Tuesday, May 7, 2024

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా ఉంటాం.. బంగారు తెలంగాణ సాధనలో కలిసి నడుస్తాం: అక్భరుద్దీన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఐటీ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇందుకు మంత్రి కేటీ.. రామారావుకు కృతజ్ఞతులు చెబుతున్నారని శాసనసభలో ప్రతిపక్ష ఎంఐఎం నేత అక్భరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. పాతబస్తీలోనూ ఐటీ టవర్‌ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర సీఎం కేసీఆర్‌ పేదలు, యువత, మహిళలు, పారిశ్రామికవేత్తలు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారని, అదేబాటలో ఎంఐఎం కూడా పయనిస్తోందని, సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడుతుందని చెప్పారు. హిందూ-ముస్లింల మధ్య సఖ్యతను కొనసాగిస్తూ సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తున్న వారిని ఎదుర్కోవటంలో సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటూ బంగారు తెలంగాణ సాధనలో తోడుంటామని ప్రకటించారు. పద్దులపై చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో ఆయన ప్రసంగించారు. పాతబస్తీలో అన్ని రోడ్లను వెడల్పు చేశారని, ఒక్క ఒవైసీ ఆసుపత్రి రోడ్‌ వైడనింగ్‌ మిగిలి ఉందని ఆ పని కూడా చేయాలని కోరారు. మూసీ నదీని కూడా ప్రక్షాళన చేసి, పాతబస్తీలోని చెరువులను కాపాడాలని విన్నవించారు.

పాతబస్తీ ప్రాంతంలోనూ క్రీడా నగరాన్ని నిర్మించాలన్నారు. న్యాక్‌ భవనాన్ని పాతబస్తీలో ఏర్పాటు చేస్తే అక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చాలా స్థలం ఖాళీగా ఉందని, అక్కడ ఆసుపత్రి టవర్స్‌ నిర్మించాలని విన్నవించారు. ఫ్రూట్‌ మార్కెట్‌ లేక వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారికి శాశ్వతంగా ఫ్రూట్‌ మార్కెట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ముస్లిం ఖబరస్తాన్‌కు వెళ్లే దారలన్నీ మూసేశారని, వాటిని వెంటనే తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, సభ్యుడిగా మైనారిటీ వర్గానికి చెందిన ప్రొఫెసర్‌ను ఇప్పటి వరకు నియమించలేదన్నారు. ఉర్దూను రెండో భాషగా స్వీకరించే విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధులు కేటాయించాలని, చాలా యూనివర్సిటీలకు వీసీలు లేరని, సదుపాయాలు కొరవడ్డాయని, అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తన వద్దకు వచ్చి వాపోతున్నారని చెప్పారు. టిమ్స్‌ లో తాత్కిలికంగా నియమించిన ఉద్యోగులను తొలగించొద్దన్నారు. పాతబస్తీలో మెట్రో రైలు కోసం నిధులు కేటాయించినందుకు ప్రభుత్వాని కి కృతజ్ఞతలు తెలిపారు.

మన ఊరు- మన బడి కార్యక్రమం చాలా బాగుందన్నారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలను ఈ పథకం కింద మొదటగా చేపట్టాలన్నారు. కొవిడ్‌ కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో వేశారని, అయితే ప్రయివేటు పాఠశాలలు టీసీలు ఇవ్వకుండా వేధిస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు టీసీ అవసరం లేకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న అంశమన్నారు. విద్యాశాఖలోని పదోన్నతులను పూర్తి చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని, తగినంత మంది ఎంఈవోలను నియమించాలన్నారు.


నిమ్స్‌ తరహాలో టిమ్స్‌, ఉస్మానియా అభివృద్ధి: మంత్రి హరీష్‌రావు
నిమ్స్‌ తరమాలో టిమ్స్‌, ఉస్మానియా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. అక్భరుద్దీన్‌ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పారు. కరోనా కాలంలో టిమ్స్‌ లో తాత్కాలిక, కాంట్రాక్టు పద్దతిన నియామకాలు చేపట్టామని, అయితే వారికి వెయిటేజీ ఇచ్చి పరిమనెంట్‌ ఉద్యోగులుగా నియమిస్తున్నామని చెప్పారు. టిమ్స్‌ లోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement