Thursday, May 2, 2024

ఏపీలో జూన్ 1 నుంచి 15 వరకు లాక్ డౌన్.. ఎక్కడంటే..

ఏపీలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజులుగా కర్ఫ్యూ కఠినంగా అమలువుతున్నా కొన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొవిడ్ నియంత్రణపై జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాల్లో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకే షాపులు తెరవాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతోంది.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నందున చిత్తూరు జిల్లా కరోనాకు హాట్ స్పాట్ గా మారిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలో జూన్ 1వతేదీ నుంచి 6గంటల నుంచి 10గంటల వరకే షాపులకు అనుమతి ఇస్తామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల తరువాత కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. ఆనందయ్య మందుపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఔషధ పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కోవిడ్ ను నియంత్రించేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందన్నారు. ఆగష్టు లోగా  వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎపిలో పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 1వతేదీ నుంచి 15వతేదీ వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తామని మంత్రి పెద్ది రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement