Sunday, May 5, 2024

ఏపీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయం! విజయవాడ కేంద్రంగా ఏర్పాటుకు అడుగులు

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ కార్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈమేరకు ఆ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇది నిజమేనన్నట్లు నగరంలో పలు చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ల ఫోటోలతో ఉన్న ఆ ఫ్లెక్సీల్లోకక్షపూరిత రాజకీయాలకు స్వస్తి… ఏపీ అభ్యుదయానికి బీఆర్‌ఎస్‌ భరోసా అంటూ ప్లెnక్సీల్లో కొటేషన్స్‌ రాశారు. దీంతో ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ వ్యాప్తంగా పార్టీని విస్తృతపర్చే క్రమంలో ఏకంగా సీఎం జగన్‌ను టార్గెట్‌ చేస్తూ ఇక్కడ ఫ్లెక్సీలు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా విజయవాడ నగరంలోని జక్కంపూడి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు జాతీయ రహదారి సమీపంలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు ఆపార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ దాదాపుగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

సుమారు 800 గజాల్లో కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారని అంటున్నారు. కార్యాలయ నిర్మాణంతోపాటు పలు బాధ్యతలను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అప్పగించారని అంటున్నారు. ఈక్రమంలోనే ఆయన ఈనెల 18, 19 తేదీల్లో విజయవాడలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన జక్కంపూడి వెళ్లి పార్టీ నిర్మాణానికి అవసరమైన ప్రాంతాన్ని పరిశీలిస్తారని అంటున్నారు. ఈనెల 14వ తేదీన కేసీఆర్‌ ఢిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారని, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోను పార్టీ విస్తరణపై దృష్టిసారిస్తారని చెబుతున్నారు. ఈక్రమంలోనే పార్టీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడను కేంద్రంగా సీఎం ఎంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు రాజధానులంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్న వేళ తెలంగాణ కేసీఆర్‌ అమరావతి కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుండటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత పార్టీ విస్తరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించారు.

జాతీయ పార్టీ హోదా సాధించడానికి అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి పోటీచేస్తానని ప్రకటించిన కేసీఆర్‌ ఏపీలో ఒంటరిగా పోటీచేసే అవకాశం కనపడుతోంది. పార్టీ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించింది. విశాఖపట్టనాన్ని ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా మారుస్తున్నట్లు వెల్లడించింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం విజయవాడలోనే కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. దీన్నిబట్టి ఆయన అమరావతి రాజధానివైపు మొగ్గుచూపినట్లు కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement