Sunday, May 5, 2024

కరోనాతో సహజీవనం చేయాల్సిందే: సీఎం జగన్

ఆరోగ్య శ్రీలో చాలా మార్పులు తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలందరికి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ కింద 2,400 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని.. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించామన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని..ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామన్నారు. ఒకేసారి 1180 అంబులెన్స్‌ లను ప్రారంభించామని గుర్తు చేశారు. ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నామని.. నాడు- నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని తెలిపారు.

ప్రపంచానికే కొవిడ్‌ పెద్ద సవాల్‌గా మారిందని సీఎం జగన్ చెప్పారు.. గతంలో కరోనా శాంపిల్స్‌ పుణె పంపాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు ఏపీలో 150కి పైగా ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఫస్ట్ వేవ్‌ లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్‌ వేవ్‌లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నామని వివరించారు. కొవిడ్‌ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశామని.. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చామన్నారు. కరోనా రోగుల కోసం 47 వేల బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనూ 52 వేల బెడ్లను అందుబాటులోకి వచ్చాని వెల్లడించారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమని సీఎం ప్రకటించారు.

కొవిడ్‌ కేసులను వెంటనే గుర్తించి వేగంగా వైద్యం అందించడం ద్వారానే మరణాల రేటును తగ్గించగలుగుతున్నామన్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే.. 172 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అవసరం. కానీ దేశంలో నెలకు 7 కోట్ల డోసుల ఉత్పత్తికి మాత్రమే సామర్థ్యం ఉందన్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు 18.44 కోట్ల మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తైందన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే.. 7 కోట్ల డోసులు అవసరం ఉందని.. వ్యాక్సిన్ కోటా కేటాయింపు ప్రక్రియ పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉందన్నారు.

వ్యాక్సిన్‌ల గురించి అన్నీ తెలిసి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై సీఎం జగన్ మండిపడ్డారు. వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను కూడా పిలిచిందని.. వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం.. ప్రజలకు ఉచితంగా ఇస్తామన్నారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచిన తొలి రాష్ట్రం ఏపీ అని తెలిపారు. ఫస్ట్ ప్రయార్టీ 45 ఏళ్లు దాటిన వారు అనంతరం అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్లు వేయిస్తాం అని సీఎం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 17 ఆసుపత్రులు నోటిఫై చేశామన్నారు. ఎంత కష్టపడినా మరణాలను నివారించాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చూస్తే బాధేస్తోందన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తామన్నారు. కనీసం ఆ డిపాజిట్ పై వడ్డీతోనైనా బ్రతుకుతారని పేర్కొన్నారు. ఒకే రోజు 6.25 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, ఇదీ మన కెపాసిటీ అని దేశానికీ చూపించామన్నారు. కరోనా సమయంలో అందరూ కలిసి పని చేయాలని కోరారు. ఒకరినొకరు ప్రోత్సహించాలి, మద్దతుగా ఉండాలన్నారు. 60 శాతం మందికి వ్యాక్సిన్ వేస్తేనే బయటపడతామని సీఎం తెలిపారు. అప్పటి వరకు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని సీఎం జగన్ మరోసారి చెప్పారు.

రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయంపై బతుకుతున్నారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులకు కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలపై నీలం- ఆకుపచ్చ రంగుల్ని.. కుట్రలు పన్ని తుడిచేశారు కానీ జనం గుండెల్లో తీసేయలేకపోయారన్నారు. కరోనా సమయంలో కట్టడి కోసం అందరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. పథకాల అమలుకు ముందుగానే క్యాలెండర్ ప్రకటించిన ఘనత తమకే దక్కుతుందని సీఎం వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement