Thursday, April 25, 2024

ఆక్వాకు రిజర్వాయర్ల ఊతం.. మంచినీళ్ల‌లో చేపలు, రొయ్యల పెంపకం.. భారీగా దిగుబడి

అమరావతి, ఆంధ్రప్రభ : మంచినీటి చెరువులు, రిజర్వాయర్లలో చేపలు, రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించటం ద్వారా సహజసిద్ధమైన ఆక్వా ఉత్పత్తుల దిగుబడిని గణనీయంగా పెంపుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ అవసరాలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్‌ బాగా ఉండటంతో ఎగుమతుల్లో ఏపీని అగ్రశ్రేణిగా నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కేవలం మధ్య తరహా రిజర్వాయర్లు, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకులుగా ఉన్న చెరువుల్లోనే అధికంగా సాగవతున్న చేపలు, రొయ్యలను ఇకపై భారీ రిజర్వాయర్లలో పెంచేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ, మత్స్యశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. చేపలు, రొయ్య పిల్లలను వదిలేందుకు ఎంపిక చేసిన 35 రిజర్వాయర్లలో కొత్తగా 2.08 కోట్ల చేప పిల్లలను వదిలారు. అత్యధికంగా వెలుగొండ రిజర్వాయర్‌ లో 20 లక్షలు, గోదావరి బ్యారేజ్‌ లో 15.25 లక్షలు, ఏలేరు రిజర్వాయర్‌ లో 14.39 లక్షలు, నాగార్జున సాగర్‌, ప్రకాశం రిజర్వాయర్లలో సుమారు 10 లక్షల చేప పిల్లలను వదిలారు. చేప పిల్లలనే కాకుండా వివిధ రిజర్వాయర్లలో 5.66 లక్షల వెనామియా జాతి రొయ్య పిల్లలను కూడా వదిలారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లోని రిజర్వాయర్లలో వదిలే రొయ్య పిల్లల కోసం ప్రభుత్వం తాజాగా రూ 1.5 కోట్లను కేటాయించింది. భారీ రిజర్వాయర్లలో చేప, రొయ్య పిల్లలను వదలటం ద్వారా ఈ ఏడాది దిగుబడి భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. తీర ప్రాంతాల్లోని ఉప్పునీటి కయ్యల్లో సాగవుతున్న రొయ్యల దిగుబడిలో ఏపీ ఇప్పటికే దేశంలో అగ్రగామిగా ఉంది. సీజను బట్టి కనిష్టంగా 4 లక్షలు, గరిష్టంగా 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంది. ఇపుడు భారీ రిజర్వాయర్లకు సంబంధించి సుమారు 3 లక్షలు, చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లకు సంబంధించి మరో 4 లక్షలు..మొత్తం కలిపి రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగును చేపట్టటం ద్వారా ఆక్వా ఎగుమతి మార్కెట్‌ లో ఏపీ వాటా భారీగా పెరిగే అవకాశం ఉంది..2020-21లో రిజర్వాయర్ల నుంచి చేప, రొయ్యల ఉత్పత్తులు సుమారు 18 లక్షల టన్నులు ఉండగా 2021-22లో 25 లక్షల టన్నుల ఉత్పత్తులు రావచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా.

Advertisement

తాజా వార్తలు

Advertisement