Saturday, April 27, 2024

ముందు అమ‌రావ‌తిలోని టిడ్కో ఇళ్ల లెక్క తేల్చండి – హైకోర్టు

అమరావతి, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతిలో ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్ల లెక్క తేల్చాలని హైకోర్టు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఎన్ని ఇళ్లు నిర్మించారు. లబ్దిదారుల వివరాలు.. కేటాయించిన గృహాలపై సమగ్ర నివేదిక సమర్పించాలంది. రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నిమిత్తం 1134ఎకరాల భూమిని ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేలా సీఆర్‌డీఏను ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 45ను విడుదల చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వ్యాజ్యాలపై గత నెల 21వ తేదీన తుది విచారణ జరిపినన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో నోటిఫై చేసిన ఆర్‌-5 కొత్త జోన్‌లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించిందని తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ రౖౖెతుల తరుపు న్యాయవాది సూపనేని సంజయ్‌, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు లేఖ రాశారు. దీంతో రైతుల వ్యాజ్యాలపై తదుపరి విచారణ జరపాలని నిర్ణయించిన ధర్మాసనం సోమవారం విచారణకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా టిడ్కో ఇళ్లపై ఆరా తీసింది.

రైతుల వ్యాజ్యాల్లో జీవో 45 అమలును నిలుపుదల చేయాలని ఇళ్ల స్థలాల పంపిణీని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే టిడ్కో ఇళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ ననాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం వివరాలు కోరింది. గత విచార ణ సందర్భంగా టిడ్కో ఇళ్లపై రైతులు, ప్రభుత్వం ఎలాంటి వివరాలు అందించలేదని ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని మౌఖికంగా ఆదేశించింది. తదుపరి విచారణ నేటికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనంతరం తాను ఇకపై ఈ వ్యాజ్యాలను విచారించబోనని న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య తప్పుకున్నారు. దీంతో మరో ధర్మాసనం ముందు పిటిషన్లను ఉంచాలని సీజే ఆదేశించారు. ఇదిలా ఉండగా ఆర్‌-5 జోన్‌పై స్పష్టత ఇవ్వాలంటూ రైతుల తరపు న్యాయవాది సూరనేని సంజయ్‌ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు లేఖ రాశారు. ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌లో 1154 ఎకరాల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపడుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. రైతుల వ్యాజ్యాలపై మంగళవారం మరోసారి విచారణ జరపాలని ధ ర్మాసనం నిర్ణయించింది. జస్టిస్‌ జయసూర్య తప్పుకోవటంతో ఆయన స్థానంలో సీజే నేతృత్వంలో మరో న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం సభ్యులుగా విచారణ జరపనున్నారు.

ఇదిలా ఉండగా రాజధానిలో ఆర్‌-5 జోన్‌కు సంబంధించిన గ్రామాల్లో గత కొద్ది రోజులుగా స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆర్‌-5 జోన్‌లో ప్రభుత్వం 1154 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలకు పంపిణీ చేయాలని భావించి అందుకు అవసరమైన పనులు నిర్వహిస్తోంది. ఈ పనులను అటు రైతులు, ఇటు ప్రతిపక్ష ప్రధాన రాజకీయపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఆర్‌ -5 జోన్‌కు వ్యతిరేకంగా ఇటీవల అమరావతి రైతులు ప్రతిపాదిత గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది సంజయ్‌ రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆర్‌-1 జోన్‌లో ప్రస్తుత గ్రామాలు, ఆర్‌-2లో తక్కువ సాంద్రతతో నిర్మించిన గృహాలు, అల్పాదాయ వర్గాల గృహాలు, ఆర్‌-3లో మధ్యస్త సాంద్రతతో కూడిన నిర్మాణాలు, ఆర్‌-4 హైడెన్సిటీ జోన్‌లు గతంలో ఉండేవి. ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌, సీఆర్‌డీఏ చట్ట సవరణలతో ఆర్‌-5 జోన్‌ను ముందుకు తెచ్చింది. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని కొంత భూమిని సేకరించి రాజధాని యేతర ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలుగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గజట్‌ నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యాజ్యాలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement