Monday, April 29, 2024

Big Story: కట్టిన ఇండ్లు లేవ్.. కాలనీలు అస్సలు లేవ్.. 5లక్షల పక్కా ఇళ్లు మాయం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కాగితాల్లో ఇళ్లు కట్టేసాయి. కాలనీలకు కాలనీలే దర్శనమిచ్చాయి. తీరా క్షేత్రస్థాయికి వెళ్లి చూస్తే అంతా బడాయేనని తేలిపోతోంది. కాగితాల్లో ఇళ్లు.. కళ్లముందు కన్పించకపోవడంతో అధికార్ల కళ్లు బైర్లు కముతున్నాయి. ఆ ఇళ్లు ఏమయ్యాయి.. ఆ డబ్బు ఎటుపోయిందన్నది ప్రశ్న. ఇక్కడ మరో కొసమెరుపుంది. ఇళ్లు మంజూరైనవారి పేర్ల జాబితా చూస్తే ముచ్చటె స్తుంది. కానీ ఆ పేరున్నవాడికి ఇల్లు మంజురైన విష యమే తెలీదు. అంటే పేరు ఒకరిది.. గూడు మరొకరి దన్నమాట.. ఇలాంటి బాగోతాలెన్నో ఓటీఎస్‌ పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నాయి.

ఇదీ ఇళ్ల కట్టు కథ
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం డీసీపల్లి (ధర్మరాజు చెరువుపల్లి) గ్రామంలో గతం ప్రభుత్వాలు సుమారు 4 వేల పక్కా గృహాలు మంజూరు చేశారు. అయితే ఓటీఎస్‌లో భాగంగా ఆ మండలానికి చెందిన అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలిస్తే 1000 ఇళ్లు కూడా కనిపించలేదు. రికార్డుల్లో చూస్తే దశల వారీగా 4 వేలకు పైగా ఇళ్లను మంజూరు చేసినట్లు గ్రామ పరిధిలో లబ్దిదారుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్ల ఆధారంగా నిరుపేదల వద్దకు వెళ్లి ఆరా తీస్తే అసలు తమకు ఎప్పుడు ఇళ్లు మంజూరు చేశారని ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులకు ఏమి సమాధానం చెప్పాలో..తెలియక తెల్లముఖం వేసి వెనుదిరిగారు. అదేవిధంగా ప్రకాశం జిల్లా, సీఎస్‌పురంలో 3 వేల ఇళ్లకు పైగా మంజూరు చేయగా, ఆ ప్రాంతంలో కూడా 1500 ఇళ్లకు మించి కనిపించడం లేదు. ఇవి కేవలం ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో సుమారు 5 లక్షల ఇళ్లకు పైగా చూద్దామన్నా కనిపించడం లేదు. అసలు గతంలో పేదల పేరుతో మంజూరైన ఇళ్లు ఏమయ్యా యి..ఆ ఇళ్లకు కాళ్లొచ్చాయా? లేక కాకెత్తుకెళ్లిందా? లేదా ఏ దేవుడైనా మాయం చేశాడో తెలియక అధికా రులు తలలు పట్టుకుంటున్నారు. అయితే నిజంగానే దేవుడు మాయం చేశాడని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. గతంలో నిరుపేదలకు ఆయా ప్రభుత్వాలు పక్కా ఇళ్లు మంజూరు చేసిన సమయంలోనే కొంత మంది బడాబాబులు పేదలకు తెలియకుండా వారి పేర్లతో ఇళ్లు మంజూరు చేసుకుని భవనాలు నిర్మిం చుకున్నారు.

పేదల పేర ఇళ్లు… కట్టుకున్నది పెద్దలు
ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పలు పటణాల్లో పేదల పేరుతో గతంలో అధికారంలో ఉన్న కొంతమంది నేతలు తమ అర్థ, అండ బలాన్ని ఉపయోగించి ఒక్కొక్కరు 5 నుంచి 10 మంది లబ్దిదారుల పేరుతో ఇళ్లు మంజూరు చేసుకుని, ఆ సొమ్ముతో విలాస వంతమైన ఇళ్లను నిర్మించుకున్నారు. ప్రస్తుతం మాయమైన ఇళ్లన్ని ఆ జాబితాలోనే ఉన్నాయి. ఇదే విషయం అధికారులకు తెలిసినా.. ఏమి చేయలేక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపే దలకు పక్కా ఇళ్లపై సర్వ హక్కులు కల్పించేందుకు వన్‌టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పథకాన్ని తీసు కొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మంది పేద ప్రజలు ఓటీఎస్‌ ద్వారా తమ ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇదే సందర్భంలో తమకు తెలియకుండానే తమ పేర్లపై గతంలో ఇళ్లు మంజూరయ్యాయన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న నిరుపేదలు తమ ఇళ్లు తమకు ఇప్పించాలని పట్టుబడుతున్నారు. దీంతో అధికారులకు కొత్త తలనొప్పులు కూడా వచ్చి పడు తున్నాయి. రికార్డుల్లో ఉన్న ఇళ్లు గ్రామాల పరిధిలో కనిపించకపోగా , రికార్డుల్లో ఉన్న పేర్ల ఆధారంగా నిజమైన లబ్దిదారులు తమ ఇళ్లు ఏమయ్యాయంటూ పలు ప్రాంతాల్లో అధికారులను నిలదీస్తున్నారు. దీంతో రెండు రకాల సమస్యలతో ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు సతమతమవుతున్నారు.

5 లక్షలకు పైగా..పక్కా ఇళ్లు మాయం
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో వివిధ ప్రభుత్వాలు సుమారుగా 59 లక్షల పక్కా ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో సుమారు 20 లక్షల ఇళ్లకు సంబంధించి లబ్దిదారులు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించారు. 39 లక్షల మందికి సంబంధించిన రుణాలు అలాగే ఉండిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పథకం కింద 39 లక్షల గృహాలకు సంబంధించి రుణాలను సెటిల్‌ చేసుకోవాలని పేదలకు అవకాశం కల్పించారు. ఈ పక్రియలో భాగంగానే సెప్టెం బర్‌ 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మందికి పైగా పేదలు ఓటీఎస్‌ ద్వారా బాకీలు చెల్లించారు. మిగిలిన 37 లక్షల మం దిలో కూడా ఎక్కువ శాతం మంది ఓటీఎస్‌ వైపు ఆసక్తి చూపుతు న్నారు. ఈ నేపధ్యంలోనే ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని అధికారులు ఆయా ప్రాంతాల్లో లబ్దిదారులతో ముఖాముఖీ అవుతున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో రికార్డుల్లో లబ్దిదారుల పేర్లు అయితే కనిపిస్తున్నాయి తప్ప ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇళ్లను పరిశీలిస్తే మాత్రం చూద్దామన్న కనిపించడం లేదు. సుమారు 5 లక్షల ఇళ్లకు పైగా మాయమైనట్లు ఇప్పటికే ఆ ప్రాంతాల్లోని అధికారులు గుర్తించారు. అయితే అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

బయటపడుతున్న నాటి దోపిడీ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఓటీఎస్‌ పథకం ద్వారా గత దోపిడీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. గతంలో పేదల పేరుతో బడాబాబులు దోచుకున్న విధానం ఒక్కొ క్కటిగా వెలుగు చూస్తుంది. నిరుపేదలకు తెలియకుండానే వారి పేర్లపై ఇళ్లను మంజూరు చేసుకుని కొంత మంది విలాస వంతమైన భవనాలను నిర్మించుకున్నారు. పక్కాగృహాల సొమ్ముతో మరికొంత నిధులు సమకూర్చుకుని మరికొంత మంది అతిధి భవనాలను కూడా నిర్మించుకున్నారు. ఇకొంతమంది నాయకులైతే ఏకంగా ఆయా ప్రాంతాల పరిధిలో తమకున్న తోటల్లో గెస్ట్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. మరికొంత మంది అయితే అప్పటికే తమకున్న ఇళ్లపై రెండవ అంతస్తు నిర్మిం చేస్తున్నారు. ఇలా గతంలో పక్కా ఇళ్ల పథకాన్ని పక్కదారి పట్టించి అనేక మంది సొంత భవంతులను నిర్మించేసుకున్నారు. ప్రస్తుతం ఓటీఎస్‌ పుణ్యమా..అని నాటి పాపం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. అయితే పేదల పేరుతో కొంతమంది నాయకులు భవంతులు నిర్మించుకున్న విషయాన్ని ప్రస్తుత అధికారులు కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. అయినా వారిని ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదే సందర్భంలో అధికారుల రికార్డుల్లో తమ పేర్లు చూసిన నిరుపేదలు తమకు తెలియకుండా ఇళ్లు ఎప్పుడు మంజూరు చేశారు, మా ఇళ్లు మాకు ఇప్పించండి అని అధికారులపై కొంతమంది నిరుపేదలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లేని ఇళ్లను ఎలా తెచ్చివ్వాలో తెలియక కొంత మంది అధికారులు ఆఫీసులకే పరిమితం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement