Friday, May 17, 2024

WAR: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న చిత్తూరు వైద్య విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు

రొంపిచెర్ల (ప్రభ న్యూస్): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వైద్య‌విద్యార్థి యుద్ధం జ‌రుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడు. దీంతో అత‌ని త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెందుతున్నారు. జిల్లాలోని రొంపిచెర్ల మండ‌లం కేంద్రంలోని జాండ్రవీధికి చెందిన వైద్య విద్యార్థి ఫహీమ్ అక్రమ్ (19) ఉక్రెయిన్ లో చిక్కుకుని ఉన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి మహబూబ్ బాషా, ఫామీదాల రెండవ కుమారుడు ఫహీమ్ ఉక్రెయిన్ లోని పోల్ట్ వా రాష్ట్ర మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే.. గురువారం ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండ‌డంతో విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనకు గుర‌వుతూ టీవీ ముందు కూర్చొని క‌న్నీరు కారుస్తున్నారు.

ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురవడంతో విద్యార్థి ఫహీమ్ కుటుంబసభ్యులు భయపడి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు తాను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా.. మరోవైపు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇండియాకు రావడానికి ఎయిర్ లైన్స్ టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని విద్యార్థి తెలిపారు. రూ. 35 వేలు ఉన్న టికెట్ ధర ప్రస్తుతం రూ.70 వేలు ఉంద‌ని తెలియజేశాడు. 30 నిమిషాలకు ఒకసారి అక్కడక్కడా బాంబులు పడుతున్నాయని, తాము కూడా భ‌యాందోళ‌న‌లో ఉన్న‌ట్టు ఫ‌హీమ్ తెలిపాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తగు చర్యలు తీసుకొని త‌మ‌ను ఇండియాకు తీసుకెళ్లాల‌ని విద్యార్థి కోరాడు. ప్రస్తుతం అత‌ను మాట్లాడిన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement