Friday, May 17, 2024

Andhra Pradesh – ఆపరేషన్ ఫోర్ – టీడీపీ, జనసేన ఓట‌మే లక్ష్యం

సైలెంట్ మిష‌న్‌!
ముగ్గురు నేత‌ల‌తో పక్కా ప్లాన్
పెద్దిరెడ్డికి కుప్పం, హిందూపురం బాధ్య‌త‌లు
మిథున్ రెడ్డికి పిఠాపురం ప‌గ్గాలు
రామ‌కృష్ణారెడ్డికి మంగళగిరి అప్ప‌గింత‌
కీల‌క లీడ‌ర్ల‌ ఓటమే లక్ష్యంగా వ్యూహాలు
రంగంలో దిగి చ‌క్రం తిప్పుతున్న‌ అతిరథులు
వైసీపీ ఎన్నికల ప్లాన్‌పై ఏపీలో ఉత్కంఠ

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీ ఎన్నికల్లో అధికార పక్షం వైసీపీ కొత్త ఎత్తులు, న‌యా పాచిక‌లు విసురుతోంది.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలైన‌ తెలుగుదేశం, జ‌న‌సేన వంటి ప్రధాన ప్రత్యర్థుల ఇలాఖాలపై దృష్టి సారించింది. ఆ పార్టీల్లోని అధినేతల్ని ఓడించటమే టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. సీఎం జగన్ కోటపై తెలుగుదేశం అధినేత దృష్టిసారిస్తే.. పసుపు కోటలే కాదు.. జనసేనానినీ ఓడించడ‌మే లక్ష్యంగా వైసీపీ పక్కా ప్లాన్ వేసిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. ఇందుకు ఒక జిల్లా నేత మరో జిల్లాలో మకాం వేయటమే కారణమని పొలిటికల్ ఎనలిస్టుల అంటున్నారు.

- Advertisement -

సైలెంట్ మిష‌న్‌..

ఈ ఎన్నికల్లో కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నాలుగు నియోజకవర్గాలపైన జగన్ ఫోకస్ పెట్టారు. . చంద్రబాబు, బాలయ్య, లోకేశ్‌, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కుప్పం..హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అతిరథులను రంగంలోకి దించారు. కుప్పం, హిందూపురం నియోజకవర్గాల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేటాయించారు. పిఠాపురంలో వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతను ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం ప్రచారం తీరు తెన్నులు.. మేనిఫెస్టో త‌ర్వాత‌ క్షేత్ర స్థాయి పరిస్థితులు.. మిగిలిన పది రోజుల కార్యాచరణపై పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో జగన్ ప్రచార సభల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇక.. పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలు అప్పగించమే కాదు.. ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని నియోజకవర్గ బాధ్యులను ఆదేశించారు. చంద్రబాబు, బాలయ్య, లోకేష్ టార్గెట్‌గా.. టీడీపీకి పడే ఓట్లను చీల్చే వ్యూహాన్ని ప‌న్నిన‌ట్టు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చమే ధ్యేయంగా ప్రణాళికలు ర‌చించిన‌ట్టు అవ‌గ‌తంఅవుతోంది.

కుప్పంపై హిందూపురంలో విస్తృత ప్రచారం

కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారంటూ చాలా రోజులుగా వైసీపీ ముఖ్య నేతలు హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు. జగన్ సైతం కుప్పంతో సహా వై నాట్ 175 అంటూ నినదిస్తున్నారు. అక్కడ భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. పైగా బీసీ కార్డును ప్రయోగించారు. ఇన్నాళ్లకు బీసీల ప్రతినిధి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం దక్కిందని, ప్రతీ ఇంటికి చేరువయ్యేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అయితే.. చంద్రబాబు సైతం కుప్పంలో కౌంటర్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గం కంటే కుప్పం పైనే ఎక్కువగా కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా హిందూపురం నుంచి బాలయ్య మీద దీపికను బరిలోకి దింపారు. ఈ నెల 4న హిందూపురంలో జగన్ రోడ్ షో ఏర్పాటు చేశారు. అక్కడ సామాజిక వర్గాల సమీకరణాలే ఈ సారి గెలుపులో కీలకం కానున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంతో పాటు, కుప్పంలో పార్టీ గెలుపు పెద్దిరెడ్డికి సవాల్ గా మార‌నుంది.

పిఠాపురంలోనూ అదే ప్లాన్

జ‌న‌సేన అధినేత పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపు అందరి చూపు ప‌డింది. అక్కడ వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ సారి గెలుపు పవన్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. వర్మకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీ సైలెంట్ ఆపరేషన్ కొనసాగుతోంది. సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేశారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం చరిష్మాను ప్రయోగిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ఓటు బ్యాంకును ఎట్టిపరిస్థితిలో తగ్గని విధంగా ప్లాన్ చేస్తున్నారు. కానీ, పవన్ రూటే సెపరేటుగా మారింది. అవినీతి, అక్రమాలపై గురి పెడుతున్నారు. యువతకు ఉపాధి అంశాన్ని వెలుగులోకి తెస్తున్నారు. అరవింద కంపెనీలు, బాక్సైట్ అక్రమ రవాణా అంశాలతో ప్రచారంలో ఉండగా.. ఇక ఆయన కుటుంబ సభ్యులూ ఎన్నికల ప్రచారంలోకి వచ్చారు. ఇలా పవన్ కు పెరుగుతున్న ఇమేజీకి అడ్డుకట్టగా.. పకడ్బందీ ప్లాన్‌ని వైసీపీ రంగంలోకి తెస్తోంది.

లోకేష్ పై లోకల్ బాణం

మంగళగిరిలో పోటీ చేస్తున్న లోకేష్‌పై లోకల్ , బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. స్థానికంగా సామాజిక లెక్కల ఆధారంగా వైసీపీ ముందుకు వెళ్తోంది. రామకృష్ణారెడ్డికే ప్రధాన బాధ్యతలు అప్పగించారు. ఆయన సహచర వర్గం పూర్తిగా పనిచేస్తే.. లోకేష్‌పై స్థానికేతరుడిగా బలహీన పడతారని వైసీపీ ఆలోచన. అంతే కాకుండా బీసీ మహిళకు సీటు ఇవ్వటంతో.. అక్కడి బలమైన చేనేత వర్గం ఆర్‌కే వెంటే ఉంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. పైగా బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంకును సీపీఎం కొల్లగొడితే..చాలు మంగళగిరి నుంచి లోకేష్ మరో సారి పంపించటం ఖాయంగా వైసీపీ భావిస్తోంది. ఈ స్థితిలో మంగళగిరి, పిఠాపురంలో ప్రచారం ముగింపు చివరి రెండు రోజుల్లో జగన్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. దీంతో..ఈ నియోజకవర్గాల్లో రాజకీయ ఎత్తుగడలు, ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement