Wednesday, May 1, 2024

కోర్టు ధిక్కార నేరం – ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల‌కు జైలు శిక్ష‌..

అమరావతి, ఆంధ్రప్రభ: కోర్టు ధిక్కార నేరం కింద సీనియర్‌ ఐఏఎస్‌ ఎంటీ కృష్ణబాబు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావుతో పాటు మరికొందరు అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. జరిమానాగా రూ.1000 చొప్పువ చెల్లించాలని లేకపోతే మరో వారం రోజులు జైలుశిక్ష అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 16వ తేదీలోగా ధిక్కార పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న అధికారులు రిజిస్ట్రార్‌ జుడీషియల్‌ ఎదుట లొంగిపోవాలని హుకుం జారీ చేయటంతో పాటు లొంగిపోయిన అనంతరం వారిని జైలుకు తరలించాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆర్టీసీలో ఫీల్డ్‌మెన్‌లుగా పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు తమ సర్వీసును క్రమబద్ధీకరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ 2020లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ల సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని 2022లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఆదేశాలను అమలు చేయకపోవటంతో ధిక్కార పిటిషన్‌ దాఖలైంది. అప్పట్లో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ప్రస్తుత వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో పాటు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, తిరుపతి రీజనల్‌ మేనేజర్‌ టీ. చెంగల్‌రెడ్డి, ఆర్టీసీ చీఫ్‌ ఇంజనీర్‌ యూఎస్‌ శ్రీనివాస్‌, నెల్లూరు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు కె.కోటేశ్వరరావులు ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మధరావు విచారణ జరిపి తీర్పును వెలువరించారు. కోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత సీనియర్‌ అధికారులపై ఉందని కోర్టు ఆదేశాలను అనివార్య కారణాల వల్ల నిర్దేశించిన గడువులోగా అమలు చేయపోతే గడువు పొడిగించాల్సిందిగా కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని తద్వారా వెసులుబాటు కలుగుతుందని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. అప్పీలు పెండింగ్‌లో ఉందనే కారణంగా ఆదేశాలను అమలు చేయకపోవటం ధిక్కారం కిందకే వస్తుందన్నారు. ఇందుకు కృష్ణబాబు, ద్వారకా తిరుమలరావుకు నెలరోజులు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1000 చొప్పున జరిమాన విధించారు. ప్రతివాదులుగా ఉన్న మిగిలిన అధికారులకు జైలు, జరిమానా వర్తింపచేస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement