Thursday, April 25, 2024

ఢిల్లీకి చేరిక గ్లాసు గోల‌….

న్యూఢిల్లీ /అమరావతి ఆంధ్రప్రభ బ్యూరో: గ్లాసు గుర్తు వివాదం ఢిల్లీకి చేరింది. గత ఎన్నికల తో పాటు స్థానిక సంస్థ ల ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును నవతరం పార్టీకి కేటాయించడంపై బీజేపీ, జనసేనలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి పై రెండు పార్టీలు సంయుక్తంగా ఫిర్యాదు చేశాయి. దీంతో గుర్తుల గోల హస్తినాకు చేరినట్లయింది.
సోమవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ నేతృత్వంలో బీజేపీ నేతలు వైఎస్‌ చౌదరి (సుజనా చౌదరి), జీవీఎల్‌ నరసింహారావు, సునీల్‌ దేవధర్‌, సీఎం రమేశ్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిశారు.
ప్రస్తుతం తిరుపతి పార్లమెంట్‌కు జరుగుతున్న ఉప ఎన్ని కల్లో నవతరం పార్టీకి గ్లాసు గుర్తును కేటాయించారు. అయితే అదే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను బరిలోకి దించారు. ఆమె బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నప్పటికీ జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ మేరకు ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పార్లమెంట్‌ పరిధిలో రత్నప్రభ గెలుపు కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. అదే గుర్తును ఉప ఎన్నికల్లో నవతరం పార్టీకి కేటాయించడంతో పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు పొరపాటు పడే అవకాశం ఉంటుందని జనసేన, బీజేపీలు ముందుచూపుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తక్షణమే విచారించి నవతరం పార్టీకి ఇచ్చిన గ్లాసు గుర్తును రద్దు చేసి మరో గుర్తును ఇవ్వాలని ఫిర్యాదులో పేర్కొన్నాయి.
అయోమయం సృష్టించే కుట్ర: జీవీఎల్‌
తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లను గందరగోళపరిచేందుకు గుర్తు విషయంలో సాంకేతిక కారణాలను ఆసరా చేసుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఎక్కడైనా లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ నియోజకవర్గం విస్తరించిన జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించినందున ఆ రెండు జిల్లాల్లో కేంద్ర ఎన్నికల సంఘం విధించిన కోడ్‌ అమల్లో ఉంటుందని గుర్తుచేశారు. ఈ కోడ్‌ అమల్లో ఉండగా ఆ రెండు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం కోడ్‌ ఉల్లంఘన అవుతుందని అన్నారు. ఎన్నికల మధ్యలో ఎన్నికలు నిర్వహించడం వెనుక అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుట్ర దాగి ఉందని జీవీఎల్‌ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందంటూ
బీజేపీ – జనసేన కూటమిని ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తునే కేటాయించినప్పటికీ, తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఆ గుర్తును మరో పార్టీకి కేటాయించడం ద్వారా ఓటర్లలో అయోమయం సృష్టించి గందరగోళపరుస్తున్నారని వైకాపా నేతలపై విరుచుకుపడ్డారు. ఓవైపు ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధమని చెప్పిన వైకాపా సర్కారు చెప్పడంలోనే దురుద్దేశాలు దాగున్నాయని జీవీఎల్‌ మండిపడ్డారు. గుర్తుల విషయంలో ఓటర్లను గందరగోళపర్చడం కోసమే ఎన్నికల మధ్యలో ఎన్నికలు తీసుకొచ్చారని దుయ్యబట్టారు. గుర్తుల గందరగోళం ద్వారా బీజేపీకి దక్కాల్సిన ఓట్లు దక్కకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
మా గుర్తు మరొకరికి ఎలా కేటాయిస్తారు?: నాదేండ్ల మనోహర్‌
తమ ఎన్నికల గుర్తును తిరుపతి ఉపఎన్నికల్లో నవతరం పార్టీకి ఎలా కేటాయిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. ఇదంతా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కుట్రపూరిత చర్యేనని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించి అయోమయానికి గురిచేయడమే లక్ష్యంగా కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ పార్టీ దురుద్దేశాలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు ఆయన చెప్పారు.
మా కూటమి అంటే భయంతోనే వైకాపా కుట్ర రాజకీయాలు: సునీల్‌ దేవధర్‌
భారతీయ జనతా పార్టీ – జనసేన కూటమికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో భయం పట్టుకుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల సహా ఇంచార్జి సునీల్‌ దేవధర్‌ అన్నారు. అందుకే వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కూటమికి దక్కాల్సిన ఓట్లు దక్కకుండా వైకాపా నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకేసారి జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నికల్లో ఒకే గుర్తును వేర్వేరు పార్టీలకు కేటాయించడం వెనుక ఈ దురుద్దేశాలే దాగున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో కేంద్ర పరిశీలకులను పెట్టాలి: సీఎం రమేశ్‌
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం కోసం ఆ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కొక్క పరిశీలకుణ్ణి కేంద్ర ఎన్నికల సంఘం నియమిం చాలని కోరినట్టు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరగడానికి స్థానికంగా నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చారని సీఎం రమేశ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement