Monday, April 29, 2024

Delhi: ఏపీ కొత్త జిల్లాలకు ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ విధానం అమలు చేయాలి: విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ (ఓడీఓపీ) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ వి. విజయసాయి రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన స్టాండింగ్ కమిటీ రూపొందించిన 3 నివేదికలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు ఆయన నివాసంలో అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏ జిల్లాలో ఏ ఉత్పత్తి సాధ్యమో అధ్యయనం చేసి డిజిటల్ జియో మ్యాపింగ్ చేయాలని సూచించినట్టు తెలిపారు. అలాగే ఆ ఉత్పత్తికి తగ్గట్టుగా మానవ వనరులకు తగిన శిక్షణ, సామర్థ్యం పెంపుపై దృష్టిపెట్టాలని, ఈ క్రమంలో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసినట్టు ఆయన తెలిపారు.

మరోవైపు ‘డెడికెటెడ్ పోర్టల్ ఫర్ కొలాబరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్’ పేరుతో పోర్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ నివేదికలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, మెరుగుపర్చాలని సిఫార్సుల్లో పొందుపరిచారు.

ఆయా ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంచేందుకు వీలుగా ఈ-కామర్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం, ఉత్పత్తి నాణ్యతను పరీక్షించే సర్టిఫైడ్ సంస్థలతో పరీక్షించి ఎగుమతులకు వీలుకల్పించడం కూడా సిఫార్సుల్లో ఉన్నాయి.

ఈ కామర్స్ రంగంలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ 172వ నివేదికలో సిఫార్సులు చేసినట్టు తెలిపారు. ఈ-కామర్స్ సంస్థలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని, ఈ-కామర్స్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అలాగే ఈ-కామర్స్ రంగంలో పోటీ ఉండేలా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా రూపొందించిన బిల్లును తక్షణమే ప్రవేశపెట్టి చట్టంగా మార్చాలని సూచించారు.

- Advertisement -

ఈ-ఫార్మసీ బిల్లును కూడా తీసుకురావాలని సిఫార్సు చేసినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించినప్పుడే ఈ-కామర్స్ రంగం అన్ని చోట్లా విస్తరించగలదని విజయసాయి రెడ్డి అన్నారు. ఆ మేరకు సిఫార్సులు చేసినట్టు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు సూచన మేరకు ‘నేషనల్ సైబర్ క్రైం పాలసీ’ని తీసుకురావాలని కమిటీ నివేదికలో పొందుపర్చినట్టు తెలిపారు. అలాగే సైబర్ సెక్యూరిటీ ఆడిట్స్ క్రమంతప్పకుండా నిర్వహించాలని సూచించారు.

అసలు ఉత్పత్తులను పోలినట్టు ఉండే నకిలీ ఉత్పత్తులను తయారుచేసేవారికి జరిమానాలు, శిక్షలపై కూడా సిఫార్సులు చేసినట్టు తెలిపారు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ తరహాలో ‘ఈ-కామర్స్ ఎక్స్‌పోర్ట్ జోన్స్’ ఏర్పాటు చేయాలని సూచించినట్టు వెల్లడించారు. ఇకపోతే మద్యం ఉత్పత్తులను ఈ-కామర్స్ రంగంలోకి అనుమతించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నందున, దానిపై తమ కమిటీ సమావేశాల్లో చర్చ జరగలేదని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో పూలపంటల సాగును ప్రోత్సహించాలని కూడా స్టాండింగ్ కమిటీ నివేదికలో పొందుపరిచినట్టు విజయసాయి రెడ్డి తెలిపారు.

డార్జీలింగ్ తేయాకు బోగస్ ఎగుమతులకు అడ్డుకట్ట.. టీ ఎస్టేట్ కార్మికులకు కనీస వేతనం
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రూపొందించిన మరో నివేదికలో తేయాకు పరిశ్రమకు సంబంధించి పలు అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు చేసినట్టు విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రసిద్ధ డార్జీలింగ్ తేయాకు పేరుతో జరుగుతున్న బోగస్ ఎగుమతులను కట్టడి చేయాలని సూచించారు. నేపాల్‌లో ఉత్పత్తవుతున్న టీ ఉత్పత్తులను డార్జీలింగ్ టీ పేరుతో బ్రాండింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నారని, వాటిని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ నివేదికలో సవివరంగా పేర్కొన్నానని విజయసాయి రెడ్డి తెలిపారు.

అలాగే టీ ఎస్టేట్ కార్మికులకు కనీస వేతనం అందజేయాలని, కార్మికులకు అందించే ఇతర ప్రయోజనాలను కూడా వారికి వర్తింపజేయాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్టు తెలిపారు. బెంగాల్ రాష్ట్రంలో మిగతా అన్ని రంగాల్లో కనీస వేతన చట్టం అమలవుతుండగా, తేయాకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు మాత్రం అమలు కావడం లేదని తెలిపారు. మిగతా కార్మికులకు రోజుకు రూ. 328, రూ. 298, రూ. 271 చొప్పున కూలీ రేట్లు అమలవుతుండగా, టీ ఎస్టేట్ కార్మికులకు మాత్రం కేవలం రూ. 202 మాత్రమే అమలవుతోందని అన్నారు. అలాగే తేయాకు పరిశ్రమకు కల్పిస్తున్న సబ్సిడీలు చాలా కాలంగా పెండింగులో ఉన్నాయని, ఆ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు విజయసాయి రెడ్డి వెల్లడించారు. అలాగే ప్లాంటేషన్ వర్కర్స్ కి సంబంధించిన డాటాబేస్ ఏర్పాటు చేయాలని కూడా సూచించినట్టు తెలిపారు.

బ్రిటీష్‌వారు దేశాన్ని విడిచి వెళ్లినప్పుడు టీ ఎస్టేట్ హక్కులను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి వెళ్లారని, వాటిని లీజుకిస్తూ వస్తోందని, ఈ క్రమంలో లీజుకు తీసుకునేవారు మారుతున్నా అక్కడ కొన్ని తరాలుగా పనిచేస్తున్న కార్మికుల బ్రతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. ఈ క్రమంలో వారికి భూమి హక్కును కల్పించే పట్టాలను అందజేయాల్సిందిగా సిఫార్సు చేసినట్టు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement