Monday, May 6, 2024

AP Education – నాటి విద్యా వైభవం… నేడు శిథిలం…

(అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – దేశంలో ప్రభుత్వం ప్రజలు కూడా విద్యపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. పేద, మధ్యతరగతి పిల్లలు కూడా తమ పిల్లలు ఉన్నత విద్యా వంతులు కావాలని అభిలషిస్తు న్నారు. వారు అమెరికా, యూరోప్‌ దేశాలకెళ్ళి ఏటా లక్షల్లో ఆదాయం పొందాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా విద్యావకాశాల్ని పెంచుతున్నాయి. పాఠశాలల్నుంచి కళాశాలల వరకు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్ని కూడా పెద్దసంఖ్యలో నెలకొల్పుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తగినంత మంది విద్యార్ధుల్లేరంటూ ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తున్నారు. మరికొన్నింటిని క్రమబద్దీకరణ పేరిట పక్క గ్రామాల్లోని పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలోని పాఠశాలలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆర్ధిక సాయాన్ని నిలిపేసింది. ప్రస్తుతం ఈ పాఠశాలల్ని పాలకవర్గాలు మూసేస్తున్నాయి. వీటికున్న విశాలమైన స్థలాల్ని రియల్‌ఎస్టేట్‌గా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి.

స్వతంత్య్రానికి పూర్వం నుంచి కాకినాడ నగరం విద్యా కేంద్రంగా అలరారుతోంది. ఆసియాలోనే తొలి మహిళా పాలిటెక్నిక్‌, ఉమ్మడి రాష్ట్రంలో తొలి బాలుర పాలిటెక్నిక్‌, దేశంలో మహిళల కోసం తొలి కళాశాలను కాకినాడలోనే నెలకొల్పారు. అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇంజనీరింగ్‌ కళాశాల జెఎన్‌టియు కూడా కాకినాడలో ఏర్పాటు చేశారు. అప్పట్లోనే కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు సేకరించి ప్రతిష్టాత్మక రంగరాయ మెడికల్‌ కళాశాలను ఇక్కడ నెలకొల్పారు. ఈ ప్రాంతాన్ని పాలించిన పిఠాపురం మహారాజా వందల ఎకరాల విస్తీర్ణంలో పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశారు. మెడికల్‌ కళాశాలకు పెద్దమొత్తంలో భూములిచ్చారు.

కాగా ఇప్పుడు మెడికల్‌ కళాశాల భూముల్ని ప్రభుత్వమే అన్యాక్రాంతం చేసింది. అలాగే ప్రైవేటు రంగంలో పేద, మధ్యతరగతి విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన ఐడియల్‌ విద్యాసంస్థల్ని వామప క్ష భావాలు కలిగిన డాక్టర్‌ పి చిరంజీవినీకుమారి భారీగా విస్తరించారు. అనుబంధగా పలు కోర్సుల్ని తీసుకొచ్చారు. అయితే ప్రైవేటు రంగంలోని ఈ కళాశాలను నిర్వహించలేమని పాలకవర్గం చేతులెత్తేసింది. సైన్స్‌ బ్లాక్‌ మొత్తం మూసేసింది. ఇప్పుడున్న విశాల ప్రాంగణాన్ని పాలకవర్గ వారసులు రియల్‌ ఎస్టేట్‌గా మార్చేశారు. అలాగే 60వ దశకంలో ప్రైవేటురంగంలో పలువురు పెద్దల స్ఫూర్తితో ఏర్పాటైన గాంధీ సెంటినరీ స్కూల్‌ వేలాదిమంది విద్యార్ధుల భవిష్యత్‌ నిర్దేశనం చేసింది. ఇక్కడి విద్యార్ధులు సివిల్‌ సర్వీస్‌ అధికారులుగా రాణిస్తున్నారు. పలువురు దేశ, విదేశాల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డారు.
కాగా ఈ పాఠశాలను కూడా ఇక నిర్వహించలేమంటూ పాలక వర్గం తప్పుకుంది. దీనికి ప్రభుత్వం సమ్మతించింది. అత్యంత విలువైన ఈ ప్రాంగణాన్ని రియల్‌ ఎస్టేట్‌గా నిర్వాహ కులు మార్చేశారు. ఈ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, వైకాపా, జనసేన కీలక నాయకులంతా ఈ పాఠశాలకు చెందిన విద్యార్ధులే. పైగా ప్రభుత్వ వైఫల్యాన్ని తరచూ ఎం డగట్టే మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఇంటి పక్కనే ఈ పాఠశాల ప్రాంగణముంది. దీన్ని బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నా విపక్ష నేత కొండబాబు నుంచి కూడా ఏమాత్రం స్పందన కనిపించలేదు. బ్రిటీష్‌కాలంలో మిషనరీలు ఇక్కడ సిబిఎమ్‌, మెక్లారిన్‌ పాఠశాలలు నెలకొల్పారు. ఆ రోజుల్లోనే నాణ్యతతో కూడిన విద్యను భారతీయుల కందించాలని అభిలషించారు. దేశం నుంచి మిషనరీల నిష్క్రమణ అనంతరం వీటి నిర్వహణను కమిటీలు చేపట్టాయి. ఆ తర్వాత వీటిపై ప్రభుత్వ పెత్తనం మొదలైంది. వీటికి సంబంధించి కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమైపోయాయి. ఈ భవనాల్ని ఓ పధకం ప్రకారం శిథిలం చేస్తున్నారు. మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్‌ విదేశాల్లో సంపాదించుకొచ్చిన భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చి ఏర్పాటు చేసిన ఎమ్‌ఎస్‌ఎన్‌ చార్టీస్‌కు చెందిన వందలాది ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. ప్రభుత్వం ఈ విద్యాసంస్థ ప్రయోజనాల రక్షణలో ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు.

- Advertisement -

దేశవ్యాప్తంగా ఇప్పుడు విద్యాలయాల అభివృద్ది పట్ల ప్రభుత్వాలు, పాలకవర్గాలే కాకుండా పూర్వ విద్యార్ధుల్లో కూడా ఆసక్తిపెరిగింది. వివిధ రంగాల్లో స్థిరపడి కాస్త ఆర్ధికంగా నిలదొక్కుకున్న అధికారులు, నిపుణులు, వ్యాపారులు కూడా గతంలో తాము చదువుకున్న పాఠశాలల ప్రస్తుత అవసరాల్ని తీర్చేందుకు ముందుకొస్తున్నారు. వారంతా ప్రత్యేకంగా సంఘాలుగా ఏర్పడుతున్నారు. తమ పూర్వ కళాశాల పునరుద్దరణకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని కల్పిస్తున్నారు. ఆధునిక పరికరాలు అందిస్తున్నారు. అత్యాధునిక ల్యాబొరేటరీలు, లైబ్రరీల్ని నిర్మిస్తున్నారు.

తెలుగురాష్ట్రాల్తో పాటు కాకినాడలోనూ ఇటువంటి పరిస్థితులు న్నాయి. వీరంతా ప్రభుత్వ లేదా ప్రైవేటు విద్యాసంస్థల్ని కాపాడు కుంటూ భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలని అభిలషిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం చిన్న చిన్న సాకుల్తో ప్రభుత్వ పాఠశాలల్ని మూసేస్తోంది. ఏళ్ళ క్రితం దాతల విరాళాల్తో ఏర్పాటైన ప్రైవేటు పాఠశాలల నిర్వహణ భారం అధికంగా ఉందన్న సాకుతో వాటి మూసివేతకు కూడా అంగీకరిస్తోంది. పైగా ఆనాడు ఓ స్పష్టమైన లక్ష్యంతో దాతలు విరాళంగా ఇచ్చిన విలువైన ఆస్తులు, భూముల విక్రయాలకు ప్రభత్వం ఉదారంగా అనుమతులను మంజూరు చేస్తోంది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షపార్టీలు ఏమాత్రం చురుగ్గా వ్యవహరించలేక పోతున్నాయి. విద్యార్ధుల ప్రయోజనాలకివి గండికొడుతున్నాయంటూ విమర్శకులు మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement