Friday, May 3, 2024

నాబార్డు నిధులు వినియోగించుకోరా? మురిగిపోతున్న అంగన్వాడీ అభివృద్ధి నిధులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అంగన్వాడీలు, వాటి సమీపంలోని పాఠశాలల అభివృద్ధికి నాబార్డు విడుదల చేసిన నిధులను ఇంతవరకూ శిశుసంక్షేమ శాఖ సద్వినియోగం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఏడాది కాలంగా రూ. 600 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండటంతో అసలు ఈ నిధులను వినియోగించుకుంటారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. నాబార్డు ఆర్‌ఐఐడీఎఫ్‌- 26 కింద అంగన్వాడీ భవనాల నిర్మాణం కోసం రూ. 101.98 కోట్లు నాడు- నేడు ద్వారా పాఠశాల భవనాల మరమ్మతులు, పునర్నిర్మాణం, మరో రూ. 554 కోట్లను నాబార్డు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లోని 469 మండలాల్లో 1714 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి రూ. 101.98 కోట్లను గతేడాది ఏప్రిల్‌లో నాబార్డు మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం ఈ నిధులను ఏడాదిలోగా సద్వినియోగం చేసుకోవాల్సి ఉండగా.. వాటిని ఇంతవరకూ వినియోగించుకోని పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై నాబార్డు చైర్మన్‌ గత నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ కూడా రాశారు. నిధుల వినియోగానికి మరికొంత గడువునిచ్చినా, ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖ అధికారుల్లో ఏ మాత్రం చలనం కనిపించడం లేదు.

కనీసం అడ్వాన్స్‌ మొబిలైజేషన్‌ కూడా చేయకపోవడంతో ఈ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఆర్థిక భారంగా ఉన్న పరిస్థితుల్లో నాబార్డు నిధులను వినియోగించుకోవాల్సి ఉండగా.. ఆ దిశగా ప్రయత్నాలేవీ సాగకపోవడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దాదాపు 1700కుపైగా అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం రూ. వంద కోట్లతో చేసుకునే అవకాశం ఉన్నా.. ఆ విధమైన చర్యలు ఎక్కడా చేపట్టడం లేదు. మరోవైపు పాఠశాలల అభివృద్ధి నిధులు కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. దాదాపు రూ. 550 కోట్ల మేర నిధులు ఉన్నా.. ఫలితం లేని పరిస్థితి ఉంది. 663 మండలాల్లో 9379 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 20 శాతం మేర నిధులను మొబిలైజేషన్‌ కింద ఇచ్చినా పనులు మాత్రం ప్రారంభం కాని పరిస్థితి ఉంది.

దీనికి ప్రధాన కారణం కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడమేనని తెలుస్తోంది. గతంలో చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ప్రస్తుతం కొత్త పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ఏడాది కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో మళ్లిd పనులు చేస్తే.. అవి కూడా ఎక్కడ ఆగిపోతాయోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో నాబార్డు ఉదారంగా ముందుకు వచ్చినా.. ఈ నిధులను శిశు సంక్షేమ శాఖ ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి ఉంది. తాజాగా నాబార్డు ఇచ్చిన గడువు సమయం కూడా ముగిసిపోతే ఈ నిధులు వెనక్కు వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఇదే విషయాన్ని నాబార్డు అధికారులు కూడా స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement