Monday, April 29, 2024

టిప్పర్లకు సై సై.. ట్రాక్టర్ లకు నై నై.. తరలిపోతున్న అరుణానది ఇసుక

ఎవరి అనుమతులు లేకుండా స్వతంత్రంగా తక్కువ ధరకే ఇంటికి చేరే ఇసుక నేడు బంగారం కంటే అధిక ధర పలుకుతుంది. పేదవాడు ఇంటి నిర్మాణానికి సిమెంట్, స్టిల్ కంటే కూడా ఇసుకపై అధిక ధర వెచ్చించెందుకు సిద్ధంగా ఉన్నా.. దొరకని పరిస్థితి ప్రభుత్వాలు తీసుకొనె కొన్ని నిర్ణయాలు కాంట్రాక్టర్లకు వరం కాగా.. పేదవాడికి శాపంగా మారుతుంది. పేదలకు ఇసుకను సులభతరంగా అందించాలని ఇసుక రిచ్ లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలోని అరుణానది రిచ్ లో బడా వ్యాపారులు పంపే టిప్పర్లకు తప్ప పేదవాడికి ఇసుక తరలించే ట్రాక్టర్లకు మాత్రం మన్ను దొరకని దుస్థితి.

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని ఇసుక రిచ్ లు లాభాపేక్ష దిశగా అడుగులు వేస్తూ పేదవాడికి కన్నీటిని మిగిలిస్తున్నాయి. ఇప్పటికే ఇసుక ధర పెరిగిపోయి నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. అయినా పేదవాడి సొంత ఇంటికల నెరవేర్చుకొనేందుకు ఎన్నో కష్ఠాలు పడి నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ ప్రభుత్వ అధికారుల సహాయం లేక ఏమి చేయలేని అయోమయ స్థితిలో ఉండి పోవాల్సి వస్తుంది. దినికి ప్రధాన కారణం సమీపంలో ఇసుక రిచ్ లు ఉన్న అక్కడ నుంచి ఇసుకను తరలించడం గగనంగా మారుతుంది. ఇసుక రిచ్ లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పెద్దల అండతో చెలరేగిపోతూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

నాగలాపురం మండలంలోని చిన్నపట్టు, నందనం గ్రామాల సమీపంలోని అరుణానది ఇసుక రిచ్ లో ప్రయివేట్ వ్యాపారులు ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. టన్ను ఇసుక ధర 475 రూపాయలకు చొప్పున ట్రాక్టర్ కు 5 టన్నులు మన్నును  2400 రూపాయలు వసూళ్ళు చేస్తున్నారు. అయితే ప్రారంభంలో స్థానికులకు ఇసుకను అందించిన ప్రస్తుతం మాత్రం తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, నగిరి, తడ ప్రాంతాలలో బడా వ్యాపారులతో కుదిరిన ఒప్పందం మేరకు టిప్పర్లకు మాత్రమే ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు,నాగలాపురం, పిచ్చటూరు,కేవీబీపురం, నారాయణవనం మండలాలు నుంచి ఇసుక కోసం వెళ్లే ట్రాక్టర్ ను మాత్రం దారి సమస్య వుంది అంటూ వెనకి పంపుతున్నారు. టిప్పర్లకు వుండే దారి ట్రాక్టర్ లకు ఎందుకు లేకుండా పోతుందని స్థానిక ట్రాక్టర్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారం రోజుల కిందట నాగలాపురం పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ తీరును నిరాస్థిస్తూ ఫిర్యాదు చేశారు. అయిన కాంట్రాక్టర్ మాత్రం ట్రాక్టర్లకు ఇసుక నింపేది లేనట్లు వ్యవహారిస్తున్నారు.

నాలుగు మండలలు పరిధిలో జగనన్న కాలనీలు,జగనన్న గృహ నిర్మాణాలు ఉపందుకుంటున్నాయి. కానీ సిమెంట్, స్టిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండడం నిర్మాణాలు పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుక సమయానికి అందుబాటులో లేక పోవడంతో నిర్మాణాలు మందకోడిగా సాగుతున్నాయి.ఒక్కసారిగా టిప్పర్లతో ఇసుకను కొనలేని దుస్థిలో కొందరు టిప్పర్లలో తీసుకొచ్చే ఇసుకను నిల్వ చేసుకునే స్థలం లేక మరికొందరు ట్రాక్టర్ లతో ఇసుకను తరలించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహ నిర్మాణాలు సైతం ఇసుకను తరలించుకోనేందుకు ట్రాక్టర్ల మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహ నిర్మాణాలకు ఇసుక కోసం ప్రభుత్వం ఇచ్చే పర్మిట్ 21రోజులు దాటితే మళ్ళీ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లబ్దిదారులకు నెలకొంటుంది.ఇవిఏవి పట్టని కాంట్రాక్టర్లు మాత్రం లారీలకు ఇసుక ను నింపి అధిక లాభలను పొందుతున్నారు.

- Advertisement -

స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నత అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ తప్ప స్థానికంగా నెలకొన్న సమస్యపై గురి చూపడం లేదు. జేసీ స్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు లక్ష్యలను నిర్దేశించుకొని నివేదికలు తయారు చేసుకోవడం తప్ప క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులు ఎదుర్కోంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇసుక రిచ్ లకు అనుమతులు ఇచ్చే అధికారులు కనీసం కన్నెతైన అటువైపు చూడక పోవడంతో కాంట్రాక్టర్లు వారి ఇష్టాను రితీగా వ్యవహరించి బడా వ్యాపారులకు కొమ్ముకస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఇసుక కొరత పై సమీక్షలు నిర్వహించి స్థానికుల అవసరాలు మేరకు ఇసుకను అందించక పోతే నిర్మాణాలు పూర్తి స్థాయిలో ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement