Wednesday, May 29, 2024

AP | జగన్.. నాటకాలు ఆపండి.. నాన్న పులి అరుపులొద్దు : పవన్ కళ్యాన్

రాష్ట్రం తన సొత్తు అని అనుకుంటున్న జగన్ కిందపడే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ జనసేనాని పవన్ హెచ్చరించారు. జగన్ కు అహంకారం తలకెక్కిందని, అందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడని మండిపడ్డారు. తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ లకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ తెనాలిలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజల పాస్ పుస్తకాలపై, పొలాల్లో హద్దు రాళ్లపై కూడా చెదరని చిరునవ్వుతో జగన్ ఫొటోలు కనిపిస్తున్నాయని విమర్శించారు.

అసలైన పాలన ఎలా ఉంటుందో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ద్వారా చేసి చూపిస్తాం. వైశ్య సోదరులపై దాడులు జరగకుండా, వ్యాపారాలు సాఫీగా జరిగేలా చూస్తాం. స్థానిక బంగారు వ్యాపారులకు అండగా నిలబడతాం. ఇక్కడి రైతుల సంక్షేమం కోసం పాటుపడతాం. చెక్ డ్యాముల నిర్మాణం చేపడతాం. అసెంబ్లీలో బూతులు తిట్టే సంప్రదాయాన్ని అడ్డుకుంటాం. చట్టసభలో సమస్యలపై చర్చ జరిగేలా చూస్తాం అని ప‌వ‌న్ హామీ ఇచ్చారు.

‘రాయి పడింది అని.. రాష్ట్రానికి గాయమైందని వైసీపీ నేతలు బాధపడుతున్నారు. అక్కను ఏడిపిస్తున్నారని ఎదిరించిన 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ను చెరుకు తోటలో పెట్రోల్ పోసి కాల్చేశారు. పసిబిడ్డను కాల్చేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? వేల మంది అమ్మాయిలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా?’ అని పవన్ ప్రశ్నించారు. జగన్ కు చిన్న గాయమైతే రాష్ట్రమంతా ఊగిపోతుందని.. సగటు మనిషికి గాయమైతే మనకు బాధ లేదా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

‘జగన్ కు గాయమైతే నాకు బాధగా ఉంది. ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసు? నాన్న పులి కథ ఒకసారి చెబితే బాగుంటుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా చెబితే ఎవరు నమ్ముతారు? అని అన్నారు. ఈ నాటకాలు ఆపండి చాలు.. భ‌రించ‌లేక‌పోతున్నామ‌ని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు కూడా ఇలాంటి డ్రామాలను నమ్మకండి’ అని ఆయన కోరారు.

‘వచ్చే నెల ఈ సమయానికి ఎన్నికలు అయిపోయి.. వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ఉంటాం. పేదలకు నిజంగా జగన్ న్యాయం చేసి ఉంటే.. ఈ రోజు జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి వచ్చేవి కాదు అని తెలిపారు.. ఇసుక దొరక్కుండా చేసి 21 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారు’ అని పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు.

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఐదో తేదీలోపు జీతాలు ఇస్తామన్నారు. జగన్ కు అధికార గర్వం తలకెక్కిందని, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఈ గర్వం ఉన్నవారిని ప్రజలే వెంటపడి తరుముతారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఈజిప్టులో హోస్నీ ముబారక్ అనే నేత 30 ఏళ్లుగా నిరంకుశంగా వ్యవహరించాడని, ఓ టైలర్ తిరుగుబాటు మిగతా ప్రజలను చైతన్యవంతులను చేసి హోస్నీ ముబారక్ అంతు చూసిందని వివరించారు. శ్రీలంకలో కూడా ప్రజాగ్రహం పెల్లుబుకిందని, ప్రజలు దేశాధ్యక్షుడి భవనంలోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టారని… రేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఇలాగే ప్రజలు వచ్చి కూర్చుంటారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement