… ఏపీకి కేటాయించిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 30 కోట్లకు పని దినాలను పెంచాలని కేంద్రమంత్రిని కోరామన్నారు. ఉపాధి హామీ పథకం కింద గిరిజన ప్రాంతాలలో కాఫీ ప్లాంటేషన్ పనులకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధి హామీ పథకం కింద ఉద్యానవన సాగుకు మినహాయింపులు ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం నిధులను స్మశాన వాటికల ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పనులకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని ఎంపీలు గిరిరాజ్ సింగ్‌కు వివరించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని వినతి చేశామన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో 113 కిలోమీటర్ల రోడ్డు పనులను అదనంగా పీఎం గ్రామీణ సడక్ యోజనలో చేర్చాలని, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద దంగేరు గ్రామానికి రూ. 324 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ఎంపీలు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement