Friday, April 26, 2024

విపక్షాలను గుర్తించినందుకు సంతోషం: సీపీఐ రామకృష్ణ

వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల తరువాత ప్రతిపక్షాలను గుర్తించినందుకు సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారుడు సజ్జలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ రూ.3 వేలు ఇస్తామని చెప్పి 250 రూపాయలు పెంచి, కొత్త పథకంలా ప్రకటనలు ఇచ్చుకున్నారని విమర్శించారు. పాత పథకాలను కొత్తగా శంకుస్థాపన చేసినట్టుగా జనవరి 1వ తేదీన అట్టహాసంగా ప్రకటనలు ఇచ్చారన్నారు. పేదల ఇళ్లకు రూ. 10 వేల ఖర్చుపెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామన్న రామకృష్ణ.. ముందు పట్టణాల్లో 2 సెంట్ లు, పల్లెల్లో 3 సెంట్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 10 వేల కోట్లు ఇళ్ల స్థలాలకు ఖర్చు చేస్తే అందులో 4 వేల కోట్లు అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలం అమ్ముకోవచ్చు,కుదువ పెట్టుకోవచ్చు, తిరిగి దరిద్రంలో బ్రతకవచ్చు అని ప్రచారం చేశారంటూ ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం కట్టించే ఇల్లు గేటెడ్ కమ్యూనిటీనా లేదా అని ప్రశ్నించారు. జగన్ ప్యాలస్ లో బాత్రూం అంత సైజ్ లో ఇల్లు కట్టిస్తూ.. పేదరికాన్ని పారద్రోలుతారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓటీఎస్ పేరుతో పేదలను ఇల్లు అమ్ముకోవచ్చు అని ప్రోత్సహిస్తున్నారన్నారు. పేదలను బిచ్చగాళ్లను చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలుసన్న రామకృష్ణ.. రెండున్నరేళ్లలో ఎం అభివృద్ధి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటికరణను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అంబానీ, ఆదానిలకు కట్టబెడుతున్నారనీ ఆరోపించారు. రెండున్నరేళ్లలో రైతులకు ఎక్కడైనా ఇన్పుట్ సబ్సిడీ , క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పేదలకు ఇవ్వడానికి 5 వేల ఇళ్లు అమరావతి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. 50 వేల టిక్కో ఇల్లు పూర్తి అయినా కూడా వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement