Wednesday, July 24, 2024

TS: బ్లాక్ మార్కెట్లో మిర్చి విత్తనాలు… కేజీ రూ.75వేల నుండి రూ.లక్ష పలుకుతున్న ధర…

వాజేడు, మే 28 ప్రభ న్యూస్ : వాణిజ్య పంటలో ఒక‌టైన మిర్చి వ్యవసాయం ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట, కన్నయిగూడెం, తదితర మండలాల్లోని రైతులు అత్యధికంగా చేస్తూ ఉంటారు. వాజేడు మండలంలో 2వేల‌ ఎకరాలకు పైగా మిర్చి సాగు చేస్తారు. రైతులకు అందుబాటులో ఉంచాల్సిన మిర్చి విత్తనాలను ఇక్కడి మిర్చి విత్తనాల డిస్ట్రిబ్యూటర్లు డీలర్లకు విత్తనాలు ఇవ్వకుండా బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో విత్తనాలను విక్రయిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ ఒకవైపు నకిలీ విత్తనాలపై నజరు పెట్టి ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఒకవైపు తనిఖీలు కొనసాగుతుండగానే మరోవైపు ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ మిర్చి విత్తనాలను బ్లాక్ చేసి అధిక రేట్లకు విక్రయిస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఒక కేజీ 60 వేలకు అమ్మవలసిన మిర్చి విత్తనాలు 75 వేల నుండి లక్ష రూపాయల ధరకు రైతులకు అంటగడుతున్నారని ఆరోపణలు వ్యక్తమ‌వుతున్నాయి. మిర్చి విత్తనాలు బ్లాక్ చేయడంతో స్థానిక డీలర్ల దగ్గర మంచి విత్తనాలు లేకపోవడం, రైతులకు మంచి విత్తనాలు దొరకవనే భయంతో బ్లాక్ మార్కెట్లో మిర్చి విత్తనాలను కొనుగోలు చేస్తూ అధిక భారం మోస్తున్నారు. ఇంత జరుగుతున్నా… సంబంధిత శాఖ అధికారులు అటువైపు వెళ్లి చూడకపోవడంతో ఈ ప్రాంతంలోని డిస్ట్రిబ్యూటర్లు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. డిస్ట్రిబ్యూటర్ విత్తనాలను డీలర్ల ద్వారా రైతులకు విక్రయించాల్సి ఉండగా స్వయానా ఆయనే అధిక రేట్లకు విత్తనాలు విక్రయిస్తున్నారని ఆరోపణలు రైతుల నుండి బహిర్గతమ‌వుతున్నాయి.

సంబంధిత శాఖ అధికారులే దగ్గరుండి ఆధార్ కార్డుల ఆధారంగా రైతులకు విత్తనాలు విక్రయించాలని ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తున్నారు. చాటుమాటున పెద్ద రైతులకు విత్తనాలను అధిక మొత్తంలో విక్రయించి సామాన్య, చిన్న, సన్నకారు రైతులకు విత్తనాలు దొరకకుండా చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. గతంలో కూడా వాజేడు మండలంలో యూఎస్ త్రి ఫోర్ వన్ ఒక బ్యాచ్ నెంబరు పెయిల్ అవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement