Thursday, April 25, 2024

Breaking: ఆంధ్రప్రదేశ్ లో నవశకం.. నేడు 26 జిల్లాల నుంచి పాలన ఆరంభం

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన 26 జిల్లాలకు మారనుంది. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్‌వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుంది. కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం ఉదయం 9.05 – 9.45 గంటల మధ్య లాంఛనంగా ప్రారంభించనున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు.

కొత్త జిల్లాల కలెక్టరేట్‌లు, ఎస్పీ కార్యాలయాలు యుద్ధప్రాతిపదికన అవసరమైన మౌలిక సదుపాయాలతో సిద్ధమయ్యాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ వాగ్దానాన్ని నేడు కార్యరూపంలోకి తీసుకువస్తున్నారు. ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో సగటున ఆరు, ఏడు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 18 నుంచి 23 లక్షల జనాభా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటైంది.

మొత్తం 26 జిల్లాలు ఏర్పడిన 13 జిల్లా పరిషత్తులు మాత్రమే ఉండనున్నాయి. జిల్లా పరిషత్తుల పదవీకాలం ముగిసేవరకు యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు, మూడు జిల్లాలకు ఒక జడ్పీ ఛైర్మన్ ఉండనున్నారు. ప్రజా సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు, మూడు, నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.   

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు జిల్లా యూనిట్లను రీడిజైన్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అర్బన్ పోలీస్ జిల్లాల కాన్సెప్ట్‌కు స్వస్తి పలికింది. రాష్ట్రంలో రెండు పోలీసు కమిషనరేట్లు – విశాఖపట్నం, విజయవాడతో పాటు పోలీసు పరిపాలన కోసం 24 జిల్లా యూనిట్లు ఉంటాయి. మొత్తం 24 జిల్లా యూనిట్లకు ఎస్పీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. గుంటూరు, రాజమండ్రి, తిరుపతిలను భవిష్యత్తులో కమిషనరేట్లుగా అప్‌గ్రేడ్ చేయాలనే ఉద్దేశ్యంతో గతంలో అర్బన్ జిల్లాలను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొత్త జిల్లాల విస్తీర్ణాన్ని తగ్గించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement