Sunday, April 28, 2024

AP – ఆ ముగ్గురికి ఓటు వేస్తే ఎప్పటికీ ప్రత్యేక హోదా రాదు – షర్మిల

(ప్రభ న్యూస్ ఇబ్రహీంపట్నం ) కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి మేలు జరిగే విధంగా మహిళల ఖాతాల్లో ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.5 వేలు జమ చేసేలా ఇందిరమ్మ అభయం పథకం అమలు చేయనున్నట్లు పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల రెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పుట్టలమ్మ గట్టు ప్రాంతంలో శనివారం సాయంత్రం ఇందిరమ్మ అభయం పథకం రిజిస్ట్రేషన్ ను లాంఛనంగా ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ పేద కుటుంబాలను ఆదుకునేందుకు అమలు చేయనున్న అద్భుతమైన ఈ పథకం అందుబాటులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో నిలబడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో పదేళ్ల నుంచి అభివృద్ధి కుంటుపడిపోయిందన్నారు. కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు.

ప్రపంచం మొత్తం వేగంగా ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఉందని విమర్శించారు. పదేళ్లలో అందరూ అభివృద్ధి చెందితే మనం మాత్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారని, నేడు డిగ్రీలు, పీజీలు చదువుకుందామంటే తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చదువుకుంటే ఉద్యోగాలు లేవన్నారు. నాడు 23 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డీఎస్సీ ఇస్తానన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2:30 లక్షల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఒక ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేల ఉద్యోగాలతో ధగా డీఎస్సీ వేశారని ఆరోపించారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆయుధమైన ఓటును ఆలోచించి వేయాలని సూచించారు.

- Advertisement -

చంద్రబాబు, జగన్ పెద్ద పెద్ద డబ్బు మూటలతో వస్తారని, అవి ప్రజల డబ్బులేనని, వారి దగ్గర డబ్బు తీసుకుని ప్రజలకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రాన్ని హోదా గురించి జగన్ కానీ చంద్రబాబు కానీ ఒక్కసారైనా నిలదీశారా అని ప్రశ్నించారు. బాబు, జగన్, పవన్ లకు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనన్నారు. జగన్, బాబు ఎవరు ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు.

స్థానిక ప్రజలు, మహిళలతో మమేకమైన షర్మిల రెడ్డి వారితో మాట్లాడించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పేదలకు ఇళ్లకు స్వయంగా వెళ్లి ఇందిరమ్మ అభయం పథకాన్ని యాప్ లో రిజిస్ట్రేషన్ ను ప్రారంభించారు.

కార్యక్రమంలో కేంద్ర మాజీ జె.డి.సేలం, కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్, కృష్ణా జిల్లా అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement