Sunday, May 5, 2024

అయిల్‌ పామ్‌ హబ్‌గా ఏపీ.. దిగుబడి పెంపుపై దృష్టి..

అమరావతి, ఆంధ్రప్రభ : ద్రవ్యోల్బణ టోకు సూచీ ఎగుబాకుతోంది..నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనికి తోడు ప్రపంచంలో ఎక్కడ ఏ విపరిణామాలు చోటు చేసుకున్నా ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల లభ్యత తగ్గిపోయి డిమాండ్‌ సప్లయ్‌ లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేర్పిన పాఠం కూడా ఇదే..ఈ నేపథ్యంలో అందుబాటు-లో ఉన్న దేశీయ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని దిగుమతులను క్రమేపీ తగ్గించుకోటం ద్వారా మార్కెట్‌ దూకుడును కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల వల్ల అన్ని నిత్యవసరాల కన్నా వంటనూనెల ధరలు అధికంగా భగ్గుమమన్నాయి. కేవలం ఒక నెల వ్యవధిలో 50 నుంచి 70 శాతం మేర పెరిగిన అధిక ధరలు సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ – ఆయిల్‌ పామ్‌ (ఎన్‌.ఐ.ఎం.ఈ.వో-ఓపీ) పేరుతో దేశీయ మిషన్‌ ను ప్రకటించింది. దేశంలో అన్ని రకాల వంట నూనెల వినియోగంలో పామాయిల్‌ వాటా 42 శాతంగా ఉంది. 2020-21లో 13.13 మిలియన్‌ టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటే అందులో పామాయిల్‌ దిగుమతి 63.36 శాతం. దీన్ని కనీస స్థాయికి తగ్గించేందుకు వీలుగా 2025-26 నాటికి దేశవ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగును 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణానికి పెంచాలనీ, 11.2 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ ఆయిల్‌ పామ్‌ (ఎన్‌.ఐ.ఎం.ఈ.వో-ఓపీ) లక్ష్యంగా ప్రకటించి అన్ని రాష్ట్రాల్రకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్ల్రో అయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలమైన వాతావరణం సమృద్ధిగానే ఉన్నా సాగు, ప్రాసెసింగ్‌, సాంకేతిక ప్రక్రియల్లోని సంక్లిష్టతలు, మౌలిక వసతుల కొరత వల్ల రైతులతో పాటు- ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇపుడయితే ఆయిల్‌ పామ్‌ ను ఒక లాభసాటి సాగుగా, అత్యధిక డిమాండ్‌ ఉన్న పంటగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి.

ఏపీ టాప్‌..

పామాయిల్‌ సాగు విస్తీర్ణం, దిగుబడిలో దేశవ్యాప్తంగా ఏపీ ప్రధమ స్థానంలో నిలిచింది. కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం దేశవ్యాపిత ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణంలో 48.51 శాతం, ఉత్పత్తిలో 88.24 శాతం వాటాను ఏపీ సొంతం చేసుకుంది. 2018-19 నుంచి వరుసగా ఏపీ ఇదే టెడ్‌ ను కొనసాగిస్తోంది. మూడు దశాబ్దాల నుంచే అక్కడక్కడా రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తూనే ఉన్నా సాగు విస్తీర్ణం మాత్రం పరిమితంగా ఉంది. వ్యవసాయశాఖ అధికారిక అంచనా ప్రకారం 1991-92లో కేవలం 8585 హెక్టార్లుగా ఉన్న సాగు విస్తీర్ణం 2020-21 నాటికి 3.7 లక్షల హెక్టార్లుకు చేరింది. అందులోనూ రెండేళ్ల క్రితం ఆయిల్‌ పామ్‌ హబ్‌ గా ఏపీ అవతరిస్తుందనటానికి ఇదే నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారు. కొవిడ్‌ ప్రభావంతో 2020-21లో రాష్ట్రంలోని 1,79,489 హెక్టార్లలో మాత్రమే అయిల్‌ పామ్‌ సాగు చేపట్టినా అందులో 93835 హెక్టార్ల విస్తీర్ణం పశ్చిమ గోదావరిలోనే ఉందని అధికారిక సమాచారం. తూర్పు గోదావరిలో 34900, కృష్ణాలో 19514, విజయనగరంలో 14101, శ్రీకాకుళంలో 3958, నెల్లూరులో 4336, అనంతపురంలో 293 హెక్టార్ల విస్తీర్ణంలో అయిల్‌ పామ్‌ సాగవుతోంది. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతంలో ఇసుకనేలలు మినహాయించి అధిక సేంద్రీయత, నీరు తేలికగా ఇంకిపోయే గుణం ఉన్న మెట్టనేలలన్నీ ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలగా ఉన్నట్టు- వ్యవసాయశాస్త్రవేత్తలు నిర్దారించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 229 మండలాల్లో ఆయిల్‌ పామ్‌ సాగవుతుండగా హెక్టారుకు 19.81 టన్నుల ఆయిల్‌ దిగుబడి వస్తున్నట్టు- రాష్ట్ర ఉద్యానవనశాఖ అంచనా.

టన్ను ధర రూ 16,400 – రూ 80 కోట్లతో ప్రణాళిక

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టే రైతులకు ఇతర ప్రోత్సాహకాలు అందించటమే కాకుండా రూ 80 కోట్లతో ప్రభుత్వం గిట్టు బాటు ధరల కోసం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది, టన్నుకు కనిష్టంగా రూ 16,400 చెల్లించేందుకు వీలుగా రూ 80 కోట్లతో నిధి ఏర్పాటు- చేశారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు అవసరమైన వేప చెక్క, ఇతర సేంద్రీయ ఎరువులను రైతు భరోసా కేంద్రాల కియోస్క్‌ బుకింగ్‌ ల ద్వారా సరఫరా చేయటం, ఆయిల్‌ ఫామ్‌ ఫార్మ్‌ గేటుకు సమీపంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పటం, రైతులకు అవసరమైన మొక్కలను సరఫరా చేయటం, సన్న, చిన్న కారు రైతులను ఆయిల్‌ పామ్‌ సాగు వైపు దృష్టి మరల్చేలా ప్రోత్సాహకాలు పెంపొందించటం తదితర ప్రతిపాదనల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్‌ పామ్‌ ను జాతీయ వంట నూనెల మిషన్‌ (ఎన్‌ఎంఈవో)లో చేర్చటం ద్వారా భారీ రాయితీలు ప్రకటించింది. ఉద్యానవనశాఖ నుంచి రైతులకు అందించే ప్రతి ఆయిల్‌ పామ్‌ మొక్కపై 85 శాతం సబ్సిడీని ప్రకటించింది. సబ్సిడీని జాతీయ ఆహార భద్రత మిషన్‌ నుంచి రైతులకు నేరుగా అందిస్తోంది. సాగుకు అవసరమైన వర్మీ కంపోస్ట్‌ యూనిట్లు, పంపు సెట్లు-, గొట్టపు బావులతో పాటు ఇతర యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది.

- Advertisement -

అయిల్‌ పామ్‌పై కీలక సమావేశం..

అయిల్‌ పామ్‌ సాగుకు అనుబంధంగా అగ్రి ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రోత్సాహకాలు, పంట ధరలను హేతుబద్ధంగా నిర్ణయించేందుకు ఆయిల్‌ ఎక్ట్రాక్స్రన్‌ రేషియో (ఓఇఆర్‌) ను అనుసరించటం, ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నష్టపోకుండా నష్ట నివారణ నిధి (వయబులిటీ- గ్యాప్‌ ఫండింగ్‌) ఏర్పాటు చేయటంపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డి ఇటీ-వల రైతులు, అధికారులు, కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించారు. అభిప్రాయాలన్ని క్రోడీకరించి ఆయిల్‌ పామ్‌ సాగుపై ప్రభుత్వం నూతన విధానాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. దీనిలో భాగంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం రైతులను భారీగా ప్రోత్సహించానీ, రిజిస్ట్రేష్రన్లను స్వీకరించాలని నిర్ణయించారు. ప్రతి ఏడాది సీజన్‌ ప్రారంభం కాకముందే గిట్టు-బాటు ధరలను ప్రకటించి అయిల్‌ పామ్‌ రైతులకు అండగా నిలబడాలని ప్రభుత్వం భావిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement