Thursday, May 2, 2024

72 గంట‌ల‌లో ధాన్యం మొత్తం కొనాల్సిందే – జ‌గ‌న్ కు చంద్ర‌బాబు అల్టీమేట‌మ్

రాజమహేంద్రవరం, ప్రభన్యూస్‌ బ్యూరో: రానున్న 72గంటల్లో తడిచిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో ధాన్యాన్ని అంతా తాడేపల్లి తరలించి ముఖ్యమంత్రి ఇంటి ముందు పోద్దాం. పోరాడితే నష్టంలేదు. కేసులు పెడతారని రైతులు భయపడొద్దు. నష్టపోయిన రైతులందర్నీ ఆదుకునే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉందాం. రైతులకు అండగా ఉంటాం. వారికి న్యాయం జరిగే వరకు పోరాడు తూనే ఉంటామంటూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు రైతులకు పిలుపుని చ్చారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో శనివారం ఆయన పర్యటించారు. అకాల వర్షాలకు తడిచి ముద్దయిన ధాన్యాన్ని చంద్రబాబు పరిశీలించారు. పలుచోట్ల ఆయన రైతులనుద్దేశించి ప్రసంగించారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనలేదన్న బాధతో పారబోయోద్దంటూ చంద్రబాబు సూచించారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్దంకమ్మని వారికి ఉద్బోదించారు. వారి కోసం తానున్నానంటూ భరోసా కల్పించారు. రైతు పీకల్లోతు కష్టాల్లో ఉంటే కనీసం పరామర్శించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌కు కొరవడిందన్నారు. రైతులు, కౌలుదార్లు తీవ్రంగా నష్టపోతే వైకాపా నాయకులు, మిల్లర్లు కలసి వార్ని దోపిడీ చేస్తున్నారన్నారు. నిబంధనల పేరిట రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మంత్రులు సొల్లు కబుర్లు చెబుతున్నారన్నార ు. ఏ ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటనలకు రావడంలేదన్నారు. కనీసం రైతుల్ని కలిసి వారికి భరోసా నివ్వడంలేదన్నారు. వారికి ధైర్యం కల్పించేందుకే తానొచ్చానన్నారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అధిగమించి రైతుల్ని కలుస్తున్నానన్నారు. రైతులకు అండగా తానున్నానన్నారు. వారి తరపున పోరాటం చేస్తానన్నారు

ఆత్మహత్యలొద్దు :
రైతులెవరూ అప్పులకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ మెడలొంచైనా న్యాయం చేసే బాధ్యత తనదని చెప్పారు. అయితే రైతులంతా ఐక మత్యంగా ఉంటేనే వారికి న్యాయం జరుగుతుందన్నారు. పేద రైతులు, కౌలుదార్ల పట్ల ప్రభుత్వం అహంభావంతో వ్యవహరిస్తోందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో తాను మూడ్రోజుల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చంద్రబాబు చెప్పారు. ఎక్కడా రైతు భరోసా కేంద్రాలు పని చేయడంలేదన్నారు. అవన్నీ రైతు దగా కేంద్రాలుగా మారాయన్నారు. ధాన్యం సేకరణలో ఆర్‌బికె వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. కనీసం ఇది నిబంధనల ప్రకారం పనిచేయడంలేదన్నారు. అసలు రైతులు మిల్లర్లకు డబ్బులెందుకు కట్టాలని చంద్రబాబు నిలదీశారు. మొన్నటి వరకు ఆర్‌బికెల్లో ఆన్‌లైన్‌ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆఫ్‌లైన్‌ అంటున్నారు. అందుకే దీన్ని తాను తుగ్లక్‌ పాలనగా అభివర్ణిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
దళారుల రాజ్యం :
రాష్ట్రంలో దళారుల రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. అన్నిరంగాల్లోనూ ప్రభుత్వం విఫలమైదంన్నారు. రైతుల్ని దగా చేస్తున్నారన్నారు. దళారులు దోచుకు తింటున్నారన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లిండంలేదన్నారు. కొంతసొమ్ము మధ్యవర్తుల జేబుల్లోకెళ్తోందన్నారు. రైతుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే కేసులెట్టి అరెస్ట్‌ చేస్తారన్న భయంతో వణుకుతున్నారన్నారు. ప్రభుత్వ విధానాలు రైతుల్లో పిరికితనాన్ని నూరిపోసాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలురాలేదన్నారు. తాము మధ్యవర్తుల్ని కఠినంగా అణిచేశామన్నారు. అక్రమాలకు పాల్పడిన రైస్‌ మిల్లర్లను అరెస్టులు చేశామన్నారు. సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా భాస్కరరెడ్డి, మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా ఆయన కొడుకు వ్యవహరిస్తున్నారు. ఇంకో కొడుకు అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంతా కలసి రైతును దోచుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పెళ్ళిళ్ళు,పేరంటాల్లో బిజీగా ఉన్నారన్నారు. రైతుల బాధలు ఆయనకు పట్టడంలేదన్నారు. పంటకు బీమా చేయించుంటే రైతులు ఇప్పుడు నష్టం నుంచి గట్టెక్కుండేవారన్నారు.

ఎకరాకు రూ. 25వేల పరిహారం :
వరి రైతుకు ఎకరాకు రూ. 25వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మొక్కజొన్నరైతుకు కూడా ఎకరానికి 25వేల చొప్పున చెల్లించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రైతులు ఈ దుస్తితిని ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు తమ నష్టాల్ని వీడియో తీసి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. వారు చెల్లించని పక్షంలో తాను అధికారంలోకొచ్చాక నష్టపరిహారాన్నిస్తానన్నారు. అలాగే సొంత వ్యవహారాలకే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్‌ ఇంటికే ధాన్యాన్ని పంపుదామన్నారు. అలాగే పోరుబాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement