Tuesday, June 25, 2024

Exclusive – ఏపీ ఎన్నికల చరిత్రలోనే సంచలనం – బ్యాలెట్ కాదు..బుల్లెట్‌!


అన్ని పార్టీల్లో గుబులు
రెట్టింపు సంఖ్య‌లో పోస్ట‌ల్ బ్యాలెట్లు
5.39 లక్షల ఉద్యోగుల పలకరింత
3.5 లక్షల ఓట్లు వ్యతిరేకంపై అంచనా
బంట్రోతులు కాదు వారు రెబల్స్
క‌రువు భ‌త్యం, సీపీఎస్ పెను స‌వాల్‌
అధికార‌ పక్షం గుండెల్లో గునపాలు
శ్రీ‌కాకుళం, నంద్యాల జిల్లాలు టాప్‌
కొత్త సర్కారుకు స‌రికొత్త‌గా స్వాగ‌తం

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ఏపీలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో చాలా సంచలనం తప్పదు. అయిదేళ్లల్లో రూ.2.70 లక్షల కోట్లు ఖర్చుతో నవరత్నం సంక్షేమ ఫలాలను జనం నోటికి అందించి… వైనాట్ 175 నినాదంతో యుద్ధబరిలోకి దిగిన అధికార పార్టీ గుండెల్లో ఉద్యోగుల అలజడి ఆరంభమైంది. కరవు భత్యం నుంచి సీపీఎస్ విధానం వరకూ సర్కారు నిర్లక్ష్యంపై ఉద్యోగులు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. బ్యాలెట్ ఓటు వినియోగంలో ప్రజాస్వామ్య చరిత్రలోనే కొత్త పుటలతో పుంతలు తొక్కిన‌ట్టు అవ‌గ‌తం అవుతోంది. ఇక్కడే అటు అధికార పక్షం… ఇటు ప్రతిపక్షం గుండెల్లో గునపాలు దింపార‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

- Advertisement -

రికార్డు బ్రేక్…

పోస్టల్ బ్యాలెట్‌ వినియోగంలో ఏపీ ఉద్యోగులు నవ చరిత్ర సృష్టించారు. రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. దాదాపు 5.40ల‌క్ష‌ల‌ పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులు వినియోగించారు. 2019ఎన్నికల్లో 2,95,003 పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇప్పుడు అది రెట్టింపు సంఖ్యలో వచ్చింది. జిల్లాల వారీగా పోస్టల్ బ్యాలెట్ పోలైన ఓట్లు చూస్తే.. అత్యధిక ఓట్లు శ్రీకాకుళం జిల్లాలో పడ్డాయి. అక్కడ 38,865 మంది ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. తర్వాత నంద్యాల జిల్లాలో 25 వేల 283 మంది, కడప జిల్లాలో 24వేల 918 మంది పోస్టల్‌ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధాన్ని వినియోగించుకున్నారు. ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు. వారితోపాటు తొలిసారిగా ప్రవేశ పెట్టిన హోమ్‌ ఓటింగ్ విధానంలో 13,700 మంది 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 12,700 మంది దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్‌ తో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు భారీగా పెరిగిపోయాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా భారీగా పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు రావడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యంగా సాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉద్యోగుల ప్రభావం ఎంత?

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీ ఎన్నికల చరిత్రలోనే ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. యూటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ, ఎన్జీవో సంఘాల్లోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశాంత ఉద్యోగులు ఈ సారి ప్రత్యక్ష ఉద్యమాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ మనోభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు పోలింగ్ విషయంలోనూ తీవ్రంగా స్నందించారు. తాడేపల్లిగూడెంలో డెప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను పోలింగ్ బూత్ లోకి రానివ్వలేదు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థులను అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఒక రకంగా ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు. ఈ ప్రకారం ఓటింగ్ సరళిని పరిశీలిస్తే… ఒక ఉద్యోగి కుటుంబ సభ్యులూ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేయటం ఖాయమని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. అదే జరిగితే 5 లక్షల ఉద్యోగుల ఓట్లల్లో ప్రభుత్వానికి 30 శాతమే అనుకూల ఓట్లు పడతాయని, అంటే 1.5 లక్షల కుటుంబాలు వైసీపీకి మద్దతు పలికితే.. 3.5 లక్షల కుటుంబాలు వ్యతిరేకిస్తాయని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇదే జరిగితే 14 లక్షల ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడినట్టే. అంటే.. 0.46 శాతం ఓట్లు వ్యతిరేక ప్రభావం చూపినట్టే.

బ్యాలెట్ల లెక్కింపులోనే…

పోస్టల్ బ్యాలెట్‌ లెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌ను అక్కడ ఉన్న అభ్యర్థి ఏజెంట్లకు చూపించి అనంతరం అతి చెల్లుతుందా లేదా అని తేల్చాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్‌ కవర్‌ ఏ తోపాటు ఓటర్ డిక్లరేషన్ ఫామ్‌ విడిగా ఉంటే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. గెజిటెడ్ సంతకం లేకపోయినా ఓటు చెల్లదు. పోస్టల్ బ్యాలెట్ వెనుక ఆర్‌వో సంతకం ఉండాలి. అయితే ఈసారికి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఈసీకి రిక్వస్ట్ పెట్టింది. ముఖేష్‌కుమార్ మీనా మౌఖికంగా ఓకే చెప్పిన ఇంత వరకు అధికారిక ఉత్తర్వులు రాలేదని టీడీపీ చెబుతోంది. ఇలాంటి రూల్స్‌లో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా అలాంటి ఓట్లు చెల్లకుండా పోతాయి. 2019 ఎన్నికల్లో 56 వేలకుపైగా ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే 20 శాతానికిపైగా ఓట్లు పనికిరాకుండా పోయాయి. ఈసారి కూడా ఎన్ని చెల్లకుండా పోతాయో అన్న అనుమానం ఉంది. ఈ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాతే ఈవీఎంలను తెరుస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement