Saturday, April 27, 2024

రంగురంగుల గాజుల్లో బెజవాడ కనకదుర్గమ్మ.. భగినీహస్త భోజనం సందర్భంగా ప్రత్యేక అలంకారం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రంగురంగుల గాజుల్లో కనకదుర్గమ్మ మెరిసిపోయారు. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మను భగినీహస్త భోజనం సందర్భంగా గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. సోదర సమానుడైన శ్రీమన్నారాయణుడు సారె పంపినట్టుగా భావిస్తూ భక్తులు అమ్మవారికి గాజులను సమర్పించారు. భక్తులు అందజేసిన తొమ్మిది వందల డజన్ల గాజులను దుర్గమ్మకు అలంకరించారు. మూడు రోజుల పాటు అమ్మవారు గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఆ తర్వాత ఆ గాజులను భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తామని అమ్మవారి పూజారి సాయిబాబా వివరించారు. భక్తులు సమర్పించిన గాజులతో ప్రతి ఏడాది ఇలా దుర్గమ్మను అలంకరిస్తామని ఆయన తెలిపారు. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్లిన రెండవరోజును భగినీహస్త భోజన పండుగ జరుపుకుంటారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతివంట తిని వారితో తిలకం దిద్దించుకుంటారు. ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. సోదరుని క్షేమానికి సంబంధించిన ఈ పండుగను ఉత్తర భారతదేశంలో భాయ్ ధూజ్ పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement