Wednesday, May 1, 2024

Andhra Pradesh – పండుగే.. ఓట్ల పండుగ! …ఊరూరా జన జాతర


ఆంధ్రప్రభ స్మార్ట్ , విజయవాడ ప్రతినిధి : ఏపీలో అనధికార ఎన్నికల పండుగ ముగిసి.. కొత్త జాతర ప్రారంభమైంది. నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక నామినేషన్ల ఉప సంహరణ, లేదా డమ్మీ అవతారాలకు కబుర్లు, మంతనాలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ ఏజెంట్ల నుంచి.. కౌంటింగ్ ఏజెంట్ల వరకూ.. వాహనాల పాస్లు కోసం డమ్మీలే డిమాండు పెరిగింది. ఎలాగూ ఓటుకు నోటు పంచాల్సిందే. ఇక అదనపు ఖర్చులే పెరుగుతాయి. ఒక్కొక్క అభ్యర్థి గల్ల పెట్టె గుల్ల గుల్ల అవుతోంది. గడచిన నెలరోజులూ ఊరూర తిరుగుతూ.. ఇంటింటికీ, గడప ఎదుట జనాన్ని మొక్కటానికే రోజు లక్ష ఖర్చు తప్పలేదు. ఇక వాహనాలకు ఆయిల్, జెండా వీరులకు క్వార్టర్, బిర్యానీ ఖర్చులు యథాతథం. నామినేషన్ రోజు కనీసం ఐదువేలు… భారీగా 10 వేల మందితో ర్యాలీ జరిపారు. ఇక్కడ అధికారపార్టీ, కూటమి అభ్యర్థి ఒకరి కొకరు పోటాపోటీగా జప సమీకరణ చేస్తే.. నాడిక్కడ.. నేడిక్కడ ..రేపు ఎక్కడో? అర్థం కాని రీతిలో జనం కదిలారు. రెండు వందల బ్యాచ్గా అవతరించారు. ఇక బైకులకు ఆయిల్ ఖర్చు మామూలే. ఇదే తరుణంలో విపరీతంగా టోకెన్లు రావటంతో పెట్రోలు బంకుల్లో ఆయిల్ లేదూ.. అని బోర్డులు వెలిశాయి. ఇక గొడవ మామూలే.

కీలక నేతలపై 236 మంది సై.. సై ..

- Advertisement -

ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు 965 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 5,460 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం స్ర్కూటినీతో ఎంతమందికి అర్హత ఉందో తేలుతుంది. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతుంది. ఇక కీలక నేతలపై మేము సైతం అంటూ నామినేషన్లకు బారులు తీరారు. సీఎం జగన్ సహా ఏడుగురు అగ్రనేతలపై 236 మంది పోటీకి నామినేషన్లు వేశారు.వీరిలో ఎంత మంది కొనసాగుతారో మరో మూడు రోజుల తరువాత తేలుతుంది. ఏ నియోజకవర్గంలో బ్యాలెట్ సైజు ఎంత ఉంటుందో తెలుస్తుంది.. పులివెందులలో 37 మంది సీఎం జగన్పై పోటీకి సై అన్నారు. ఇక కుప్పంలో చంద్రబాబుపై 32 మంది, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 19 మంది , మంగళగిరిలో నారా లోకేష్ పై అత్యధికంగా 65 మంది, నందమూరి బాలకృష్ణ పోటీ చేసే హిందూపురంలో 19 మంది , రాజమండ్రి ఎంపీ స్థానంలో బీజేపీ చీఫ్ పురేందేశ్వరిపై 22, వైఎస్ ఆర్ తనయ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై 42 మంది పోటీలోకి దిగారు.

ఇక అసలు జాతర ఆరంభం
మే 11వ తేదీ వరకూ ఏపీలో ఎన్నికల జాతరే జాతర. గెలుపే ప్రధానం. గెలవలేదో.. రాజకీయ భవిష్యత్తుకు గండి తప్పదు. అందుకే ఆరు నూరైనా… నూరు ఆరైనా.. గెలవటమే లక్ష్యంగా అభ్యర్థులు తమ ప్రణాళికలను రచించారు. ఒకవైపు సోషల్ మీడియా హంగు ఆర్భాటం.. మరో వైపు మైకుల గోల.. అన్నిటి కంటే అభ్యర్థి వెంట జనం జనం. ఇప్పటికే పల్లెల్లో పార్టీల వారీగా కుటుంబాలు విడిపోయాయి. ఆ కుటుంబాలను విధిగా ఆదుకోవాలి. ఎండా కాలం . కూలి పనులు ఎలాగూ లేవు. అందుకే ఈ సారి ఎన్నికల కూలీ కూడా తగ్గింది. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ.. సాయంత్రం ఆరు గంటల నుంచి 10 గంటల వరకూ ఇంటింటికీ ఎన్నికల ప్రచారం జరగాల్సిందే. మధ్యాహ్నం భోజనం.. సాయంత్రం మందుబాబులకు క్వార్టర్ మందు ఇవ్వాల్పిందే.

ఇక్కడే ట్విస్ట్ …

మద్యం విక్రయాలకు పోలీసుల శాఖ రంగంలోకి దిగింది. ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు అసలు పని అప్పగించింది. వైన్ షాప్ ల్లో కేవలం ఒక క్వార్టర్ మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకుంది. కానీ అన్ని పార్టీల అభ్యర్థుల వెంట తిరిగే వందలాది మందికి మద్యం సరఫరా ఎలా జరగుతోందో? ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కార్యకర్తల ఇళ్లల్లో మద్యం నిల్వలు ఎక్కడివో సమాచారం తెలియని స్థితి. కొన్ని గ్రామాల్లో రీఫిల్లింగ్ జరుగుతోంది. ఇదెలా సాధ్యమో ? సోషల్ మీడియాలో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.

సొంతగా బ్రాందీ తయారీ ..

దయ చేసి ఎన్నికల్లో ఇచ్చే మద్యం తాగొద్దు.. నాయకులు తమ స్వలాభం కోసం ఇలా సొంతగా మద్యం తయారీ చేస్తున్నారు… ఈ మద్యంతో ఎన్నో ఆరోగ్య నష్టాలు ఉంటాయి. మద్యం తాగొద్దూ మీ ఆరోగ్యానికి కాపాడుకోండి, మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి. వాళ్ళ అవసరాల కోసం తప్పుదారి, తప్పుడు ఆలోచనలు పట్టించటానికే ఇలాంటి మద్యాన్ని సరఫరా చేస్తున్నారు బహుపరాక్ అని సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement