Thursday, May 9, 2024

శతజయంతి ఉత్సవాలు చేసే అర్హత బాబుకు లేదు… మంత్రి రోజా

(మచిలీపట్నం- ప్రభ న్యూస్) : ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాక్కున్న చంద్రబాబు… ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. శుక్రవారం మచిలీపట్నం ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్, ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకొస్తుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఎన్టీఆర్ గుర్తుకు రారని చెప్పారు.

చంద్రబాబుకు ఎన్టీఆర్ మీద నిజంగా ప్రేమ ఉంటే 14ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణ చేశారని గుర్తు చేశారు. తడిగుడ్డతో గొంతుకోసే వ్యక్తి చంద్రబాబు అన్నారు. భార్యని చూసుకోలేనోడు దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని మోడీని తిట్టారని.. రాహుల్ గాంధీతో చేతులు కలిపి మోడీని గద్దె దించుతామని గత ఎన్నికల ముందు ఆర్భాటం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడేమో జాతీయ మీడియాతో మోడీ విజన్ గురించి మాట్లాడుతున్నారని, ఆయన అవకాశవాద రాజకీయానికి ఇది నిదర్శనమ‌న్నారు. ఇది చంద్రబాబు నైజం అంటూ మంత్రి రోజా మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే జగన్ చేస్తున్న పథకాలకు కితాబిచ్చినట్లే కదా అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని రోజా జోష్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement