Sunday, May 19, 2024

531 డి ఫార్మసీ సీట్లు భర్తీ.. రేప‌టి నుంచి తరగతులు !

అమరావతి, ఆంధ్రప్రభ: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిఫార్మసీ (పాలిటెక్నిక్‌) కోర్సుకు సంబంధించిన ప్రవేశాల కౌన్సిలింగ్‌ షేడ్యూలు ముగిసింది. రేప‌టి (మంగ‌ళవారం) నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో మొత్తం 48 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 3044 సీట్లు ఉండగా, 531 సీట్లు భర్తీ చేసామని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌, ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. ఇంటర్మీడియట్‌ అర్హతతో పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండు సంవత్సరాల డిప్లమో ఇన్‌ ఫార్మసీ అడ్మిషన్ల కోసం నిర్దేశించగా, సీట్ల కేటాయింపు వివరాలను సోమవారం విడుదల చేసారు.

9 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లలో 506 సీట్లు ఉండగా 223 మంది అడ్మిషన్లు పొందారు. 39 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ లలో 2538 సీట్లు ఉండగా 308 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ప్రవేశాల ప్రక్రియ కోసం మొత్తం అర్హత పొందిన అభ్యర్థుల సంఖ్య 762కాగా, నమోదైన అభ్యర్థుల సంఖ్య 547గా ఉంది. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం హాజరైన అభ్యర్థులు 540 మంది కాగా, ఆప్షన్లను ఎంపిక చేసుకున్న వారు 531 మంది ఉన్నారు. అయా కళాశాలల్లో సీట్లు పొందిన అభ్యర్దులు ఈ నెల ఐదవ తేదీ నుండి ఏడవ తేదీ లోపు వ్యక్తిగతంగా రిపోర్టు చేయవలసి ఉంటుంది. అయితే తరగతులు నేటి నుంచే ప్రారంభం కానున్నాయని, విద్యార్ధులు వేగంగా వ్యక్తిగత రిపోర్టింగ్‌ను పూర్తి చేయాలని ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement