Sunday, April 28, 2024

Amaravathi – జ‌గ‌న్ ఆశ‌ల‌పై సుప్రీం నీళ్లు – రాజ‌ధాని కేసు విచార‌ణ డిసెంబ‌ర్ కు వాయిదా

ఏపీ రాజధాని అమరావతి కేసు విచారణలో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్‌కు వాయిదా వేసింది. పూర్తిస్థాయి విచారణ డిసెంబర్లో చేపడతామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం వెల్లడించింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున మాజీ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ ధర్మాసనాన్ని కోరారు. అయితే, నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని, డిసెంబర్‌లోపు అత్యవసరంగా కేసు విచారణ సాధ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది.

మరోవైపు సుప్రీం కోర్టు రిజిస్టరీ తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్ల‌లేద‌ని , ఈ నేపథ్యంలో కేసును విచారించడం సబబు కాదని సుప్రీం కోర్టు తెలిపింది. అయితే, ఇద్దరు ప్రతివాదులు మరణించినట్లుగా తమ వద్ద నివేదిక ఉందని, వారు మినహా మిగతా వాళ్లందరికీ నోటీసులు ఇచ్చామని ఏపీ తరఫు న్యాయవాది అత్యున్నత ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా వారిద్దర్నీ ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని సుప్రీం కోర్టుకు దరఖాస్తు పెట్టుకున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనికి సమ్మతించిన ధర్మాసనం వాటి వివరాలను ప్రత్యేకంగా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని ఆదేశించింది. కాగా, ఏపీ రాజధాని కేసును డిసెంబర్ కు వాయిదా వేయ‌డంతో అమరావతి రైతులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే సెప్టెంబ‌ర్ నుంచి విశాఖ నుంచి ప‌రిపాల‌న కొన‌సాగించాల‌ని భావించిన ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆశ‌ల‌పై ఈ వాయిదాతో నీళ్లు చ‌ల్లిన‌ట్టు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement