Friday, May 17, 2024

ED Chief Case – కేంద్రానికి సుప్రీం కోర్టు షాక్ …ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్ ప‌ద‌వీకాలం పొడిగింపుకు నో..

న్యూఢిల్లీ – ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చీఫ్‌ సంజయ్‌ మిశ్రా పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఆయన పదవీకాలం పొడిగింపు కుదరదని వెల్లడించింది. జులై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆలోపు ఈడీకి కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రానికి సూచించింది. కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధిపతిగా నవంబర్‌ 2018లో సంజయ్‌ కుమార్‌ మిశ్రా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత (60 ఏళ్ల వయసు వచ్చిన) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. మే నెలలో ఆయనకు 60ఏళ్లు పూర్తయ్యాయి. కానీ, నవంబర్‌ 2020లో ఆయన పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

అనంతరం 2022లోనూ మూడోసారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత జయా ఠాకూర్‌తోపాటు పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు సంజయ్‌ మిశ్రా పొడిగింపు కుదరదని , 2021 నవంబర్‌లో ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడమేనని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విక్రం నాథ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఇది ఇలా ఉంటే .. తక్షణమే ఈడీ చీఫ్‌ను మార్చాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేయ‌డంతో . కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు జులై 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగవచ్చని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement