Monday, June 17, 2024

Cast War – వైసీపీ..టీడీపీలలో కుల జగడం .. ఆదివాసీలు గ‌రం గ‌రం

(ప్రభన్యూస్, ఏలూరు బ్యూరో ) – రాజకీయ రిజర్వుడు సీట్లల్లో ఏక పక్షంగా టిక్కెట్ల కేటాయింపులపై గిరిజనుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము పుట్టి పెరిగిన నేలలో తమకు దక్కాల్సిన రాజకీయ హక్కును గిరిజనేతరులకు ఎలా ధారాదత్తం చేస్తారని ఆదివాసీలు గళం విప్పుతున్నారు. కాదూ కూడదంటే న్యాయపోరాటానికి సిద్ధమంటున్నారు. రిజర్వుడు నియోజకవర్గం పోలవరంలో తాజాగా ఎస్టీ, నాన్ ఎస్టీ కేటగిరి తెరమీదకు వచ్చింది. అటు అధికార పార్టీలోనూ.. ఇటు ప్రతిపక్ష టీడీపీలోనూ కలవరం సృష్టించిస్తోంది. పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ ఖరారు చేసిన అభ్యర్థి పై కుల వివాదం తెరపైకి వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు టిక్కెట్టు లేదని చెప్పిన అధిష్టానం, బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది. ఒకరకంగా టిక్కెట్ ఇచ్చినట్టే. ఆమె గిరిజన మహిళ కాదని శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన కుక్కల సుబ్బారావు కుమార్తె అని, ఆమెకు ఎస్టీ రిజర్వుడు నియోజవర్గంలో టిక్కెట్ కేటాయించటం తగదని గిరిజన నాయకుడు ఈ కుల వివాదాన్ని తెరపై తెచ్చారు. ఒకవేళ అధిష్టానం కాదని టిక్కెట్ ఇచ్చి పోటీకి దించితే తాము న్యాయ పోరాటం చేస్తామంటూ ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ స్థితిలో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ టికెట్ కేటాయింపు వివాదాస్పదంగా మారింది.

ఎస్టీ రిజర్వడు నియోజకవర్గంలో జన్మతః గిరిజన కుటుంబానికి చెందని బీసీ మహిళకు ఏ హక్కుతో టికెట్ ఇస్తారని మండిపడుతున్నారు. బీసీ మహిళను ఎస్టీ గా చూపించి మోసం చేయబోతున్నారని , ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సహించేది లేదని గిరిజన నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక టీడీపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న బొరగం శ్రీనివాసరావు కూడా ఎస్టీ కాదని ఆరోపిస్తున్నారు. కాగా జిల్లాలో వైసీపీ నిర్ధారిస్తూ ప్రకటించిన ఒకే ఒక్క సీటు కులవివాదంలో చిక్కుకుంది . ఏలూరు జిల్లాలో రిజర్వుడు నియోజవర్గాలు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు లేదని, ప్రత్యామ్నాయాలపై అధికార పార్టీ దృష్టి పెట్టింది . పోలవరం నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సతీమణికే టిక్కెట్ కేటాయించటంతో పోలవరం నియోజకవర్గంలో మళ్ళీ చక్రం తిప్పవచ్చొనే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలోచనలకు గండి పడనట్టే. బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి అభ్యర్థిత్వాన్ని గిరిజన వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బోగస్ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందటం ఒక ఎత్తు కాగా,.. రాజకీయాల్లోనూ అధికారాన్ని దోచుకొంటున్నార‌ని ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షులు మడకం వెంకటేశ్వరరావు మండిపడుతున్నారు. ఒకవేళ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ స్క్రూట్నీలో ఆమె అభ్యర్థిత్వం రద్దు అవుతుందని గట్టిగా వాదిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement