Monday, April 29, 2024

AP – కూట‌మి నేత‌ల‌పై కుట్ర‌లు! పోటీ చేయ‌కుండా కేసులు – చంద్రబాబు గరం గరం

బోండాను ఇరికిస్తే తాటా తీస్తాం
సీఎం జ‌గ‌న్‌కు సెక్యూరిటీ క‌ల్పించ‌డంలో లోపాలు
ఫెయిల్ అయిన పోలీసు అధికారులపై చ‌ర్య‌లేవీ
రాయి దాడి కేసులో పోలీసుల‌కు చంద్ర‌బాబు వార్నింగ్
ఈ కేసులో బోండా ఉమ పేరు చేర్చే కుట్ర‌
అలా జ‌రిగితే చ‌ర్య‌లు క‌ఠినంగా ఉంటాయి
ఈసీ సీరియ‌స్‌గా తీసుకోవాలని టీడీపీ అధినేత రిక్వెస్ట్‌

అమరావతి – సీఎంపై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అభాసుపాలయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల సమయంలో టీడీపీ నేతలపై కుట్రలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను సీఎంపై దాడి కేసులో ఇరికించే ప్రభుత్వ కుట్రను ఖండిస్తున్నానని తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు. తప్పు చేసే అధికారులూ బీకేర్ ఫుల్… మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అంటూ చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు.

అధికార పార్టీ కుట్ర‌లు..

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంద‌న్నారు. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలకు వైసీపీ తెరలేపింద‌న్నారు. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీ కొట్టడంతో ఆ పార్టీ పీకల్లోతు బురదలో కూరుకుపోయిందని మండిప‌డ్డారు. నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయార‌ని, వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయార‌న్నారు. దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయ‌ని, అసలు రాయి విసిరింది ఎవరు… కారణాలు ఏంటి… వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు యత్నాలు చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, నమ్మించడం కోసం పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంద‌ని ఆరోపించారు.

- Advertisement -

పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఇరికించాల‌నే ప్లాన్‌..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్యనేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో వైసీపీ పావులు కదుపుతోందని చంద్ర‌బాబు అన్నారు. దీనికోసం నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వప్రయత్నాలు చేస్తోంద‌న్నారు. దీనిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను కేసులో ఇరికించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంద‌ని ఆరోపించారు. కీలక ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఈ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేద‌ని, నేడు మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం… అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా, జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠిన చ‌ర్య‌లుంటాయ‌న్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాల‌న్నారు. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణ బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాల‌ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement