Monday, April 29, 2024

Andhra Pradesh – లెఫ్ట్ పార్టీలతో ష‌ర్మిల రైట్ రైట్‌!

(ఆంధ్రప్రభ, అమరావతి) – వైసీపీ, టీడీపీ-బీజేపీకి తొత్తులుగా మారామ‌న్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల‌. ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతోందని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు ఉంటుంద‌ని తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో శుక్రవారం వామపక్ష పార్టీలతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తామంతా ఏపీ ప్రజల కోసం కలిసి పోరాడే అంశంపై చర్చలు జరిపామన్నారు. తామంతా కలిసికట్టుగా పోరాటాలు చేస్తామని చెప్పారు, కలిసికట్టుగా లేకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడం అసాధ్యమని షర్మిల అభిప్రాయపడ్డారు. అనంతపురంలో జరిగే సభకు సీపీఐ,సీపీఎంని ఆహ్వానించామన్నారు.

సీట్ల స‌ర్దుబాట్లు ఉంటాయి.. చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి..

ఎన్నికల్లో పొత్తు, సీట్ల సర్దుబాట్లపై చర్చలు జరుగుతున్నాయని ష‌ర్మిల అన్నారు. పొత్తులపై త్వరలో అన్ని అంశాల మీద క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్ 2014 అధికారంలో వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి 10ఏళ్లు ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. హోదా విషయంలో వైసీపీ అధినేత‌ జగన్, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇద్దరూ విఫలం అయ్యారని విమ‌ర్శించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే పోలవరం పూర్తి అయ్యేదన్నారు. ప్రధాని మోదీ తిరుపతిలో మాట ఇచ్చి.. హోదాపై మాట మార్చారని షర్మిల మండిప‌డ్డారు. తాము రామభక్తులం అని చెప్పుకుంటే సరిపోతుందా ? అని ప్రశ్నించారు. ఇక ఆళ్ల‌ రామకృష్ణ రెడ్డి అంశంలో మాట్లాడుతూ.. రామకృష్ణారెడ్డి నాకు దగ్గర మనిషి అని.. ఆయన ఎక్కడున్నా బాగుండాలని అన్నారు. ఆయన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులు ఉన్నాయి, ఆయన చెల్లెలిగా నేను అర్థం చేసుకున్నా అని చెప్పారు, ఒక మంచి వ్యక్తి , ఒక రాంగ్ ప్లేస్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని మండిప‌డ్డారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ మీదనే త‌మ పోరాటం ఉంటుంద‌న్నారు. ఈ కూటములు రాష్ట్రాన్ని ఘోరంగా మోసం చేశాయని విమ‌ర్శించారు.

బీజేపీ పొత్తు కోసం బాబు పొర్లు దండాలు..

ఒక్క శాతం కూడా ఓటు షేర్ లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోందని సీపీఎం నేత వి. శ్రీ‌నివాస‌రావు అన్నారు. బీజేపీ మీద దుమ్మెత్తి పోసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు వారి పొత్తు కోసం పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు డిల్లీ చుట్టూ తిరగడం లేదన్నారు. ఇన్నిసార్లు తిరిగినా ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజధానికి నిధులు లేవని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సహకారం తీసుకుంటామన్నారు. అందరం కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేస్తాం అని స్ప‌ష్టం చేశారు. ఈ దుష్ట కూటమిని ఓడిస్తామన్నారు. బీజేపీనీ, బీజేపీకి కాపుగాసే వారిని సాగనంపుతామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

- Advertisement -

బీజేపీ పాల‌న‌లో ప్ర‌మాదంలో దేశం..

బీజేపీ పాల‌న‌లో దేశం ప్ర‌మాదంలో ప‌డింద‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. బీజేపీ
మత తత్వ రాజకీయాలు చేస్తోంద‌న్నారు. బీజేపీ మళ్లీ అధికారంలో వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తారని ధ్వ‌జ‌మెత్తారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉందన్నారు. ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయని చెప్పారు. జగన్, బాబు, జ‌న‌సేన అధినేత‌ పవన్ కూడా మోదీకి దాసోహం అంటున్నారని రామకృష్ణ విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్నిబీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని మండిప‌డ్డారు. ఇతర ప్రజాతంత్ర పార్టీలను కూడా క‌లుపుకుపోతామ‌న్నారు. దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదనేది త‌మ ల‌క్ష్యం అన్నారు. జగన్ 5 ఏళ్లు పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యింద‌ని విమ‌ర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement