Tuesday, April 23, 2024

పన్నుల పెంపుతో పెరిగిన ఆదాయం.. పెట్రోల్‌, డీజిల్‌పై టాక్స్ తో 4.92 లక్షల కోట్లు…

పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై భారీగా పన్నులు విధించిన కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఖజానాలో వేసుకుంటోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పెట్రోల్‌, డీజిల్‌ పై పన్నుల రూపంలో 4 లక్షల 92 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలీ లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ రంగం నుంచి రాష్ట్రాలకు కూడా ఇదే కాలంలో 2 లక్షల 72 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.

2014లో పన్నులు..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014లో నాటికి పెట్రోల్‌పై లీటర్‌కు 9.48 రూపాయలు, డీజిల్‌పై 3.56 రూపాయల ఎక్సైజ్‌ డ్యూటీ ఉండేది. ఈ పన్నులు 2020 , మే నాటికి భారీగా పెరిగి పెట్రోల్‌పై లీటర్‌కు 32.98 రూపాయలు, డీజిల్‌పై 31.83 రూపాయిలకు పెరిగిందని మంత్రి తన సమాధానంలో వెల్లడించారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ఒక సారి, మే, 2022లో మరో సారి పన్నులు తగ్గించింది. ఈ రెండు సార్లు కలిపి పెట్రోల్‌పై లీటర్‌కు 13 రూపాయలు, డీజిల్‌పై 16 రూపాయలు తగ్గించినట్లు మంత్రి తెలిపారు.

186 శాతం పెరిగిన ఆదాయం..
ఈ ఏడు సంవత్సరాల్లో పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం 186 శాతం పెరిగింది. రాష్ట్రాలకు పన్నుల రూపంలో ఆదాయం 75 శాతం పెరిగిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2014 నంవబర్‌ నుంచి 2016 జనవరి వరకు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని 10 సార్లు పెంచినట్లు మంత్రి తెలిపారు. ఈ కాలంలో పెట్రోల్‌పై 12 రూపాయలు, డీజిల్‌పై 13.77 రూపాయలు పెంచినట్లు తెలిపారు. 2017, అక్టోబర్‌లో ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ పై లీటర్‌కు 2 రూపాయలు ఒక సారి, మరోసారి పెట్రోల్‌ పై 2 రూపాయలు, డీజిల్‌పై 1.5 రూపాయలు తగ్గించినట్లు వివరించారు. 2019లో మరోసారి పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు 2 రూపాయల చొప్పున రేట్లు పెంచారు.

2020లో మరోసారి పెంపు..
కోవిడ్‌ వచ్చిన సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో రేట్లు పెరిగాయన్న కారణంలో ప్రభుత్వం మరోసారి పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని భారీగా పెంచింది. పెట్రోల్‌పై లీటర్‌కు 13 రూపాయలు, డీజిల్‌పై లీటర్‌కు 16 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు.

స్వల్ప ఊరట..
ఇలా భారీగా పెంచిన పన్నుల్లో ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. 2021 నవంబర్‌లో ఒక సారి, 2022, మే నెలలో మరోసారి పెట్రోల్‌పై లీటర్‌కు 19.90 రూపాయలు, డీజిల్‌పై 15.80 రూపాయలు ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించినట్లు ఆయన వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న రేట్లకు అనుగుణంగా మన దేశంలో వాటి రేట్లను సవరించే విధానాన్ని అనుసరిస్తున్నామని మంత్రి తెలిపారు. వీటిని ఆయా పెట్రోలియం కంపెనీలే రేట్లను సవరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆయా సందర్భాల్లో ఎక్సైజ్‌ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ప్రభుత్వం 2021 నవంబర్‌, 2022 మే నెలలో ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement