Sunday, May 5, 2024

ఈ-కేవైసీ లేకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుందా? ఈ-కేవైసీ వల్ల ప్రయోజనాలేమిటి?

రేషన్‌ కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కార్డుదారులంతా అవస్థలు పడుతున్నారు. వేకువజాము నుంచే పోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఆధార్‌కేంద్రాల వద్ద కుటుంబసభ్యులతో సహా బారులు తీరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కార్డుదారులు రావడంతో ఆధార్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఈకేవైసీ నమోదు కేంద్రాల వద్ద ఎలాంటి భౌతికదూరం లేకపోవడం గమనార్హం. నవీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా ఈనెల 25లోపు ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతుండటంతో అందరూ పరుగులు తీస్తున్నారు. కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేయించుకోని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్‌ రాదని, అలాగే ప్రభుత్వం విద్యార్థులకు అందించే వివిధ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తారని ప్రచారం జరుగుతుండటంతో వందలాది మంది రేషన్‌ కార్డుదారులు అవస్థలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రేషన్ కార్డు ద్వారా కార్డుదారులు దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులను తీసుకునే హక్కు పొందడం కోసం బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని. అయితే ఈ-కేవైసీ కోసం బియ్యం కార్డుదారులు ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా ఏపీ ప్రభుత్వం నియమించిన గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా కానీ లేదా రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం ద్వారా కానీ బియ్యం కార్డు దారులు తమ నివాస ప్రాంతాల్లోనే సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ తెలిపారు. ఈ-కేవైసీ కోసం ఆధార్ కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారని, గడువు ముగుస్తోందని, బియ్యం కట్ అని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఈ-కేవైసీ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ-కేవైసీ పై బియ్యం కార్డుదారులకు ఉన్న అపోహలను, అనుమానాలను నివృత్తి చేసే విధంగా కోన శశిధర్ ఈ-కేవైసీ పై తెలిపిన అంశాలపై  సంగ్రహ సమాచారంతో సమాచార శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఈ-కేవైసీ( eKYC) అంటే ఏమిటి?

  • కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రాష్ట్రంలోని బియ్యంకార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు/సభ్యురాలు ఈ-కేవైసీ చేయించుకోవాలి.
  •  బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ యంత్రం ద్వారా వారి వేలిముద్రలతో ఆధార్ నెంబర్ ను ధ్రువీకరించుకునే సింపుల్ ప్రక్రియ ఈ-కేవైసీ.

ఈ-కైవైసీ వల్ల ప్రయోజనాలేమిటి?

- Advertisement -
  • కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం ఈ-కేవైసీ చేయించుకున్న  బియ్యంకార్డు/నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్టు కార్డుదారులు పోర్టబిలిటీ సదుపాయం ద్వారా ప్రతి సభ్యులు వ్యక్తిగతంగా నిత్యావసర రేషన్ సరుకులను దేశంలో ఎక్కడినుండైనా పొందే హక్కు కలుగుతుంది. ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడానికి కూడా వీలు కలుగుతుంది.

ఈ-కేవైసీ ని ఎక్కడ..ఎవరితో..ఎలా చేయించుకోవాలి?

  • ఈ-కేవైసీ ప్రక్రియను చాలా సులభతరంగా…మీ గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా  చేయించుకోవచ్చు.
  •  లేదా మీ చౌక ధరల దుకాణపు డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్(ePOS) యంత్రం ద్వారానైనా ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.
  •  వేలి ముద్రలు సరిగా పడని వారు వారి చౌక ధరల దుకాణం వద్ద ఈ-పోస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్( FUSION FINGER) సదుపాయాన్ని వినియోగించుకుని ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తీ చేసుకోవచ్చు.
  • వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం వద్ద కానీ లేదా చౌక ధరల దుకాణం వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం వద్ద కానీ ఈ-కేవైసీ ఫెయిల్ అయిన వారు మరియు ఇదివరకు బయోమెట్రిక్ రికార్డు కాని వారు మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవచ్చు.
  • ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన వారిలో దాదాపు 80 శాతం మంది గ్రామ/వార్డు వాలంటీర్ ద్వారా ఈ-కేవైసీ పూర్తీ చేయించుకోవచ్చు.

ఈ-కేవైసీ ఎవరికి అవసరం..ఎంత గడువులోపు పూర్తీ చేయించుకోవాలి?

  • బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలి
  •  అయితే 0-5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ-కేవైసీ అవసరం లేదు
  •  5 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న వారికి వచ్చే నెల సెప్టెంబర్ ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి
  • మిగిలిన వయసు వారు ఈనెల ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి
  • పరిస్థితిని బట్టి గడువు పొడిగింపు పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది

ఆధార్ నమోదు కేంద్రాలుగా గ్రామ/వార్డు సచివాలయాలను గుర్తించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2102 ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు..అపోహలు వద్దు

ఈ-కేవైసీ ప్రక్రియ బియ్యం కార్డులను తొలగించే ప్రక్రియ కాదు – ఇది కేవలం ఆధార్ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు బియ్యం కార్డులో ఈ-కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి సభ్యునికీ/సభ్యురాలికీ నిరంతరాయంగా రేషన్ సరుకులను యథావిధిగా సరఫరా చేయడం జరుగుతుందని పేర్కొంది. అపోహలను, అనుమానాలను విడనాడి, పుకార్లను నమ్మకుండా బియ్యం కార్డుదారుల్లో అక్కడక్కడా ఇంకా ఈ-కేవైసీ చేసుకోని వారు ఎవరైనా ఉంటే పైన తెలిపిన గడువు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమీషనర్ కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండిః

Advertisement

తాజా వార్తలు

Advertisement