Friday, May 17, 2024

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అమరావతి.. అన్నిరకాల రిక్రియేషన్‌ సెంటర్ల ఏర్పాటు..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: అమరావతి రాజధానిని అన్ని హంగులతో అభివృద్ధి చేయడంతోపాటు దేశంలో మరెక్కడా లేని విధంగా అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధిచేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు అవసరమైన ప్రతిపాదనలు వేగంగా సిద్ధంచేస్తోంది. ఇప్పటికే ప్రణాళికలను కూడా రూపొందించింది. రానున్న రోజుల్లో అమరావతి ప్రాంతాన్ని రాజధానితోపాటు పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేలా అవసరమైన చర్యలను చేపట్ట బోతోంది. అందులో భాగంగానే వివిధ రకాల రిక్రియేషన్‌ సెంటర్లు (వినోద కేంద్రాలు) ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు వాటర్‌ ఫాంట్స్‌ ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తోంది. పర్యాటకులను మరింత ఆకర్షించేలా కృష్ణా నదికి ఇరువైపులా మరిన్ని పర్యాటక హంగులను కల్పించేదిశగా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృష్ణానదికి ఉన్న ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించనున్నారు. ఒక్కో బ్యారేజీ 2 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండేలా వీటి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అమరావతిని తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వస్తోంది. అందులో భాగంగా విజయవాడ-గుంటూరు-తెనాలి నగరాలను కలుపుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ రోడ్‌ను ఏర్పాటుచేసే ఆలోన కూడా చేస్తోంది. దీనితోపాటు ప్రస్తుతం ఉన్న రహదారులను అనుసంధానంచేసే ప్రక్రియను కూడా వేగవంతంగా చేపట్టబోతోంది. అందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలు తదితర అంశాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. వీలైనంత త్వరలోనే దశలవారీగా అమరాతి పర్యాటక అభివృద్ధికి సంబంధించిన పనులను ప్రారంభించేందుకు కూడా జగన్‌ సర్కార్‌ కసరత్తు ప్రారంభించింది.

పీపీపీ పద్దతిలో నిర్మాణాలు..

అమరావతి ప్రాంతంలో చేపట్టబోయే పలు నిర్మాణాలను పీపీపీ పద్దతిలో నిర్మించేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపడితే ప్రభుత్వంపై భారం ఉండదని, అదే సమయంలో అమరావతి నగరం త్వరితగతిన ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో అమరావతి నగర పరిధితోపాటు విజయవాడ-గుంటూరు నగరాలను కలిపే ప్రధాన రహదారులకు ఇరువైపులా కూడా ఆదిశగానే పీపీపీ విధానంలో మరిన్ని వాణిజ్య సముదాయాలను ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న సంస్ధలపై ప్రభుత్వం దృష్టిసారించి, వారిని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనుంది. ఇప్పటికే కొన్ని సంస్ధలతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని కంపెనీలతో చర్చలు జరిపి వాటిని నిజరూపంలోకి తీసుకురానున్నట్లు సమాచారం.

కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు..

కృష్ణా నదిపై ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ కాకుండా మరో రెండు బ్యారేజీల నిర్మాణం చేపట్టనున్నారు. ఒకటి వైకుంఠపురం వద్ద కాగా రెండోది కృష్ణా జిల్లా తోట్లవల్లూరు ప్రాంతంలో నిర్మించాలని యోచన చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పును గౌరవించినట్లవుతుందని అంటున్నారు. అదే సమయంలో ఒక్కో బ్యారేజీ వద్ద 2 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఫలితంగా వృథా జలాలను కూడా సద్వినియోగం చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నీటి నిల్వ ద్వారా ఆయా ప్రాంత అవసరాలను తీర్చుకోవడంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. అమరావతి పూర్తిస్థాయిలో అభివృద్ధి జరిగితే అప్పటి అవసరాలను కూడా దృష్టిలోఉంచుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇది ఉపయోగపడనుందని అంటున్నారు.

- Advertisement -

వేదాద్రి నుండి ఐలూరు వరకూ వాటర్‌ ఫాంట్స్‌..

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నుండి ఐలూరులోని శివాలయం వరకూ వివిధ రకాల వాటర్‌ ఫాంట్స్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తుననారు. అంతేకాకుండా వాకింగ్‌ ట్రాక్స్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో కృష్ణా నదికి ఇరువైపులా సుందరంగా ఆకుపచ్చని చెట్లు ఉండేలా ఏర్పాటుచేయనున్నారు. ఒకరకంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ తరహాలో దీనిని అభివృద్ధి చేయాలన్న నమూనాను అనుసరించే యోచన చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఆహ్లాదకర వాతావరణంలో సేద తీరేలా కార్యాచరణ చేపట్టనున్నారు. దేశంలో మరేప్రాంతంలో లేని విధంగా అమరాతి ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.

పలు చోట్లకు వాటర్‌ ప్లేన్‌లు..

కృష్ణా నదిని ప్రధాన వనరుగా చేసుకుని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలకు వాటర్‌ ప్లేన్‌లను నడిపేందుకు కూడా పర్యాటక శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వాటర్‌ ప్లేన్‌లను నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చింది. మరీ ముఖ్యంగా రాజమండ్రి, విశాఖ, తిరుపతి, భద్రాచలం, కాలేశ్వరం నుండి వాటర్‌ ప్లేన్‌ల నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దీనిద్వారా ప్రయాణికులను ఆకట్టుకోవడంతోపాటు త్వరగా గమ్యస్థానాలు చేరేందుకు అవకాశం ఏర్పడనుంది. నదీ విహారం చేయడం ద్వారా పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా ఈ ప్రణాళికలు రూపొందుతున్నాయి. వాటర్‌ ప్లేన్‌ల నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్ధలు, వాటి పనితీరును పర్యాటక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.

టెంపుల్‌ టూరిజం అభివృద్ధి..

కేవలం పర్యాటకంగానే అభివృద్ధి చేయడమే కాకుండా ఆధ్యాత్మిక నగరంగా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నమూనా దేవాలయ నిర్మాణం ఇక్కడ ప్రారంభమైంది. దీనికితోడు ఒక పక్క శైవక్షేత్రం, మరోపక్క వైకుంఠపురం, ఇంకోపక్క విజయగిరి, సమీపంలోని బెజవాడలో కన కదుర్గమ్మ ఆలయం, గుంటూరు జిల్లాలోని మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి, పొన్నూరు ఆంజనేయ స్వామి, కోటప్పకొండ తదితర ప్రాంతాలను కలుపుతూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇదే క్రమంలో అమరావతి నగరంలో మరో రెండుమూడు ప్రసిద్ధ దేవాలయాలకు సంబంధించిన నమూనా దేవాలయాను కూడా అభివృద్ధిచేస్తే ఎలా ఉంటుందన్నదానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ రకంగా ఆధ్యాత్మిక నగరంగా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సకంల్పించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement