Saturday, May 18, 2024

ఎం ఎల్ సి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటే కీలకం


తిరుపతి, మార్చి 10, ప్రభ న్యూస్ బ్యూరో (రాయలసీమ ) : పెద్దల సభ గా పేరొందిన శాసనమండలి ఎన్నికలంటే అభ్యర్థులకు అగ్ని పరీక్షే అవుతుంది . సంబంధిత ఓట్ల లెక్కింపులో ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చి వేసే ఓట్లు కీలకం అవుతాయి. మామూలుగా ఒక అభ్యర్థికి మొత్తం పోలయ్యే ఓట్లలో 50 శాతం ఓట్లు వస్తే ఏ సమస్య లేకుండా గెలిచిపోతారు. 50 శాతం ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తప్పనిసరి అవుతుంది. ఈ విషయంలో 2017 లో జరిగిన ఎన్నికలలో రాయలసీమ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికలను ఉదాహరణ గా తీసుకోవాలి. అప్పుడు పట్టభద్రుల కోటా ఎం ఎల్ సీ పదవికి జరిగిన ఎన్నికల్లో మొత్తం 1,55,711 ఓట్లు పోలయ్యాయి.

అందులో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోపాలరెడ్డి కి మొదటి ప్రధాన్యతా క్రమంలో 50 శాతం కన్నా తక్కువగా 65,889 ఓట్లు లభించాయి. అప్పుడు రెండో ప్రాధాన్యత కింద వచ్చిన 1,998 ఓట్లు కలపడంతో ఆయన గెలుపొందారు. దీన్ని బట్టి ఎం ఎల్ సి ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు విలువ ఎంతో అర్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన రాయలసీమ తూర్పు, పశ్చిమ శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయుల కోటా సీట్ల విషయం లో మొదటి ప్రాధాన్యత ఓటుకు దీటుగా రెండో ప్రాధాన్యత ఓటు విలువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీదారులు ఎందరున్నా బలబలాల కోణంలో లో పట్టభద్రుల కోటా సీటుకు వై ఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రోగ్రెస్సివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీ డీ ఎఫ్ ) అభ్యర్థులకు నడుమ హోరాహో్రీ పోరు జరగ నున్నది. టీచర్ల కోటా సీటు కు పోటీ చేయని తెలుగుదేశం ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. తాజాగా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని ఓడించాలనే లక్ష్యం తో తెలుగుదేశం, పీ డీ ఎఫ్ ల మధ్య అంగీకారం కుదిరింది. అదేమిటంటే తొలి ప్రాధాన్యత ఓటు తమ అభ్యర్థి కి వేసుకుని, మలి ప్రాధాన్యత ఓటు ఒకరికి ఒకరు వేసుకునేలా వ్యూహ రచన చేసుకున్నారు.

ఈ వ్యూహం ఈ ఎన్నికల్లో కీలకం కానున్నది. మొత్తం పోల్ అయ్యే ఓట్లలో 50 శాతం ఓట్లు వై ఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు రాక పొతే జరిగే రెండో ప్రాధాన్యత ఓట్లు వారి విజయాన్ని నిర్దేశించే స్థాయికి వస్తాయి. ఇప్పుడు పోటాపోటీగా ఓటర్లను చేర్పించిన ప్రధాన అభ్యర్థులు అత్యధికంగా తమకే ఓట్లు వచ్చేలా చూసుకోవాల్సి వస్తుంది. వీరిలో మొదటి స్థానం లో నిలవడానికి 50 శాతం ఓట్లు తప్పనిసరి అవుతాయి. లేకుంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పై ఆధార పడక తప్పదు. అటు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు , ఇటు తెలుగుదేశం, పీ డీ ఎఫ్ అభ్యర్థులు ఎక్కువగా ఓటింగ్ శాతం పెరగడానికే కాక అందులో 50 శాతం ఓట్లు తగ్గకుండా తమకు ఓట్లు వచ్చేలా చూసుకోడానికి పాట్లు పడుతున్నారు. ఇందులో ఎవరి వ్యూహం ఎంత మేరకు ఫలితం ఇస్తుందో చూడాలంటే వేచిచూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement