Monday, April 29, 2024

మళ్లీ తెరపైకి భవన్ విభజన.. కుదరని ఏకాభిప్రాయం.. కొనసాగుతున్న వివాదం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్ర విభజన జరిగిన 8 ఏళ్లు కావ‌స్తున్నా ఇంకా విభజనకు నోచుకోని ఉమ్మడి ఆస్తుల వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో జనవరి 12న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు భేటీకానున్న నేపత్యంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్రం వెలుపల ఉమ్మడి ఆస్తుల్లో దేశరాజధానిలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ అత్యంత కీలకమైంది. ఢిల్లీ నగరానికే గుండెకాయ లాంటి ఇండియా గేట్ షడ్భుజికి దాదాపుగా ఆనుకుని ఉన్న ఉమ్మడి భవన్ దాదాపు 20 ఎకరాల్లో విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు కూతవేటు దూరంలో ఉంది. దేశ పాలనా వ్యవస్థకు కేంద్ర బిందువైన ప్రాంతంలో ఇంత విశాలమైన స్థలం ఏ రాష్ట్రానికీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రపతి భవన్ తర్వాత విశాలమైన స్థలం ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాలకే అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న ఈ భవనంలో ఉన్న గదులను పంచుకుని కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆస్తిని పంచుకునే విషయంలో ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు.

పంపకం ఎలా..?
రాష్ట్రం వెలుపల ఉన్న ఉమ్మడి ఆస్తులను జనాభా లెక్కల ప్రకారం అంటే 58:42 నిష్పత్తిలో వాటాలు పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉమ్మడి భవన్‌ మొత్తం విస్తీర్ణం 19.437 ఎకరాలు. ఇందులో 3.73 ఎకరాల్లో శబరి బ్లాక్ హైదరాబాద్ హౌజ్‌ను ఆనుకుని వెనుకభాగంలో ఉంది. ఇందులో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్ల కార్యాలయ భవనం, రాష్ట్ర మంత్రులు, గవర్నర్‌ బస కోసం వినియోగించే శబరి గెస్ట్ హౌజ్, రెసిడెంట్ కమిషనర్ నివాస భవనం, పే అండ్ అకౌంట్స్ కార్యాలయం సహా మరికొన్ని కార్యాలయాలు, క్వార్టర్లు ఉన్నాయి. దీనికి ఆనుకుని 4.196 ఎకరాల్లో గోదావరి–స్వర్ణముఖి బ్లాకులతో పాటు ఏపీ సీఎం కాటేజీ ప్రాంగణం ఉంది. గోదావరి బ్లాకులోని గెస్ట్ హౌజ్‌లో రాష్ట్రం నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, అధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేల వంటివారికి వసతి కల్పిస్తుంటారు. ఇందులోనే ప్రసిద్ధి చెందిన భవన్ క్యాంటీన్ ఉంది. గోదావరి బ్లాకుతో కలిసిపోయి ఉన్న స్వర్ణముఖి బ్లాకులో కూడా మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా ఉన్నతాధికారులకు బస కల్పిస్తుంటారు.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినప్పుడు ఉండేందుకు సీఎం కాటేజి స్వర్ణముఖి బ్లాకుకు ఆనుకుని ఉంటుంది. 3.412 ఎకరాల్లో ఓల్డ్‌ నర్సింగ్‌ హాస్టల్ ప్రాంతంలో భవన్ సిబ్బంది నివాస సముదాయాలతో పాటు ఖాళీ స్థలం కూడా ఉంది. 7.564 ఎకరాల్లోని పటౌడీహౌస్‌ స్థలంలోనూ కొన్ని స్టాఫ్ క్వార్టర్లు, విశాలమైన ఖాళీ స్థలం ఉంది. మధ్యలో 0.535 ఎకరాల మేర సర్వీసు రోడ్డు కూడా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు 58% అంటే 11.31 ఎకరాలు, తెలంగాణకు 42% అంటే 8.19 ఎకరాలు పంచాల్సి ఉంటుంది. వేర్వేరు బ్లాకులుగా, అశోకా రోడ్ నుంచి జస్వంత్ సింగ్ మార్గ్ వరకు విస్తరించిన ఈ ఉమ్మడి ఆస్తిని పంచుకోవడం కోసం 2018లో నాటి ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ 2 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రకారం..

పంపకాలకు 2 ప్రతిపాదనలు
ప్లాన్ (ఏ): దీని ప్రకారం శబరి బ్లాకు పూర్తిగా తెలంగాణకు ఇచ్చి, పటౌడీ హౌజ్‌లో సగం స్థలాన్ని ఇవ్వాలి. మిగిలిన గోదావరి-స్వర్ణముఖి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ స్థలం, పటౌడీ హౌజ్‌లో మిగతా సగం ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి.

ప్లాన్ (బి): గోదావరి-స్వర్ణముఖి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ తెలంగాణకు ఇచ్చి, మిగతా ప్రాంతం అంటే పటౌడీ హౌజ్ స్థలం, శబరి బ్లాకును ఏపీ తీసుకోవాలి. ఏ ప్లాన్ ప్రకారం చూసినా కాస్త అటూ ఇటుగా 58:42 నిష్పత్తి ప్రకారం వాటాలు వస్తున్నాయి.

- Advertisement -

మొత్తం మాదే : కేసీఆర్
ఉమ్మడి ఆస్తి మొత్తం తెలంగాణకే చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు వాదిస్తున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న 58:42 నిష్పత్తి అనేది 1956లో ఏర్పడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సొమ్ముతో కొన్న ఆస్తులకే వర్తిస్తుందని, చారిత్రకంగా ఈ భవన్ కాంప్లెక్స్ పూర్తిగా నాటి హైదరాబాద్ స్టేట్ (నిజాం)కు చెందింది కాబట్టి ఇప్పుడు తెలంగాణకే పూర్తి హక్కు ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు కేసీఆర్ 2017లో నాటి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. చరిత్ర వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటీష్ పాలనలో ప్రిన్స్‌లీ స్టేట్స్‌గా ఉన్న రాజ్యాలకు ఢిల్లీలో అధికార భవనాల నిర్మాణం కోసం ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో, సెంట్రల్ ఢిల్లీలో స్థలాలు కేటాయించగా నాటి సామంత రాజ్యాలు హైదరాబాద్ స్టేట్, పాటియాలా సంస్థానం, బికనీర్, జోధ్‌పూర్, బరోడా సహా పలు రాజ్యాలు భవనాలు నిర్మించుకున్నాయి. 1929లో నాటి నిజాం రాజు ఉస్మాన్ అలీ పాషా నియో-మొఘల్ నిర్మాణశైలిలో హైదరాబాద్ హౌజ్ నిర్మించారు. బ్రిటీష్ పాలకులతో చర్చలు జరిపేందుకు ఢిల్లీ వచ్చినపుడల్లా అందులో బస చేస్తుండేవారు.

అప్పట్లోనే రూ. 2 లక్షల పౌండ్లతో 9.2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఖరీదైన భవనంలో 36 విశాలమైన గదులు, 500 మందికి మించి ఒకేసారి భోజనం అందించగల్గిన భారీ డైనింగ్ టేబుల్, సువిశాలమైన హాల్, గార్డెన్స్, సేవకుల నివాస సముదాయాలతో పాటు 2,000 మందికి భోజనాలు అందించగల డైనింగ్ హాల్స్ ఉన్నాయి. స్వతంత్ర దేశంగా హైదరాబాద్ స్టేట్‌ను ఉంచేందుకు నిజాం రాజు ప్రయత్నాలు చేసినప్పటికీ, పోలీస్ యాక్షన్ ద్వారా ఆ రాజ్యం భారతదేశంలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో నిజాం ఆస్తులన్నింటిపైనా యాజమాన్య హక్కులు రాష్ట్రానికి అప్పగించారు. అలా తొలుత నాటి హైదరాబాద్ రాష్ట్రానికి, ఆ తర్వాత 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు యాజమాన్య హక్కులు బదిలీ అవుతూ వచ్చాయి. అయితే ఈ ఖరీదైన భవనాన్ని తమకు అప్పగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం 1980 నుంచి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కోరుతూ వచ్చింది.

చివరకు 1993లో కేంద్ర ప్రభుత్వానికి అప్పగించగా, విదేశీ వ్యవహారాల శాఖ ఈ భవనాన్ని ద్వైపాక్షిక చర్చలు, దేశాధినేతల భారత పర్యటనకు వినియోగించుకుంటోంది. 1993లో ఈ భవనాన్ని తీసుకున్నందుకు ప్రతిగా డబ్బుతో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భవన్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం కంటే ముందు నుంచి, ఇంకా చెప్పాలంటే భారతదేశంలో విలీనం కాకముందు నుంచే ఈ ఆస్తిపై తెలంగాణ ప్రజలకు హక్కుందని, అందుకే ఇది పూర్తిగా తెలంగాణకే చెందుతుందని సీఎం కేసీఆర్ బలంగా వాదిస్తున్నారు. ఈ ఆస్తిలో ఏపీ వాటా కోరిన పక్షంలో ఏపీలోని సీపోర్టులు, ఇతర ఆస్తుల్లో తెలంగాణకు వాటా కోరే హక్కు ఉంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మొత్తంగా రాష్ట్ర విభజన జరిగి 8 సంవత్సరాలవుతున్నా.. ఏకాభిప్రాయం కుదరక ఈ ఆస్తి పంచాయితీ ఇంకా వివాదంగానే కొనసాగుతోంది.

ఆలస్యం.. భవన్ మాయం
వివాదాన్ని త్వరగా పరిష్కరించుకుని ఖాళీ స్థలంలో కొత్త భవన్ నిర్మాణం త్వరగా చేపట్టడం మంచిదని కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా అనేక పాత భవనాలను కూల్చి కొత్త భవనాలను కడుతున్న కేంద్ర ప్రభుత్వం, పటౌడీ హౌజ్ ఖాళీ స్థలాన్ని తిరిగి తమకు అప్పగించాలని కోరే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ స్థలాన్ని తీసుకుంటే బదులుగా మరో చోట స్థలం ఇచ్చేందుకు సెంట్రల్ ఢిల్లీలో ఎక్కడా ఇంత విశాలమైన స్థలం అందుబాటులో లేదని, నగర శివార్లలో వసంత్ కుంజ్ లేదా వసంత్ విహార్ ప్రాంతాల్లో కేటాయిస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే పంపకాలు పూర్తి చేసుకుని, కొత్త భవన్ నిర్మించుకుని వినియోగంలోకి తీసుకొస్తేనే ఈ ప్రమాదాన్ని నివారించగలమని సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే ఉన్న భవన్ మాయమైపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement