Saturday, March 2, 2024

Cyclone Michaung – బాప‌ట్ల తీరంలో తుఫాన్ …మ‌రికొద్ది సేప‌టిలో బాపట్ల – నెల్లూరు మధ్యలో దాటే అవ‌కాశం..

మిచాంగ్ తుపాను ప్ర‌స్తుతం బాప‌ట్ల తీరాన్ని తాకింది.. ఈ తుఫాన్ నేటి మ‌ధ్యాహ్నంకు బాప‌ట్ల – నెల్లూరు మ‌ధ్య తీరాన్ని దాట‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ తెలిపింది. కొంతభాగం సముద్రంలో.. మరికొంత భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు తెలిపింది.

ఎపి అంత‌టా భారీ వ‌ర్షాలు…
‘మిగ్‌జాం’ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వర్షాల తీవ్రతకు నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఆ జిల్లాలో తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలోని 9 మండలాల్లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. నెల్లూరు, కావలి, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. వర్షం, ఈదురుగాలులతో చలి తీవ్రత పెరిగిపోయింది..

తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను తితిదే అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరదనీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వర్షం, గాలుల తీవ్రతకు బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా సరఫరా లేదు. తుపాను ప్రభావంతో వీస్తున్న గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది. పలుచోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.

కాగా, బాపట్లలో 21.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, నెల్లూరులో 28.95 సెం.మీ., మచిలీపట్నంలో 14.93 సెం.మీ., కావలిలో 14.26 సెం.మీ., ఒంగోలు 11.44 సెం.మీ., కాకినాడలో 5.9 సెం.మీ., నర్సాపూర్‌లో 5.85 సెం.మీ., అనకాపల్లిలో 3.35 సెం.మీ., పొదలకూరులో 20.75 సెం.మీ., రేపల్లె 1.17 సెం.మీ., చిత్తూరు 1.25 సెం.మీ., నర్సారావుపేట 1.15 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది. తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరణుడు విరుచుకుపడుతున్నాడు. తుఫాను తీవ్రత దృష్ట్యా నిజాంపట్నం హార్బరులో అధికారులు పదో నంబర్‌ ప్రమాద సూచిక జారీచేశారు. హార్బర్‌ సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారుల సూచించారు. నిజాంపట్నం తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

విజయవాడలో రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతున్నది. దీంతో ఇంద్రాకీలాద్రి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రాత్రి వర్షం కురుస్తున్నది. దీంతో అధికారులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లా దివిసీమలో ఎడతెరపిలేకుండా వర్షం పడుతున్నది. నాగాయలంకలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం వస్తున్నది. దీంతో వేల ఎకరాల్లో వరిపంట నేలవాలింది. పంట పొలాల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఒక్కో గేటును ఎత్తి టీటీడీ అధికారులు నిటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement