Monday, April 29, 2024

Big Story: ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర లెక్క‌ల్లేవ్‌.. అడిగేవారు లేక ఆగ‌మైతున్న మాన్యం భూములు..

రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో సుమారు 37 వేల 419 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 25 లక్షలకు పైగా ఆదాయం ఉండే ఆలయాలు 148, 2 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆదాయం ఉండే ఆలయాలు 1141, 2 లక్షలలోపు ఆదాయం వచ్చే ఆలయాలు 36 వేల 130 ఉన్నాయి. ఇవన్నీ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలే. ఇవి కాకుండా దాతలు నిర్మించిన దేవాలయాలు మరో 5 వేలకు పైగా ఉన్నాయి.

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : కోట్ల విలువైన వేల ఎకరాల మాన్యాలున్నా దేవుడికి ధూపదీప నైవేద్యాలు కరవవుతున్నాయి. మరోవైపు విలువైన భూములు కబ్జాదారుల పాలవుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే హే భగవాన్‌ అన్పించకమానదు. రాష్ట్రంలో ఖరీదైన స్థలాలు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే ఆక్రమించేస్తున్నారు. దేవుడి ఆస్తులైతే ఇక అడిగేవారే లేరన్న ధైర్యంతో దర్జాగా సొంత జాగీరులా మార్చేసుకుంటున్నారు. గడిచిన ఐదారు ఏళ్ల ల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున దేవాదాయ ఆస్తులు ఆక్రమణదారుల గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములతోపాటు పట్టణ ప్రాంతాల్లోని విలువైన స్థలాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను కూడా సొంత ఆస్తులుగా మార్చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. దేవుడి ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన దేవాదాయ శాఖ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతో స్థానిక ఎండోమెంట్‌ అధికారులు చేతులు కలిపి భూ ఆక్రమణందారులకు పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నారు. దీంతో దేవాలయాలకు సంబంధించిన భూము లు, స్థలాలు రికార్డులు సైతం తారుమారవుతున్నాయి. అధికారికంగా వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రాంతంలో చూసినా.. ఏదో ఒక ఆలయానికి సంబంధించిన ఆస్తులు ఆక్రమణకు గురవుతూనే ఉన్నా యి. తాజాగా కొంతమంది పట్టణ ప్రాంతాల్లోని మరికొన్ని విలువైన స్థలాలను సైతం లీజు పేరుతో సొంతం చేసుకునే ప్రయత్నాలు పెద్దఎత్తున చేస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లు విలువ చేసే ఆస్తులు.. లక్షల్లో ఏటా ఆదాయం.. క్రమం తప్పకుండా వస్తున్నా వేలాది దేవాలయాల్లో కనీసం నైవేద్యం పెట్టే దిక్కు కూడా కరువవుతోంది. కోట్లాది రూపాయలు ఆస్తులున్నా వేలాది దేవుళ్లు నిరుపేదగానే సేవ లందుకోవాల్సి వస్తుంది. దేవాలయాలకు పుట్టి నిల్లయిన ఏపీలో ఇటీవల కాలంలో ఎండోమెంట్‌ ఆస్తులను ఆక్రమించుకోవడం అలవాటుగా మారిపోతుంది.

విలువైన స్థలాలపై కన్ను..
రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో సుమారు 37 వేల 419 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 25 లక్షలకు పైగా ఆదాయం ఉండే ఆలయాలు 148, 2 లక్షల నుంచి 25 లక్షల వరకు ఆదాయం ఉండే ఆలయాలు 1141, 2 లక్షలలోపు ఆదాయం వచ్చే ఆలయాలు 36 వేల 130 ఉన్నాయి. ఇవన్నీ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలే. ఇవి కాకుండా దాతలు నిర్మించిన దేవాలయాలు మరో 5 వేలకు పైగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రతి మారు మూల గ్రామంలో అతి పురాతనమైన దేవాల యాలు ఒకటో రెండో కచ్ఛితంగా ఉన్నాయి. వాటికి సంబంధించి సుమారు రెండు లక్షల ఎకరాలకు పైగా మాగాణి భూములు ఉన్నాయి. మరో మూడు లక్షల మెట్ట భూములు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఆయా గ్రామాలు, పట్టణ ప్రాంతాల పరిధిలో విలువైన స్థలాలు ఉన్నాయి.

- Advertisement -

ప్రముఖ దేవాలయాలకైతే దాతలు దాతృత్వం కింద ఇచ్చిన భవనాలు, ఖరీదైన షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూడా ఉన్నాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో భూములు, ఆస్తులు ఉన్నా.. ఆయా దేవాలయాల్లో నిత్యం దేవునికి సేవలందించే అర్చకులకు కనీసం గౌరవ వేతనం కూడా సకాలంలో అందుకోలేకపోతున్నారు. దేవునికి నైవేద్యం పెడదామన్నా కౌలు రైతుల నుంచి సరైన సహకారం కూడా అందడం లేదు. ఇక వేలాది దేవాలయాల్లో దీపారాధన కూడా అంతంత మాత్రంగానే చేస్తున్నారంటే రాష్ట్రంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విలువైన ఆస్తులున్న దేవాలయాలు ఎంత దీనస్థితిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. ఆయా దేవాలయాలకు సంబంధించిన విలువైన ఆస్తులన్నీ దశాబ్దాలుగా ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇందుకు సంబంధించి కౌలు, స్థలాలకు సంబంధించి లీజు సొమ్ములు సకాలంలో చెల్లించకపోయిన అడిగేవారు లేకపోవడంతో కాలక్రమేణా ఆస్తులన్నీ వారి సొంత ఆస్తులుగా మార్చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా దోపిడీలు అత్యధిక స్థాయిలో సాగుతున్నాయి.

వివరాలు డొల్ల.. రికార్డుల తారుమారు
రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి ప్రతి దేవుడికి దేవుడి మాన్యంతో పాటు దాతలు ఇచ్చిన భూములు, వివిధ రకాల స్థిరాస్తులు భారీ సంఖ్యలో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన దేవాలయాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటికి సంబంధించి వేలాది ఎకరాల భూములు రాజుల కాలం నుంచే ఉన్నాయి. అయితే ఆలయాలకు సంబంధించిన ఆస్తులు, వాటి వివరాలు ఎక్కడున్నాయో కూడా దేవా దాయ శాఖ దగ్గర సరైన రికార్డులు లేవు. గతంలో కరణాలు, మునసబుల కాలంలో ఆలయాలకు సంబంధించిన రికార్డులు కొంతమేర భద్రంగా ఉన్నప్పటికీ, ఆతర్వాత దేవాదాయ శాఖ పరిధిలోకి వాటిని తీసుకొచ్చాక కాలక్రమేణా ఆ రికార్డులకు భద్రత కరువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు, భూములు, అందుకు స ంబంధించిన కౌలు, తదితర వివరాలు కూడా అధికారుల వద్ద పూర్తి స్థాయిలో లేవు. అసలు ఒక్కమాట లో చెప్పా లంటే దేవాదాయ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి లీజు కాలం ఎంత? గతంలో లీజు ఎంత చెల్లించేవారు? ప్రస్తుతం ఎంత చెల్లిస్తున్నారు? అనే వివరాలు కూడా కొంతమంది అధికారులు చెప్పలేకపోతున్నారు. దీంతో వేలంలో దేవాలయాల భూములను లీజుకు దక్కించుకున్న కొంతమంది ఆ రికార్డులను తారుమారు చేసి తమ సొంత భూములుగా మార్చేసుకుంటున్నారు.

కబ్జాలో 80 శాతం భూములు..
రాష్ట్రంలోని దాదాపుగా 80 శాతం దేవాల యాల ఆస్తులు ఆన్యాక్రాంతం అయినట్లు తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఆయా ప్రాంతాల్లోని దేవాదాయ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం చిత్తలూరు చెన్నకేశవ స్వామి ఆలయానికి సంబంధించి 15 ఎకరాల విలువైన భూములు, ఆదూరుపల్లి గ్రామ సమీ పంలో ఉన్నాయి. అయితే నెల్లూరు, కలవాయి ప్రధాన మార్గంలో ఉన్న ఆదూరుపల్లి కాల క్రమేణా అభివృద్ధి చెందుతుంది. దీంతో ఆలయ భూములపై కబ్జాదారుల కన్ను పడింది బస్టాండ్‌ కు స మీపంలో ఉన్న స్థలాలను ఆక్రమించేసి భవ నాలను, వ్యాపార సముదాయాలను నిర్మిం చేశారు. తాజాగా కూడా మరో భవనాన్ని నిర్మిం చారు. ఇంత జరుగుతున్నా.. స్థానిక అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఉదాహరణ మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఆక్రమాలు వందల సంఖ్యలో ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ దేవాలయానికి సంబం ధించి కానూరుకు సమీపంలో విలువైన భూము లు ఉన్నాయి.

గతంలో వాటిని లీజుకు ఇచ్చారు. అయితే పాత పద్ధతిలోనే ప్రస్తుతం కూడా అతి తక్కువ మొత్తం లోనే లీజు చెల్లిస్తున్నారు. ఈ విషయంపై వివాదం కూడా జరుగుతుంది. ఇలా దేవుని ఆస్తులకు సంబంధించి వివాదాలతో దీర్ఘ కాలంగా సాగు తున్న సంఘటనలు కూడా వందల సంఖ్యలో ఉన్నాయి. దేవాదాయ శాఖ ఉన్న తాధికారులు ఇప్పటికైనా దేవుని ఆస్తులు పరిరక్షణ కోసం ప్రత్యేక ద ృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement