Tuesday, May 14, 2024

Andhra Pradesh – ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులతో అభివృద్ది ప‌థంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌…మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కొమ్మినేని

విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు18 (ప్రభ న్యూస్) : ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ది ప‌థంలో దూసుకుపోతోంద‌ని, సి.రాఘ‌వాచారి రాష్ట్ర మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావు అన్నారు. త‌న 46 ఏళ్ల వృత్తి జీవితంలో ఇంత‌టి అభివృద్ది, సంక్షేమాన్ని ఎన్న‌డూ చూడ‌లేద‌ని చెప్పారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బుధ‌వారం ఆయ‌న ప‌ర్య‌టించారు. రామ‌నారాయ‌ణం, పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం, రామ‌తీర్ధం శ్రీ‌సీతారామ‌స్వామి ఆల‌యాల‌ను ఆయ‌న సంద‌ర్శించారు. పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద మీడియాతో మాట్లాడ‌తూ, గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా, పోర్టులు, వివిధ ర‌కాల ప్రాజెక్టుల రూపంలో అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఛైర్మ‌న్ అన్నారు. ఒక జ‌ర్న‌లిస్టుగా ప్ర‌స్తుత రాష్ట్ర ప‌రిస్థితుల‌ను విశ్లేషిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. రామాయ‌ప‌ట్నం పోర్టు ప‌నులు చురుగ్గా జ‌రుగుతున్నాయ‌ని, విజ‌య‌న‌గ‌రంలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌, శ్రీ‌కాకుళం జిల్లాలో మూల‌పేట పోర్టు, విశాఖ‌లో ఇన్‌ఫోసిస్ కేంద్రం లాంటివాటిని ఉద‌హ‌రించారు. అభివృద్దికి విశాఖ కేంద్రంగా ఉత్త‌రాంధ్ర ముఖ‌చిత్రం మారుతోంద‌ని అన్నారు. ఎప్ప‌టికైనా హైద‌రాబాద్‌కు ధీటుగా విశాఖ అభివృద్ది చెందుతుంద‌ని చెప్పారు. గ‌తంలో ఉత్త‌రాంధ్ర నుంచి వ‌ల‌స‌లు ఎక్కువ‌గా ఉండేవ‌ని, ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డంతో ప్ర‌స్తుతం బాగా త‌గ్గాయ‌ని తెలిపారు. అభివృద్దికి విశాఖప‌ట్నం గ్రోత్ ఇంజ‌న్‌గా మారింద‌ని అభివ‌ర్ణించారు. విశాఖ‌పట్నం ఇప్ప‌టికే ఎంతో అంద‌మైన న‌గ‌ర‌మ‌ని, దానిని మ‌రింత అందంగా, అభివృద్దికి కేంద్రంగా మార్చేందుకు ముఖ్య‌మంత్రి కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

రాష్ట్రంలో సుమారు రూ. 2.5 ల‌క్ష‌ల కోట్ల విలువైన‌ ప్రాజెక్టులు రాబోతున్నాయ‌ని ఇటీవ‌లే ఒక ప‌త్రిక‌లో ప్ర‌త్యేక క‌థ‌నం వ‌చ్చింద‌ని, అది వాస్త‌వ‌మేన‌ని అన్నారు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి త‌న ప‌లుకుబ‌డిని, ప‌రిచ‌యాల‌ను ఉప‌యోగించి రాష్ట్రానికి ల‌క్ష‌ల కోట్ల విలువైన ప‌లు ప‌రిశ్ర‌మ‌లు, ప్రాజెక్టుల‌ను తెస్తున్నార‌ని చెప్పారు. త్వ‌ర‌లో రామాయ‌ప‌ట్నం వ‌ద్ద రూ.40వేల కోట్ల విలువైన ప‌రిశ్ర‌మ ఏర్పాటు కానుంద‌న్నారు. తాను రాష్ట్ర‌వ్యాప్తంగా విస్తృతంగా ప‌ర్య‌టిస్తూ, అభివృద్ది సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌రిశీస్తున్నాన‌ని చెప్పారు. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష మ‌రో అద్భుత కార్య‌క్ర‌మమ‌ని ప్ర‌శంసించారు. ఈ శిబిరాల ద్వారా 14 ర‌కాల ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, సుమారు 105 ర‌కాల మందుల‌ను ఉచితంగా అందిస్తున్నార‌ని చెప్పారు. అలాగే వ‌లంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం ముఖ్య‌మంత్రి దూర‌దృష్టికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ అభివృద్ది కొన‌సాగాలంటే జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి మ‌రోసారి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మీడియా అకాడ‌మీ ప‌రంగా జ‌ర్న‌లిస్టుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని, దీనిలో భాగంగా ప్ర‌తీ శ‌నివారం ఆన్‌లైన్లో క్లాసులు నిర్వ‌హిస్తున్నామ‌ని, వివిధ ర‌కాల పుస్త‌కాల‌ను ప్ర‌చురిస్తున్నామ‌ని ఛైర్మ‌న్ శ్రీ‌నివాస‌రావు వివ‌రించారు. ప‌ర్య‌ట‌న‌లో ఓఎస్‌డి శ్రీ‌నివాస్ జీవ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement