Friday, May 3, 2024

వస్త్ర రంగానికి అదనపు పన్నుపోటు.. జీఎస్టీ 5 నుంచి 12శాతానికి పెంపు

అమరావతి, అంధ్రప్రభ : డిసెంబరు నెల వచ్చిందంటే వస్త్ర వ్యాపారులకు పండుగే. ఈ నెలలో క్రిస్మస్‌ మొదలుకుని జనవరిలో సంక్రాంతి, శివరాత్రి నుంచి ఉగాది వరకు వ్యాపర పండగ సందడి నడుస్తుంది. ఈ నాలుగు నెలల్లో మంచి వ్యాపారం ఉంటు-ందని ఆనందపడుతున్న వ్యాపారులపై తాజాగా జీఎస్టీ పిడుగు పడింది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీని పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయంతో వ్యాపారులు షాక్‌ తిన్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో జరిగినప్పటికీ.. ఇప్పట్లో అమలు కాదులే అన్న భావనలో వ్యాపారులు ఉన్నారు.

అయితే 2022 జనవరి నుంచి కొత్త జీఎస్టీ అమలులోకి వస్తుందని ప్రకటించడంతో వారిలో ఆందోళన ఆరంభమైంది. ప్రస్తుతం వస్త్ర వ్యాపారంపై విధిస్తున్న ఐదు శాతం జీఎస్టీలో 2.50శాతం రాష్ట్రాన్రికి, మరో 2.50శాతం కేంద్రానికి వెళ్తోంది. నూతనంగా దీన్ని 12 శాతానికి పెంచడంతో వ్యాపారుల్లో ఉన్న ఆనందం ఆవిరైపోయింది. రాష్ట్రంలో మొత్తం 50 వేల మంది వస్త్ర వ్యాపారులు ఉన్నారు. హోల్సేల్‌ మార్కెటు-్క కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న విజయవాడ,గుంటూరు, చీరాల, కావలి, ప్రొద్దుటూరు లాంటి నగరాలలో 50శాతానికి పైగా వస్త్ర వ్యాపారులు ఉన్నారు. వస్త్ర రంగంపై ఆధారపడి రాష్ట్రంలో 30 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా ముంబై, సూరత్‌, బెనారస్‌, అహ్మదాబాద్‌, కోల్కాతా నగరాల నుంచి వస్త్ర లను దిగుమతి చేసుకుంటారు. ఈ వ్యాపారంలో పోటీ- పెరగడంతో డిస్కౌంట్లు- పెరిగాయి.

తగ్గిపోతున్న పరిశ్రమలు..
వస్త్ర తయారీ పరిశ్రమలకు కేరాఫ్‌ ఉత్తర భారతదేశం. ఎక్కువగా సూరత్‌, అహ్మదాబాద్‌, బెనారస్‌, కోల్‌కతా, ముంబై ప్రాంతాల్లో ఈ పరిశ్రమలు ఉన్నాయి. జీఎస్టీ అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వేల సంఖ్యలో ఈ పరిశ్రమలు మూతపడ్డాయి. ఒక్క సూరత్లోనే 60 వేల వస్త్ర తయారీ పరిశ్రమలు ఉంటే, వాటిలో 40 శాతం పరిశ్రమలకు తాళాలు వేసేశారని వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న పరిశ్రమలు కొన్ని మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా జీఎస్టీ మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి నుంచే ధరలు పెరిగిపోయాయి. కొన్ని పరిశ్రమలు మీటరుపై రెండు నుంచి నాలుగు రూపాయలు పెంచగా, మరికొన్ని పరిశ్రమలు ఐదు రూపాయల వరకు పెంచాయి. పెంచిన జీఎస్టీ అమలులోకి రాక ముందే పరిస్థితి ఈవిధంగా ఉంటే, అమలులోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటు-ందోనన్న ఆందోళన వ్యాపారుల్లో కనిపిస్తోంది.

జీఎస్టీ పెంపుదల వస్త్ర వ్యాపారానికి దెబ్బ..
కరోనా తర్వాత వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయని, ఇప్పుడిప్పుడే కోలుకుంటు-న్న వస్త్ర వ్యాపాసరానికి జీఎస్టీ పెంపుదల శరాఘాతం లాంటిదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతోకొంత వ్యాపారం జరుగుతుంది. ఈ సమయంలో జీఎస్టీని పెంచడం దారుణమన్నారు. ఇప్పటికే ముడిసరుకుల ధరలు పెరిగిపోయాయన్నారు. అసలు వస్త్రాలపై పన్ను లేనే లేదని, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక శాతం పన్ను విధించారని అనంతరం దానిని తొలగించారన్నారు. జీఎస్టీకి ముందు వ్యాట్‌ విధించారని, సుదీర్ఘకాలం ఆందోళన చేయడంతో రద్దు చేశారని వ్యాపారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏకంగా ఒకేసారి ఏడు శాతం జీఎస్టీని పెంచారని, ఇలాగైతే వ్యాపారాలను నడపలేమని వస్త్ర వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement