Sunday, May 19, 2024

15 నుండి ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు.. జూన్‌ 1 నుండి తరగతులు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ విద్యాసంస్థలు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియను బోర్డు అనుమతించిన విధంగా చేపట్టాలని, అందుకు విరుద్ధంగా ఎవరు చేపట్టినా శిక్షార్హులని ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ ఎంవీ శేషగిరి బాబు స్పష్టంచేశారు. ఈమేరకు బుధవారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు చేపట్టేందుకు మొదటి దశ షెడ్యూల్‌ను విడుదల చేశామని, ఆమేరకు విద్యా సంస్ధలు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు. తొలి దశ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి ఈనెల 15 నుండి అప్లికేషన్ల అమ్మకాలు ప్రారంభించాలన్నారు.

పూర్తిచేసిన ధరఖాస్తులను జూన్‌ 14లోపు సమర్పించాలని చెప్పారు. మొదటి దశ అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 26 నుండి చేపట్టి జూన్‌ 1వ తేదీ నుండి తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి 10వ తరగతి మార్కుల జాబితాలను ఇంటర్నెట్‌ నుండి తీసుకున్న కాపీల ఆధారంగా తీసుకోవచ్చని, పదవ తరగతి మార్కుల మెమోలు వచ్చిన తరువాత వాటిని తీసుకోవాలని చెప్పారు. ఈ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు.

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను అనుసరించాలి

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని ప్రకారం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీ-ఏకు 29 శాతం, బీసీ-బీకు 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం వంతున ఇవ్వాలన్నారు. అలాగే విభిన్న ప్రతిభావంతులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్సు విద్యార్ధులకు 5 శాతం, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ల పిల్లలకు 3 శాతం, ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం వంతున అడ్మిషన్లలో అవకాశం కల్పించాలన్నారు.

- Advertisement -

అడ్మిషన్‌ టెస్టులు పెట్టే వీలు లేదు

ఇంటర్మీడియట్‌లో చేరగోరే విద్యార్ధులకు అడ్మిషన్‌ ఇచ్చే క్రమంలో వారికి ఎటువంటి పరీక్షలు నిర్వహించకూడదని స్పష్టంచేశారు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఒక్కో సెక్షన్‌కు బోర్డు నిర్ణయించిన విధంగా అడ్మిషన్లు చేపట్టాలని, సీలింగ్‌ దాటి చేపట్టకూడదని ఆదేశించారు. ఈమేరకు బోర్డు సూచించిన విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని శేషగిరి బాబు అన్ని ఇంటర్‌ కళాశాలలకు ఆదేశాలు జారీచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement