Monday, May 6, 2024

Uravakonda – మ‌హిళ‌ల‌కు ఇచ్చిన మాట నిలుపుకున్న జ‌గ‌న్ – మంత్రి పెద్దిరెడ్డి

ఉరవకొండ: ప్రతిపక్ష నేతగా నాడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో అమలు చేశారని జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. వైయ‌స్ఆర్‌ ఆసరా పథకం నాలుగో విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉరవకొండ పట్టణంలో ఈ నెల 23 న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉరవకొండ పట్టణంలోని తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ప్రభుత్వ అధికారులతో మంత్రి ఇతర నేతలు సమావేశం ఏర్పాటు చేసి చేపట్టవలసిన చర్యలు ఏర్పాట్లను గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలసిల రఘురాం, ఉరవకొండ సమన్వయకర్త వై. విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ విజయవంతానికి పనులు ఎలా చేపట్టాలన్న విషయంపై అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. ఈ నెల‌ 22 నాటికి అన్ని పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌకర్యం లేకుండా పోలీసులు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ నెల 23 వరకు జిల్లా అధికారులకు ఎలాంటి సెలవులు ఉండవని కలెక్టర్ గౌతమి అన్నారు. సభకు వచ్చిన వారికి నీరు, భోజనాలు తదితర ప్రత్యేక ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలన్నారు.

సమీక్ష అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైయ‌స్ జ‌గ‌న్ మహిళలకు సంబంధించి అప్పటి వరకు మిగిలి ఉన్న డ్వాక్రా రుణాలన్ని నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పడం జరిగిందని ఆమేరకు వైయ‌స్ఆర్‌ ఆసరా పథకం ద్వారా ప్రతి ఏటా రూ 6,500 కోట్లు చెప్పున మూడు విడతల్లో 19500 కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. మరో 6,500 కోట్లు కూడా ఈ నెల 23 న ఉరవకొండ వేదికగా మహిళల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగో విడతల వైయ‌స్ఆర్‌ ఆసరాను కలుపుకుని మొత్తం రూ.25 వేల కోట్లు విడుదల చేసినట్లుగా అవుతుందన్నారు.ఈ పథకం మహిళలకు ఆసరాగా, అండగా నిలిచిందన్నారు.

ఈ స‌మావేశంలో ఏపీఐఐసీ చైర్మ‌న్‌ మెట్టు గోవిందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు మంగమ్మ, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర నారాయణ,ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకులు శ్రీనివాసులు, ఉన్నత విద్యా మండలి సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, ఎస్సి సెల్ నేతలు ఎగ్గుల శ్రీనివాసులు, పెన్నిబులేసు, ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత, నేతలు పామిడి వీరాంజినేయులు, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, జిల్లా,మండల స్థాయి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement