Monday, April 29, 2024

Big story | సాకారం కాని దశాబ్దాల కల.. ఉప్పు నీటి నుంచి కొల్లేరు పరిరక్షణ

కృష్ణా , ప్రభ న్యూస్‌ బ్యూరో : కొల్లేరును మంచినీటి సరస్సుగా తీర్చిదిద్దేందుకు సముద్ర ముఖద్వారం వద్ద రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనలు నిధులు సమస్యతో కార్యరూపం దాల్చడం లేదు. గత దశాబ్దకాలంగా కొల్లేరులో రెగ్యులేటర్లు, గరిశపూడి వద్ద అండర్‌ టర్నల్‌ నిర్మాణం చేయాలనే డిమాండ్‌ అలానే ఉంది. ఈ కల సాకారమైతే కొల్లేరు పరిధిలోని ఐదు నియోజకవర్గాలలో సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ. 345.75 కోట్లతో అధికారుల అంచనాలు సిద్ధం చేశారు. ఆ మేరకు నిధులు కోసం ప్రభుత్వానికి పంపారు.

కృష్ణా జిల్లా, ఏలూరు, పశ్చిమగోదావరిల్లోని పలు మండలాలకు ప్రయోజనకరంగా ఉండేలా ఉప్పుటేరు పరిధిలో రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాలనే దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో వినవస్తోంది. కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రధాన డ్రెయిన్లు కొల్లేరులో కలుస్తాయి. సరస్సు 12వ కాంటూరు వరకు విస్తరించి ఉన్న సమయంలో సుమారు 45 టీఎంసీల సామర్థంతో నిండుకుండను తలపించేది. ఆక్వా సాగు అభివృద్ధితో 5వ కాంటూరుకు కుచించుకుపోయింది. దీంతో సహజత్వం నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది. తీరప్రాంతం పొడవున ఉన్న మండలాలను ఉప్పుటేరు గత కొన్ని సంవత్సరాలుగా కబళిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రారంభమయ్యే ఉప్పుటేరు 65 కిలోమీటర్ల మేర ప్రవహించి కృష్ణా జిల్లా పడతడిక వద్ద సముద్రంలో కలుస్తుంది.

- Advertisement -

గత పది సంవత్సరాలుగా సాగునీరు పూర్తిస్థాయిలో రాకపోవడంతో సముద్ర తీర ప్రాంతాల్లోనే కాకుండా వారికి అనుసంధానంగా ఉన్న మండలాలను ఉప్పు నీరు ముంచేస్తోంది. ప్రధానంగా ఏలూరుజిల్లా లోని కైకలూరు,ఉంగుటూరు నియోజకవర్గాలు, కృష్ణాజిల్లాలోని పెడన నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల లోని మండలాల్లో ఉప్పు నీటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ముంపు నీటిని ఒడిసిపట్టేందుకు ఉపయోగపడే వాటి నిర్మాణం చేయాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. ఈ విషయమై ప్రభుత్వాలు కూడా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాయి.

అవి చివరకు ప్రచార ఆర్భాటాలుగానే మిగులుతున్నాయి. సాధ్యాసాధ్యాలపై ఏర్పాటు చేసిన కమిటీలు ఇచ్చే నివేదికలు ఎప్పటికప్పుడు బుట్టదాఖలవుతున్నాయి. ఇతర మురుగు డ్రెయిన్ల నీరు, కైకలూరు, కలిదిండి తదితర ప్రాంతాల్లోని మురుగు పడతడిక, మోళ్లపర్రు వద్ద ఉన్న ఉప్పుటేరుల ద్వారా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. జులై నుంచి జనవరి వరకు వాటి ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహంతో సముద్రం నుంచి ఉప్పునీరు కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతానికి ఎగదన్నకుండా నివారిస్తుంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గేసరికి సముద్రపోటుతో ఉప్పునీరు ఉప్పుటేరుల నుంచి డెల్టా ప్రాంతానికి ఎగదన్ని చౌడు భూములు మారుతున్నాయి.

ప్రస్తుతం మురుగు కాలువలు, ఉప్పుటేరు నీటిని చెరువులకు తోడి వాటిలో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నారు. దాళ్వా సాగుకు సైతం ఆ నీరే దిక్కు. కొన్ని దశాబ్దాల నుంచి రెగ్యులేటర్‌ నిర్మాణ ప్రక్రియ ప్రతిపాదన దశలో నలుగుతోంది. ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా కైకలూరు నియోజకవర్గం లో పాదయాత్ర సందర్భంగా శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులేటర్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అనుగుణంగా రెగ్యులేటర్ల నిర్మాణం సంబంధించిన ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేశారు.సముద్ర ముఖద్వారానికి రెగ్యులేటర్లు, అండర్‌ టర్నల్‌ నిర్మాణానికి రూ. 345.75 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు డిజైన్‌ రూపొందించారు. కొల్లేరులో దుంపగడప వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణానికి రూ. 56 కోట్లు, ఉప్పుటేరు పై పశ్చిమ గోదావరి జిల్లా సముద్రం ముఖద్వారం వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణానికి రూ. 135 కోట్లు-, కృష్ణా జిల్లా ముఖ భాగాన రెగ్యులేటర్‌ నిర్మాణం కోసం రూ. 129.75 కోట్లు గరిశపూడి వద్ద అండర్‌ టర్నల్‌ నిర్మాణానికి రూ. 25 కోట్లు అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదన ఆధారంగా నిపుణుల కమిటీ పరిశీలన పరిశీలన చేసింది. రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఆ ప్రతిపాదనలు నేటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌ లో ఉంది. రెగ్యులేటర్ల నిర్మాణం చేపడితే భవిష్యత్తులో కొల్లేరు ప్రాంతంలో సాగునీటి ఎద్దడి నుంచి గట్టెక్కేందుకు అవకాశం ఉంటుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement