Sunday, April 28, 2024

Big Story – ఎపిలో వైట్ స్టోన్ మాఫియా… ఇప్ప‌టికే రూ.వెయ్యి కోట్ల‌కు పైగా విలువైన తెల్ల‌రాయి తరలింపు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: మైనింగ్‌ మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నూతన విధానాలను తీసుకొస్తున్నా మరోవైపు మాఫియా అడ్డదారిలో విలువైన ఖనిజ సంపదను కొల్లగొడుతూనే ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాల సరిహద్దులోని సైదాపురం మండలంలోని తెల్లరాయిపై కొంతమంది మాఫియా కన్ను పడింది. గడిచిన నాలుగు నెలలుగా ఇష్టానుసారంగా ఖనిజ సంపదను దోచుకుంటు న్నారు. తెల్లరాయితో పాటు అబ్రహం గనులను కూడా నిబంధనలకు విరుద్దంగా త్రవ్వకాలు జరిపి నిత్యం వందలాది లారీల్లో టన్నుల కొద్ది ఖనిజ సంపదను రాష్ట్ర సరిహద్దులు దాటిం చేస్తున్నారు. అక్కడి నుండి వాటికి నకిలీ పత్రాలు సృష్టించి చైనా దేశానికి తరలించి సొమ్ము చేసుకుంటు న్నారు. గడిచిన నాలుగు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న తెల్లరాయి దోపిడీలో ఇప్పటివరకు రూ.1000 కోట్లకు పైగా విలువైన ఖనిజ సంపదను మాఫియా దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో లభించే తెల్లరాయికి చైనాలో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు చెందిన కొంతమంది మైనింగ్‌ వ్యాపారులు మాఫియాతో చేతులు కలిపి రెవెన్యూ, అటవీ భూముల్లో నిబంధనలకు విరుద్దంగా జేసీబీలతో త్రవ్వకా లు జరిపి తెల్లరాయిని బయట కు తీస్తున్నారు. అక్కడే రాయికి గ్రేడింగ్‌ పట్టి లారీల్లో చెన్నైకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొన్ని క్వారీలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే తెల్లరాయికి సంబంధించి కొన్ని గ్రామాల్లో అసలు ఎటువంటి అనుమతులు లేకుండానే 24 గంటలు భారీ యంత్రాలతో త్రవ్వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం, అక్రమ త్రవ్వకాలు, రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోయినా కనీసం దాడులు చేసిన దాఖలాలు కూడా లేకపోవడం పలు సందేహాలకు దారి తీస్తుంది.

రూ.1000 కోట్లకు పైగా..రాయి దోపిడీ
తిరుపతి, నెల్లూరు జిల్లా సరిహద్దులోని వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురం మండలంలోని అనేక గ్రామాల్లో అబ్రహం, తెల్లరాయి గనులు ఉన్నాయి. తుమ్మల తలుపూరు, తిప్పారెడ్డిపల్లి, కలిచేడు, మలిచేడు, త్యాగనం, రామాపురం, జోగిపల్లి, రాజుపాలెం, మర్లపూడి తదితర గ్రామాల పరిధిలో నాణ్యమైన తెల్ల రాయి ఎక్కువగా లభిస్తుంది. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన మైనింగ్‌ వ్యాపారులు గత నాలుగు నెలలుగా సైదాపురంపై మకాం వేసి రూ.1000 కోట్లకు పైగా విలువైన తెల్లరాయిని సరిహద్దులు దాటించారు. ఈ ప్రాంతంలో లభించే తెల్లరాయి టన్ను రూ.10 వేలు నుంచి రూ.12 వేలు వరకు పలుకుతుంది. ఒక్కో లారీలో 30 నుంచి 40 టన్నుల వంతున రోజుకు వంద లారీల్లో నాలుగు వేల టన్నులకు పైగా విలువైన రాయిని చెన్నైకు ఎగుమతి చేస్తున్నారు. ఆ లెక్కన రోజుకు 10 నుంచి 20 కోట్లకు పైగా విలువైన రాయి తరలిపోతుంది. అయితే మాఫియాకు లారీ రాయి ఎగుమతి చేయడానికి రూ.లక్ష నుంచి లక్ష 50 వేలు మాత్రమే ఖర్చవుతున్నాయి. ఈ ప్రాంతంలో త్రవ్విన రాయిని గ్రేడింగ్‌ పట్టి చెన్నైకు పంపితే ఒక్కో లారీకి రూ.4 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. దీంతో మాఫియా పెద్దఎత్తున తెల్ల రాయిని దోపిడీ చేస్తుంది.

రెవెన్యూ, ఫారెస్టు భూములే టార్గెట్‌
ఈ ప్రాంతంలో రెవెన్యూ, ఫారెస్టు భూములు అధికంగా ఉన్నాయి. వాటిలో తెల్లరాయి పుష్కలంగా ఉంది. దీంతో తమను అడిగేవారే ఉండరన్న ధీమాతో మాఫియా రె వెన్యూ, ఫారెస్టు భూములను టార్గెట్‌గా చేసుకుని దోపిడీ చేస్తోంది. మరికొన్ని గ్రామాల పరిధిలో అయితే రైతుల అసైన్‌మెంట్‌ భూములను లీజుకు తీసుకుని వాటికి నామమాత్రంగా అనుమతులు తీసుకుని అనధికారికంగా ప్రభుత్వ భూముల్లో త్రవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఈ విషయం రెవెన్యూ, ఫారెస్టు, పోలీసు అధికారులకు తెలిసినప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడాన్ని బట్టి చూస్తుంటే మాఫియా నుంచి వారికి పెద్దఎత్తున ముడుపులు అందుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సైదాపురం మండల పరిధిలో వందలాది ఎకరాల రెవెన్యూ, ఫారెస్టు భూములు ఉన్నాయి. వాటికి పరిధిలో కొన్ని ప్రైవేటు భూములు ఉండడంతో కొంతమంది మాఫియా తమ దోపిడీ గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ముందుచూపుతో మొక్కుబడి అనుమతులను తీసుకుంటుంది. ప్రభుత్వానికి కొంత మొత్తాన్ని చెల్లించి న్యాయబద్దంగా, చట్టబద్దంగా తాము అన్ని అనుమతులతో త్రవ్వకాలు జరుపుతున్నామని నమ్మించేలా మాఫియా హైడ్రామా ఆడుతోంది. అక్కడ జరుగుతున్న అక్రమ త్రవ్వకాలన్నీ రెండు జిల్లాల అధికారులకు తెలిసినప్పటికీ కనీసం దాడులు చేస్తున్న దాఖలాలు కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.

చెన్నై టు..చైనాకు ఎగుమతి
సైదాపురం పరిధిలోని తెల్లరాయిని జేసీబీ యంత్రాలతో బయటకు తీస్తున్నారు. అక్కడే రాయిని గ్రేడింగ్‌ చేసి లారీల ద్వారా చెన్నైకు సరఫరా చేస్తున్నారు. అయితే సైదాపురం నుంచి రాజమార్గంలోనే లారీలు తెల్లరాయిని తీసుకెళ్తున్నాయి. మార్గమధ్యంలో పలు చెక్‌పోస్టులు ఉన్నాయి. అలాగే ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు కూడా ఉంది. ఇన్ని తనిఖీ కేంద్రాలు ఉన్నా తెల్లరాయి మాత్రం అక్రమంగా తరలిపోతూనే ఉంది. చెన్నైకు సరఫరా అయిన రాయిని అక్కడి నుండి నౌకల మార్గం ద్వారా చైనాకు తరలిస్తున్నారు. ఇన్ని ప్రధాన మార్గాల గుండా అనుమతులు లేని తెల్లరాయిని రాజమార్గంలోనే తరలిపోతున్నా సంబంధిత అధికారులు ఎక్కడా దాడులు చేసి కేసులు నమోదు చేసిన దాఖలాలు మొక్కుబడిగానే ఉన్నాయంటే మాఫియాకు అధికారుల అండదండలు ఏ స్థాయిలో లభిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మాఫియా ఆదాయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నారు. అదే అక్రమంగా తరలిపోతున్న తెల్లరాయికి అన్ని అనుమతులు తీసుకునేలా చేస్తే ప్రభుత్వానికి మరింత ఆదాయం చేకూరే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement