Friday, May 10, 2024

చేనేతలపై దాడులకు పాల్పడితే ఊరుకోబొం – పరిటాల శ్రీరామ్

ధర్మవరం జులై 24 ప్రభ న్యూస్ చేనేతలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఊరుకునే పరిస్థితి లేదని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. ఇన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉన్న కారణంగా శ్రీరామ్ బాధితులను కలుసుకోలేదు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సోమవారం బాధితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెప్పారు ధర్మవరంలో చేనేత కార్మికులు మృదుస్వభావులుగా ఉంటారని వారు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదని శ్రీరామ్ అన్నారు. ఇటీవల కరోనా సమయంలో వ్యాపార పరంగా తీవ్రంగా నష్టాలు మోస్తున్నారని.. ఇలాంటి సమయంలో చీరలు తీసుకున్న వాటికి డబ్బు ఇవ్వకుండా వేధింపులు చేయడం సరైన చర్య కాదన్నారు. విజయవాడలో ఏకంగా దాడులు చేశారని ఇది చేనేత వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో ధర్మవరంలో ఉన్న చేనేత కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించారు. ఇలా దాడులు చేసేవారు ఏ పార్టీ వారైనా ఉపేక్షించకూడదని వారందరికీ గుణపాఠం చెప్పాలా చేనేతలు కలిసి ఉండాలని సూచించారు.

ఇటీవల చేనేత వ్యాపారులకు చాలామంది బకాయిలు ఉన్నట్లు తెలుస్తోందని వారు భయంతో వారిని నిలదీయలేకపోతున్నారని ఇలాంటి వారికి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతలపై ఈ తరహాలో దాడులు పట్ల తీవ్రంగా వ్యవహరించేలా ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామని ఈ అంశం మీద చంద్రబాబు లోకేష్ తో మాట్లాడుతానని పరిటాల శ్రీరామ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement