Saturday, April 27, 2024

ఐఏఎస్‌ల కేటాయింపులో పెంపు ఎప్పుడో.. కీలక శాఖలకు అధికారుల కొరత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల మేరకు ఐపీఎస్‌ క్యాడర్‌ పెంపునకు కేంద్రం తీవ్ర జాప్యం చేస్తూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పెరిగిన జిల్లాలు, అవసరాలకు అనుగనుణంగా తమకు దనంగా క్యాడర్‌స్ట్రెంగ్త్‌ పెంచాలని సీఎం కేసీఆర్‌ పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడిని కోరారు. నేరుగా కలిసి మరీ వినతి పత్రాలు అందించారు. రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలు, కొత్త పథకాల నేపథ్యంలో వీటన్నింటి నిర్వహణకు, పర్యవేక్షణకు అదనపు అధికారుల అవసరం ఎంతగానో నెలకొంది. అయితే సుధీర్ఘకాలంగా కేంద్రం క్యాడర్‌ను పెంచకుండా తాత్సారం చేస్తోండగా, తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారిగా ఉన్న శశాంక్‌ గోయల్‌ను డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు తీసుకొంది. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత అవసరమైన క్యాడర్‌ పోస్టులను కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్రం ప్రతీ ఐదేళ్లకోసారి క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ రివ్యూను జరపడం ఆనవాయితీగా వస్తోంది.

రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అససరం ఏర్పడింది. జిల్లాకు ఒక ఎస్పీతోపాటు, అదనపు ఎస్పీ, డీసీపిలు, డీఎస్పీల అవసరం ఏర్పడింది. జిల్లాలకు కలెక్టర్లు, ఒక్కో జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లతో పోస్టులు కూడా పెరిగాయి. దీంతో రాష్ట్రంలో నిర్ధేశిత క్యాడర్‌తో సిబ్బంది లేమి ఏర్పడింది. దీంతో మరోసారి కేంద్రం పున: సమీక్ష జరిపి క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ను పెంచాలని రాష్ఠ్రం కోరుతూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక డిజి పోస్టును కోరగా, అదనపు డీజి 4 పోస్టులకు కూడా కోరింది. మరో 6 ఐజీ పోస్టులు 6 డీఐజీ పోస్టులు, 30 ఎస్పీ పోస్టులను కోరింది. తెలంగాణ కోరిన ప్రతిపాదనలను కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలకు పంపిన కేంద్రం సమీక్షను నిర్వహించాల్సి ఉంది. ఆ తర్వాత డీఓపిటీ ఉత్తర్వులు జారీ చేస్తేనే మార్గం సుగమం కానుంది.

ఇంకా ఐఎఎస్‌ల కొరతే…

రాష్ట్రానికి 208 పోస్టుల మంజూరుకాగా, ఇప్పటివరకు 151 మందినే కేంద్రం కేటాయించింది. ఇంకా 57 మంది అధికారుల కొరత ఉంది. కొత్తగా 23 జిల్లాలు ఏర్పడగా ఈ ఏడాది మరో ఆరుగురు ఐఏఎస్‌లు పదవీ విరమణ చేయనున్నారు. 2014 రాష్ట్ర ఆవిర్భావం సమయంలో 163 పోస్టులు తెలంగాణకు ఉండగా, 2016లో 208కి పెంచారు. అయితే తీవ్ర కొరత నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ అదనపు కలెక్టర్లుగా ఐఏఎస్‌యేతర అధికారులను నియమించారు. నిబంధనల మేరకైతే ఐఏఎస్‌లే అదనపు కలెక్టర్లుగా ప్రతీ జిల్లాలో నియమించి అదనపు జిల్లా మెజిస్ట్రేట్‌ హోదాలో బాధ్యతలు నిర్వహించాలి. కానీ అధికారుల కొరతతో నాన్‌ ఐఏఎస్‌లను నియమించి నెట్టుకొస్తున్నారు.

ఇంచార్జీలు, రాబడి శాఖలే కీలకం…

- Advertisement -

ఇప్పటికే కీలక శాఖలకు పోస్టింగ్‌లపై దాదాపు కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం ఇన్‌చార్జీలున్న శాఖలను, రాబడి శాఖలను ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. రాష్ట్రంలోని అనేక కీలక శాఖల్లో ఇంచార్జీలే బాస్‌లుగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ప్రధాన రాబడి శాఖలు ఇన్‌చార్జీల పాలనలోనే ఉన్నాయి. ఒక్కో శాఖలో రెగ్యులర్‌ బాధ్యతలకు తోడు ఇన్‌చార్జీ బాధ్యతలతో అధికారులకు భారం పెరుగుతుండగా, పథకాల అమలు, పర్యవేక్షణ, సత్వర నిర్ణయాల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. అనేక కీలక నిర్ణయాల్లో వెనువెంటనే పాలనాపరమైన నిర్ణయాలు రాకపోవడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement